అంతకుమించి సాధించేది ఏముంటుంది

19 Jan, 2023 06:19 IST|Sakshi

– వంశీ పైడిపల్లి

‘‘వారసుడు’ సినిమా క్లయిమాక్స్‌లో తండ్రీకొడుకుల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు మా మనసులను హత్తుకున్నాయి అంటూ ప్రతి రోజూ నాకు ఫోన్‌ కాల్స్‌ చేస్తున్నారు. మా నాన్న కూడా ‘వారసుడు’ చూసి భావోద్వేగానికి లోనై ఇన్నేళ్లలో తొలి సారి నన్ను హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతకుమించి నేను సాధించేది ఏముంటుంది?’’ అని డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి అన్నారు.

విజయ్, రష్మికా మందన్న జంటగా నటించిన తమిళ చిత్రం ‘వారీసు’. ‘దిల్‌’ రాజు, శిరీష్, పరమ్‌ వి. పొట్లూరి, పెరల్‌ వి. పొట్లూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న తమిళంలో విడుదలైంది. ఈ చిత్రాన్ని ‘వారసుడు’ పేరుతో తెలుగులో డబ్‌ చేసి, ఈ నెల 14న రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా వంశీ పైడిపల్లి పంచుకున్న విశేషాలు.

► ‘ఊపిరి’ని తెలుగు, తమిళ భాషల్లో తీశాం. ‘వారీసు’ని తమిళంలో తీసి,  తెలుగులోకి డబ్‌ చేశాం. తమిళంలో నేను తీసిన తొలి సినిమా ‘వారీసు’ పెద్ద హిట్‌ కావడం హ్యాపీ. తెలుగులోనూ ఈ సినిమా త్వరలో ‘మాస్టర్‌’ (విజయ్‌ హీరోగా నటించారు) కలెక్షన్లను బీట్‌ చేయబోతోంది. ‘దిల్‌’ రాజుగారికి ఈ సినిమా డబ్బుతో పాటు గౌరవం తెచ్చి పెట్టింది. మౌత్‌ టాక్‌ వల్ల ఈ చిత్రానికి ఆదరణ పెరుగుతోంది. సినిమా చూసిన యువకులు తమ అవ్వ, తాతలు, ఇతర కుటుంబ సభ్యులకు ఈ చిత్రాన్ని చూడమని చెప్తున్నారు. హిందీలో కూడా మా సినిమాకి ఆదరణ పెరుగుతోంది.

► నేను ఓ లైన్‌ సిద్ధం చేసుకుని హీరోలకు వినిపిస్తాను.. వారు ఓకే అన్న తర్వాత వారి ఇమేజ్‌కి తగినట్లుగా సన్నివేశాలను రూపొందిస్తాను. ప్రతిసారీ మమ్మల్ని మేము నిరూపించుకోవాలి. అందుకే నా ప్రతి చిత్రాన్ని ఛాలెంజ్‌గా స్వీకరిస్తుంటాను. 2020లో మహేశ్‌బాబుగారితో ఓ సినిమా చేయాల్సింది. కొన్ని కారణాల వల్ల కుదరలేదు. పెద్ద స్టార్స్‌తో కమర్షియల్‌ సినిమాలు చేయడానికే నేను ఇండస్ట్రీకి వచ్చాను. నా తర్వాతి ప్రాజెక్ట్‌ కోసం ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.  

మరిన్ని వార్తలు