SS Rajamouli: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌పై దర్శకధీరుడి అసహనం.. ట్వీట్‌ వైరల్‌

2 Jul, 2021 12:43 IST|Sakshi

Delhi Airport : ఢిల్లీ విమానాశ్రయంలో ఉన్న పరిస్థితులపై దర్శకధీరుడు రాజమౌళి తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఎయిర్‌ పోర్ట్‌లో కనీస వసతులు లేవని, తొలిసారి భారత్‌కు వచ్చే విదేశీయులకు ఇది చెడు అభిప్రాయం కలిగించేలా ఉందని ట్వీటర్‌ వేదికగా అసంతృప్తిని వ్యక్తం చేశాడు. 

‘అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాను. ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ కోసం దరఖాస్తులు  ఇచ్చి వాటిలో తగిన సమాచారాన్ని రాసి ఇవ్వమన్నారు. ఆ పత్రాలు నింపడం కోసం కొంతమంది ప్రయాణికులు గోడలకు ఆనుకుని.. మరి కొంతమంది నేలపైనే కూర్చొని వాటిని పూర్తి చేసి ఇచ్చారు. అక్కడ పరిస్థితి చూడడానికి ఏమీ బాలేదు. ఇటువంటి వాటి కోసం చిన్న టేబులైనా ఏర్పాటు చేయాల్సింది. ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు వచ్చే ద్వారం వద్ద ఎన్నో వీధి కుక్కలు ఉన్నాయి. ఇలాంటివి చూస్తే విదేశీయులకు మన దేశంపై ఎలాంటి భావన కలుగుతుందో ఒకసారి ఆలోచించండి. దయచేసి వీటిపై దృష్టి సారించండి ’అని రాజమౌళి ట్వీట్‌ చేశారు.

ఇక సినిమా విషయాలకొస్తే.. ప్రస్తుతం జక్కన్న యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌లలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’అనే పాన్‌ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.  పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు అలరించనున్నాడు. ఒలివియా మోరిస్, ఆలియా భట్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. రెండు పాటలు మినహా షూటింగ్‌ అంతా పూర్తయింది. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్‌ 13న ప్రేక్షకుల మందుకు రానుంది. 

మరిన్ని వార్తలు