Pushpa: అందుకే క్లైమాక్స్‌ అలా పెట్టాం : సుకుమార్‌

19 Dec, 2021 04:37 IST|Sakshi

– సుకుమార్‌

‘‘నా చిన్నతనంలో చాలా కష్టాలు పడ్డానంటే నా తల్లితండ్రులను తక్కువ చేసినట్లు అవుతుంది. ఉన్నంతలో నేను బాగానే పెరిగాను.. టీచర్‌ అయ్యాను. డైరెక్టర్‌ కావాలని, పెద్ద పెద్ద సినిమాలు తీయాలని కష్టాలను కొనితెచ్చుకుంది నేనే. అయినా ఇష్టంతో చేసినప్పుడు ఏది కూడా కష్టం కాదు. ఒకవేళ కష్టంగా అనిపించినా అదీ ఆనందమే’’ అని దర్శకుడు సుకుమార్‌ అన్నారు. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పుష్ప’. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన తొలి పార్టు ‘పుష్ప: ది రైజ్‌’. ముత్తం శెట్టి మీడియా సహ నిర్మాత. అయితే ఈ చిత్రం ఈ నెల 17న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో  సుకుమార్‌ పంచుకున్న విశేషాలు....  

► ‘పుష్ప: ది రైజ్‌’కు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన సంతోషాన్నిస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా వేసవిలో విడుదల చేయాలనే ఆలోచన చేశాం. కానీ కరోనా పరిస్థితుల భయం వల్ల ఈ నెల 17నే రిలీజ్‌ చేయాలని నిర్ణయించుకున్నాం.. అందుకే పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌తో ఫుల్‌ బిజీ అయిపోయాను.  రిలీజ్‌కు సమయం తక్కువ ఉండటం వల్ల కాస్త ఇబ్బంది పడ్డాం. డబ్బులు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు అది వ్యాపారమే అవుతుంది. సో... నేను బాక్సాఫీసు నంబర్స్‌ గురించి ఆలోచిస్తాను.

► ‘పుష్ప’ చిత్రాన్ని ముందుగా వెబ్‌ సిరీస్‌గా తీయాలనుకున్నాను. కానీ ఆ తర్వాత సినిమాగా అనుకున్నాం.. అది కాస్తా రెండు పార్టులు అయ్యింది. ఓ కూలీ స్మగ్లింగ్‌ సిండికేట్‌ను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు అన్న విషయాన్నే ‘పుష్ప: ది రైజ్‌’లో చూపించాము. పుష్పరాజ్‌ చిన్నతనం నాటి సంఘటనలు, అతని మనస్తత్వం ఎందుకు అలా మారింది? అనే విషయాలన్నీ సెకండ్‌ పార్టులోనే కనిపిస్తాయి.

► పుష్పరాజ్‌గా అల్లు అర్జున్‌ చాలా కష్టపడ్డాడు. చిత్తూరు యాస నేర్చుకున్నాడు. సెట్స్‌లో తోటి నటీనటులను కూడా ఇన్‌స్పైర్‌ చేసేవాడు. నా సినిమాల్లో కొన్ని రియల్‌లైఫ్‌ క్యారెక్టర్ల రిఫరెన్స్‌లు ఉంటాయి. ఈ సినిమాలో కూడా ఉన్నాయి. రావు రమేష్‌ వంటి వారు ఇండస్ట్రీలో ఉండటం మన అదృష్టం. ఆయన ఎలాంటి పాత్రలైనా చేయగలరు. సునీల్‌ (మంగళం శీను), అనసూయ (దాక్షాయణి) పాత్రకు రెండో పార్టులో మంచి ప్రాధాన్యం ఉంటుంది. ‘పుష్ప: ది రైజ్‌’ క్లైమాక్స్‌ గురించి విభిన్నమైన మాటలు వినిపించాయి. కానీ ఆ క్లైమాక్స్‌ ఎందుకు అలా ఉందో సెకండ్‌ పార్టులో తెలుస్తుంది. ఫాహద్‌ఫాజిల్‌ క్యారెక్టర్‌ మరింతగా సెకండ్‌పార్టులో తెలుస్తుంది. ఫస్ట్‌పార్టులో ఉన్న క్యారెక్టర్సే సెకండ్‌ పార్టులో కూడా కంటిన్యూ అవుతాయి. ఒకటి రెండు పాత్రలు యాడ్‌ కావొచ్చు.

► ‘పుష్ప: ది రైజ్‌’కు హిందీలో కూడా మంచి కలెక్షన్స్‌ వస్తున్నాయి. హిందీలో ఈ సినిమాను ప్రమోట్‌ చేయమని దర్శకులు రాజమౌళిగారు తిడుతున్నప్పటికీని సమయాభావం వల్ల చేయలేకపోయాం. ∙ఈ సినిమాలోని స్పెషల్‌సాంగ్‌ చేయడానికి ముందు సమంత అంగీకరించలేదు.. నేను కన్విన్స్‌ చేశాను. ‘రంగస్థలం’లో పూజాహెగ్డే స్పెషల్‌ సాంగ్‌ చేశారు. ఒక యాక్టర్‌ అన్ని విధాలుగా నటించగలగాలి. ఒక బ్యాక్‌డ్రాప్‌లో ఎన్ని కథలైనా రావొచ్చు. మహేశ్‌బాబుతో నేను అనుకున్న కథ వేరు. ‘పుష్ప’ కాదు. ‘పుష్ప: ది రూల్‌’ తర్వాత విజయ్‌ దేవరకొండతో సినిమా చేస్తా. ‘ఆర్య 3’ గురించి భవిష్యత్‌లో ఆలోచిస్తాను.

► ‘ఆర్య’ సమయంలో నాకు సినిమాలంటే లవ్‌స్టోరీలే అన్నట్లు అనిపించింది. ఆ తర్వాత డిఫరెంట్‌ సినిమాలు చేశాను. ఇప్పుడు లవ్‌స్టోరీస్‌ ఆలోచనలు రావడం లేదంటే నాకు వయసవుతున్నట్లే లెక్క (సరదాగా...). 2014 నుంచి పుస్తకాలు చదవడాన్ని మానేశాను. మళ్లీ స్టార్ట్‌ చేయాలనుకుంటున్నాను. కరోనా సమయంలో కొన్ని కథలను రెడీ చేశాను. సినిమాలతో బిజీగా ఉండటం వల్ల వెబ్‌ సిరీస్‌ల ఆలోచనలేదు.

మరిన్ని వార్తలు