కొలిక్కిరాని వివాదాలు!

23 Apr, 2021 00:50 IST|Sakshi

దర్శకుడు శంకర్‌ను చుట్టుముట్టిన వివాదాలు ఇప్పుడు తమిళ పరిశ్రమలో హాట్‌ టాపిక్‌. ‘ఇండియన్‌ 2’ నిర్మాణం, ‘అన్నియన్‌’ రీమేక్‌ చిత్రాల విషయంలో ఆయన వివాదాలు ఎదుర్కొంటున్నారు. ‘ఇండియన్‌ 2’ సినిమాను పూర్తి చేయకుండా దర్శకుడు శంకర్‌ మరో సినిమాను డైరెక్ట్‌ చేయకూడదని మద్రాస్‌ హైకోర్టులో చిత్రనిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ కేసు వేసిన సంగతి తెలిసిందే. రామ్‌చరణ్‌ హీరోగా తన దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్లు శంకర్‌ ప్రకటించిన తర్వాత కోర్టుని ఆశ్రయించింది లైకా.

ఈ నేపథ్యంలో ‘ఇండియన్‌ 2’ సినిమా విషయంలో కోర్టు జోక్యంతో సానుకూలత ఏర్పడదని, రెండు పక్షాలవారు ఆలోచించుకుని ఓ సానుకూల నిర్ణయానికి రావాలని కేసుని విచారించిన కోర్టు అభిప్రాయపడింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 28కి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. ప్రముఖ తమిళ నటుడు వివేక్‌ హఠాన్మరణం కూడా ‘ఇండియన్‌ 2’ని ఇరుకుల్లో పడేసింది. ఆయన పాత్రకు సంబంధించిన సన్నివేశాలు ఇంకా పూర్తి కాలేదు. సినిమా పూర్తి చేయాలంటే వివేక్‌ ఉన్న సీన్స్‌ను మళ్లీ మరో నటుడితో చిత్రీకరించాలని శంకర్‌ పేర్కొన్నారు. కాగా.. కమల్‌హాసన్‌తో ఓ సినిమాలో అయినా స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాలన్నది వివేక్‌ కల. ఆ కల పూర్తి స్థాయిలో నిజం కాకుండానే వివేక్‌ మరణించడం బాధాకరమని ఆయన ఫ్యాన్స్‌ ఆవేదన చెందుతున్నారు.
మరి.. ‘ఇండియన్‌ 2’, ‘అన్నియన్‌’ చిత్రాల వివాదాలకు ఎలా తెరపడనుందో చూడాలి.

శంకర్‌ స్పందన కోసం చూస్తున్నాం!  – సౌత్‌ ఇండియన్‌ ఫిలిమ్‌ ఛాంబర్‌
‘అన్నియన్‌’ (తెలుగులో ‘అపరిచితుడు’) సినిమా రీమేక్‌ రైట్స్‌ గురించి ఈ చిత్రదర్శకుడు శంకర్, చిత్రనిర్మాత రవిచంద్రన్‌ల మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా హిందీలో రీమేక్‌ చేయనున్నట్లు ఇటీవల శంకర్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో చిత్రనిర్మాతగా ‘అన్నియన్‌’ రీమేక్‌ రైట్స్‌ తనవే అని ఆస్కార్‌ రవిచంద్రన్, దర్శకుడిగా రీమేక్‌ హక్కులు తనవేనని శంకర్‌ ఎవరికివారు బహిరంగ లేఖలను విడుదల చేశారు. తాజాగా శంకర్‌పై సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో ఫిర్యాదు చేశారు నిర్మాత రవిచంద్రన్‌.

‘‘రవిచంద్రన్‌ మా సంస్థ సభ్యుడు. ‘అన్నియన్‌’ రీమేక్‌ రైట్స్‌ విషయంలో ఆయన శంకర్‌పై ఫిర్యాదు చేశారు. ఇప్పుడు మేం శంకర్‌ స్పందన కోసం ఎదురు చూస్తున్నాం. మామూలుగా అయితే రీమేక్‌ రైట్స్‌ నిర్మాతలకే ఉంటాయి. ఒక నిర్మాత నిర్మించిన సినిమాను వేరే నిర్మాతతో  రీమేక్‌ చేయాలన్నప్పుడు ఆ దర్శకుడు సదరు నిర్మాతకు కూడా కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇటువంటి కేసులు గతంలో కొన్ని ఉన్నాయి. కానీ ‘అన్నియన్‌’ సినిమా విడుదలై చాలా రోజులయింది కాబట్టి ఈ విషయంపై ప్రస్తుతం నేనేం కామెంట్‌ చేయలేను’’ అని సౌత్‌ ఇండియన్‌ ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌కి చెందిన రవి కొట్టాక్కర పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు