Balagam: ‘బలగం’ కోసం ఆరేళ్లు పరిశోధన చేశా.. గడ్డం సతీష్ కథ చదవలేదు: వేణు

5 Mar, 2023 13:55 IST|Sakshi

బలగం చిత్ర కథ వివాదంపై స్పందించిన దర్శకుడు వేణు

బలగం సినిమా వివాదంపై ఆ చిత్ర దర్శకుడు వేణు స్పందించాడు .ఈ సినిమా సినిమా కథ తనదే అని గడ్డం సతీష్‌ అనడం హాస్యాస్పదం అన్నారు.  తన కుటుంబంలో జరిగిన సంఘటనలతో ఈ కథను రాసుకున్నట్లు వేణు చెప్పారు. 2011లో తాను రాసిన పచ్చి కి కథలో కాస్త మార్పులు చేసి బలగం చిత్రాన్ని తెరకెక్కించారని జర్నలిస్ట్‌ గడ్డం సతీష్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం బలగం చిత్ర దర్శకుడు వేణు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ..  జర్నలిస్ట్‌ సతీష్ మా సినిమాను అబాసుపాలు చేయడం సబబు కాదన్నారు.

‘బలగం కథ మా కుటుంబంలో జరిగిన కథ.  మా నాన్న చనిపోయినప్పుడు ఈ పాయింట్‌ నా మైండ్‌లో మెదిలినది. మాది ఉమ్మడి కుటుంబం. మా కుటుంబంలో సుమారు 100 మంది ఉంటాం. కాకి ముట్టడు అనేది తెలంగాణ సంప్రదాయ కాదు తెలుగు సంప్రదాయం. నా స్నేహితుడు ప్రదీప్ అద్వైతం ప్రోత్సాహంతో కథగా మలిచాను. ఈ కథ మొదట నా మిత్రుడు,  జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కు చెప్పా. పిట్ట ముట్టుడులో అసలు వాస్తవాలెంటేనేది చాలా గ్రామాలకు తిరిగి అధ్యయనం చేశా. నేను రాసింది కథ కాదు ప్రజల జీవితాల్లో జరిగే చర్యలు. ఆరేళ్లు ఈ కథపైనే పరిశోధన చేశాను.

గడ్డం సతీష్ రాసిన కథ నేను చదవలేదు. నా కథ చరిత్రలో ఉన్న సంప్రదాయం. పిట్ట ముట్టుడు సంప్రదాయం ఎవరి సొత్తు కాదు. తెలుగు సంప్రదాయాలు, సంస్కృతిపై ఒక్కొక్కరు ఒకలా స్పందిస్తారు. సతీష్ మా సినిమాను అబాసుపాలు చేయడం సబబు కాదు. కథ తనదే అయితే రచయితల సంఘాన్ని సతీష్ గడ్డం ఎందుకు సంప్రదించలేదు? దిల్ రాజు ఈ సినిమాను తీయకపోతే తెలంగాణ సంస్కృతిలో ఈ పాయింట్ ప్రపంచానికి ఎలా తెలిసేది. బలగం సినిమా వల్ల ఎన్నో మంచి కథలు రాబోతున్నాయి. దిల్ రాజు బొమ్మను వాడి సతీష్ చిల్లర ప్రయత్నం చేస్తున్నారు. బలగం సినిమాకు దిల్ రాజు ముందు ఉండటం వల్ల తెలంగాణ సంస్కృతి ఏంటో తెలిసింది’ అని వేణు అన్నారు.

మరిన్ని వార్తలు