సినీ అవకాశాల పేరుతో యువతులకు వల..దర్శకుడి అరెస్ట్‌

4 Sep, 2022 09:01 IST|Sakshi

సాక్షి, చెన్నై: సినిమా అనేది రంగుల ప్రపంచం. దీనిలో మోసగించేవారు, మోసాలకు గురయ్యేవారు ఎందరో. ముఖ్యంగా మగువలు సినీ అవకాశాల పేరుతో మోసపోయి ప్రాణాలను కోల్పోతున్నారు. ఇలా సినీ అవకాశాల పేరుతో అమ్మాయిల భావాలతో ఆడుకున్న ఒక దర్శకుడు ఇప్పుడు జైలులో ఊచలు లెక్కపెడుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. సేలంలో సినిమా కంపెనీ కార్యాలయాన్ని నిర్వహిస్తున్న దర్శకుడు వేల్‌ క్షత్రియన్‌. అవకాశాలు పేరుతో యువతులను అశ్లీల ఫొటోలను, వీడియోలను చిత్రీకరించి వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నాడు.

అతనికి సహకరించిన జయజ్యోతి అనే సహాయకురాలి బండారాన్ని అదే కార్యాలయంలో పని చేసే ఇరుప్పాళ్యంకు చెందిన జననీ (పేరు మార్పు) బయటపెట్టింది. వారి అరాచకాలు గురించి సూరమంగళం మహిళా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అందులో తాను పని చేసే సినిమా కంపెనీలో వీరప్పన్‌ పాలమూరుకు చెందిన దర్శకుడు వేల్‌ క్షత్రియన్‌. అతని సహాయకురాలు రాజపాళ్యంకు చెందిన జయజ్యోతి సినిమా అవకాశాల పేరుతో అనేక మంది యువతులను సెల్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలను చిత్రీకరించి వాటితో బెదిరించి వారి జీవితాలను పాడు చేస్తున్నారని పేర్కొంది.

కేసు నమోదు చేసిన ఇన్‌స్పెక్టర్‌ సుబ్బులక్ష్మి నేతృత్వంలో పోలీసులు విచారణ జరిపారు. దీంతో దర్శకుడు వేల్‌ క్షత్రియన్‌ గుట్టురట్టు అయ్యింది. అతని కార్యాలయంలో తనిఖీలు చేసి 30కి పైగా హార్డ్‌ డిస్క్‌లు, ల్యాప్‌ట్యాప్, పెన్‌డ్రైవ్‌లు, కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ హార్డ్‌డిస్క్‌లో 300 మందికి పైగా అమ్మాయిల అశ్లీల వీడియో దృశ్యాలు ఉండటంతో పోలీసులే అవాక్కయ్యారు. దీంతో ఆ ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.  
చదవండి: వైరల్‌గా మోదీ, బీజేపీపై సమంత కామెంట్స్‌, మండిపడుతున్న నెటిజన్లు!

మరిన్ని వార్తలు