Ram Gopal Varma: 'ప్రస్తుతానికి ఆ సినిమాలను తీయడం లేదు'..

30 Dec, 2021 07:58 IST|Sakshi

‘‘సినిమాలు చూసి ప్రేక్షకుల ఆలోచనలు పూర్తిగా మారవనే అనుకుంటాను. ప్రతి మనిషి తాను ఉన్న పరిస్థితుల్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడు. ఆ నిర్ణయాలు వారి భవిష్యత్‌కు మంచి చేస్తే వారు మంచివారు, చెడు చేస్తే చెడ్డవారు అవుతారు. అందుకే నేను మంచి, చెడు అని చూడను’’ అని దర్శక–నిర్మాత రామ్‌గోపాల్‌ వర్మ అన్నారు. శ్రీకాంత్‌ అయ్యంగార్, సోనియా ఆకుల, వెంకట్, శ్రీధర్, ముని, నవీన్, కల్యాణ్, ప్రవీణ్, ప్రశాంతి ముఖ్య తారలుగా రామ్‌గోపాల్‌ వర్మ పర్యవేక్షణలో ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆశా.. ఎన్‌కౌంటర్‌’.

ఏవీఎస్‌ రాజు నిర్మాణ పర్యవేక్షణలో అనురాగ్‌ కంచర్ల నిర్మించిన ఈ చిత్రం జనవరి 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ – ‘‘ఈ ప్రాజెక్ట్‌ చేయాలనే ఆలోచన, ఇందుకు సంబంధించిన పరిశోధన, పబ్లిక్‌ డొమైన్‌లో ఉన్న ఇలాంటి ఓ సబ్జెక్ట్‌ను ఆడియన్స్‌కు ఎలాంటి కోణంలో చూపించాలి? అనే అంశాల పర్యవేక్షణ బాధ్యతలను మాత్రమే నేను చూసుకున్నాను. చిత్రాన్ని ఆనంద్‌ చంద్ర బాగా తీశాడు. నా డైరెక్షన్‌లో ‘కొండా’ సినిమా రిలీజ్‌కు రెడీ అయింది. అప్పట్లో నేను ప్రకటించిన అల్లు, న్యూక్లియర్‌ సినిమాలను ప్రస్తుతానికి నిలిపివేశాను. హీరో ఉపేంద్రతో సినిమా ఉంటుంది’’ అన్నారు.

ఇంకా మాట్లాడుతూ– ‘‘ఏపీలో సినిమా టిక్కెట్‌ ధరల విషయం గురించి మాట్లాడేందుకు నేను నిత్యావసర సరుకులు, వినియోగదారుల చట్టం వంటి వాటిని చదవలేదు. ఇందుకు సంబంధించిన సాంకేతిక పరమైన విషయాలపై కూడా నాకు పూర్తి అవగాహన లేదు. అయితే నా కామన్‌సెన్స్‌ ప్రకారం టిక్కెట్‌ ధరలు తక్కువగా ఉండటం కరెక్ట్‌ కాదేమో అనిపిస్తోంది. కానీ ఏదైనా ఒక వస్తువును కొనాలా? లేదా అనేది వినియోగదారుల ఇష్టంపై ఆధారపడి ఉంటుంది.

అయినా సినిమాల వల్ల రాబడి లేనప్పుడు నిర్మాతలు హీరోల పారితోషికాలు తగ్గించరు. సినిమా యూనిట్‌లోని మిగతా వారికి తగ్గిస్తారు. ప్రేక్షకులు థియేటర్స్‌కు వచ్చేది హీరోలను చూసేందుకు కాబట్టే హీరోల పారితోషికాలు తగ్గడం అనేది ఎప్పుడూ జరగదు’’ అని అన్నారు. 

చదవండి: ‘రాశి’ని వెంటాడుతున్న భయం.. ఎందుకో తెలియాలంటే..?
Year Ender 2021: వేడుకలు.. విషాదాలు...

మరిన్ని వార్తలు