Director Venu Udugula: ఆ నేపథ్యంలో వస్తున్న తొలి ప్రేమకథ ఇది

9 Jun, 2022 09:20 IST|Sakshi
డైరెక్టర్‌ వేణు ఊడుగుల  

‘‘ఒక నిజాయితీ ఉన్న గొప్ప ప్రేమకథా చిత్రం ‘విరాటపర్వం’. ఫ్యామిలీ అంతా కలసి చూడాల్సిన సినిమా’’ అని దర్శకుడు వేణు ఊడుగుల అన్నారు. రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు వేణు ఊడుగుల విలేకరులతో పంచుకున్న విశేషాలు.. 

‘‘నేను పుట్టి పెరిగిన వాతావరణం, చూసిన జీవితం, చదివిన పుస్తకాలు.. నేను ఎలాంటి సినిమా తీయాలనే ఒక విజన్‌ని ఇచ్చాయి. 1992లో జరిగిన ఒక సంఘటన ఆధారంగా తెరకెక్కించిన సినిమా ‘విరాటపర్వం’. ఎవరి బయోపిక్‌ కాదు. ఓ రాజకీయ సందర్భాన్ని ఒక వ్యక్తిగతమైన సంఘర్షణగా సినిమాలో చూపిస్తున్నాం. మానవ సంబంధాల నేపథ్యంలో చెప్పే కథలను  ప్రేక్షకులు ఎప్పుడూ గొప్పగా ఆదరిస్తారు. ‘విరాటపర్వం’ నక్సల్‌ నేపథ్యంలో వస్తున్న తొలి ప్రేమకథ. కొత్తగా ఉంటుంది’’ అన్నారు.

‘‘విరాటపర్వం’ కథ సురేష్‌బాబుగారికి నచ్చడంతో రానాగారికి చెప్పమన్నారు. రానాగారికి నచ్చి ఒప్పుకున్నారు. ఈ కథ రాస్తున్నప్పుడే కలలో సాయి పల్లవి హీరోయిన్‌ పాత్రలో కనిపిస్తుండేది. పది నిమిషాల కథ విని ఆమె ఓకే చెప్పారు.  ∙ ‘విరాటపర్వం’ని ఇతర భాషల్లో డబ్‌  చేసి, రిలీజ్‌ చేసేందుకు నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. ‘ఆహా’ కోసం ‘మైదానం’ సినిమా తీస్తున్నాం. చలంగారు రాసిన నవల మనదైన వ్యాఖ్యానంతో ఉంటుంది. దీనికి షో రన్నర్‌గా చేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చాడు.

మరిన్ని వార్తలు