సినిమా చూసి సంతోషంగా ఇంటికి వెళతారు

5 Jan, 2021 00:46 IST|Sakshi
దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్

‘‘కరోనా లాక్‌డౌన్‌ తర్వాత విడుదలైన ‘సోలో బ్రతుకే సో బెటర్‌’కి మంచి ప్రేక్షకాదరణ లభించడంతో మా అందరికీ ధైర్యం వచ్చింది. సంక్రాంతి అనేది అల్లుళ్ల పండుగ. అల్లుడు ఎలాంటివాడైనా అత్తమామలకు అదుర్సే.. అందుకే ఈ సంక్రాంతికి ‘అల్లుడు అదుర్స్‌’ టైటిల్‌తో వస్తున్నాం’’ అని దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా, నభానటేష్, అనూ ఇమ్మాన్యుయేల్‌  కథానాయికలుగా నటించిన చిత్రం ‘అల్లుడు అదుర్స్‌’. సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో గొర్రెల సుబ్రహ్మణ్యం నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న రిలీజవుతోంది. ఈ సందర్భంగా సంతోష్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ– ‘‘అల్లుడు అదుర్స్‌’ కథ చెప్పగానే బెల్లంకొండ సురేష్‌గారు ‘రాక్షసుడు’ తర్వాత సాయితో ఇలాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ జోనర్‌ సినిమా చేయాలని చూస్తున్నాను.

తప్పకుండా మనం ఈ సినిమా చేస్తున్నాం’ అన్నారు. నా ‘కందిరీగ’ సినిమాలో ఉన్నట్టే ఇందులో ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది. సినిమా చూసిన ప్రేక్షకులు ఫుల్‌గా ఎంజాయ్‌ చేసి సంతోషంగా ఇంటికెళ్తారు. కరోనా తర్వాత సోనూ సూద్‌ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ఆయన పాత్రలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేశాం. దేవిశ్రీ ప్రసాద్‌గారి సంగీతంతో మా సినిమా రేంజ్‌ పెరిగింది. బేసిక్‌గా నేను సినిమాటోగ్రాఫర్‌ని కాబట్టి 150 రోజుల్లో తీసే సినిమాని 110 రోజుల్లో పూర్తి చేయగలను. ఈ సంక్రాంతికి విడుదలయ్యే అన్ని సినిమాలూ మంచి విజయం సాధించి ఇండస్ట్రీకి మంచి రెవెన్యూ వస్తే ఫిబ్రవరిలో మరికొన్ని మంచి సినిమాలు వస్తాయి. ‘కందిరీగ’ సీక్వెల్‌ ‘కందిరీగ 2’ ఐడియా రెడీగా ఉంది. మరికొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి’’ అన్నారు.

మరిన్ని వార్తలు