45 మంది కొత్త వారితో 'చిత్రం' సీక్వెల్‌

22 Feb, 2021 16:03 IST|Sakshi

డైరెక్టర్‌ తేజ గతేడాది రెండు సినిమాలు ప్రకటించాడు. ఒకటి గోపీచంద్‌తో 'అలిమేలుమంగ వేంకటరమణ' కాగా మరొకటి దగ్గుబాటి రానాతో 'రాక్షసరాజు రావణాసురుడు'. ఈ రెండు సినిమాలు ఇంకా షూటింగ్‌కు నోచుకోనేలేదు, అప్పుడే మరో కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. తొలి ప్రయత్నంలోనే తనకు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన చిత్రం మూవీకి సీక్వెల్‌ "చిత్రం 1.1" తీస్తున్నట్లు వెల్లడించాడు. ఈ సినిమా షూటింగ్‌ మార్చిలో షురూ కానున్నట్లు పేర్కొన్నాడు. సోమవారం తన పుట్టిన రోజు సందర్భంగా తేజ ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో అధికారికంగా తెలిపాడు. అంతే కాదు, ఇందులో 45 మంది కొత్త వాళ్లు నటించనున్నట్లు చెప్పుకొచ్చాడు.

కాగా 2000 సంవత్సరంలో వచ్చిన 'చిత్రం' సినిమాతో తేజ టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆర్పీ పట్నాయక్‌ కూడా ఈ చిత్రంతోనే సంగీత దర్శకుడిగా ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఉదయ్‌ కిరణ్‌, రీమాసేన్‌ జంటగా నటించిన ఈ మూవీ అప్పట్లో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. మళ్లీ 21 ఏళ్ల తర్వాత దీనికి సీక్వెల్‌ తీయడానికి రెడీ అవుతున్నాడు తేజ. తన సినిమాల ద్వారా ఎందరో నటీనటులకు లైఫ్‌ ఇచ్చిన తేజ ఈసారి ఇండస్ట్రీకి ఎవర్ని పరిచయం చేస్తారనేది టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సీక్వెల్‌ మరోసారి 'చిత్రం' మ్యాజిక్‌ రిపీట్‌ చేస్తుందా అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.

చదవండి: తేజ సినిమా: కాజల్‌ పోయి.. తాప్సీ వచ్చే

బన్నీని పోలీసులు అలా వాడేసుకున్నారన్నమాట!

మరిన్ని వార్తలు