మరీ అంత డర్టీ కాదు!

20 Dec, 2020 00:22 IST|Sakshi

రివ్యూ టైమ్‌

చిత్రం: ‘డర్టీ హరి’; తారాగణం: శ్రవణ్‌ రెడ్డి, సిమ్రత్‌ కౌర్, రుహానీ శర్మ, సురేఖావాణి; సంగీతం: మార్క్‌ కె. రాబిన్‌; కెమెరా: బాలరెడ్డి; నిర్మాతలు: గూడూరు సతీశ్‌ బాబు, గూడూరు సాయిపునీత్‌; రచన, దర్శకత్వం: ఎం.ఎస్‌. రాజు; ఏ.టి.టి: ఫ్రైడే మూవీస్‌.

ఒకటే పాట. అంతకు మించి పాటలు లేవు. కామెడీ లేదు. అడల్ట్‌ సీన్లు మినహాయిస్తే... రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలో కనపడేవేవీ లేవు. ఒకరకంగా మొదలైన సినిమా మరో రకంగా ముగుస్తుంది. అయినా సరే, ఓ సినిమా మరీ అసంతృప్తికి గురి కానివ్వకపోవడం, జనాన్ని ఆద్యంతం కూర్చోబెట్టగలగడం విశేషమే. దర్శకుడిగా ఎం.ఎస్‌. రాజు చేసిన మ్యాజిక్‌... అదే ‘డర్టీ హరి’. బహుశా, అందుకే వివాదాస్పద వాల్‌ పోస్టర్లు, ట్రైలర్లతో వార్తల్లోకి వచ్చిన ‘డర్టీ హరి’ చూస్తున్నప్పుడు ఉన్నట్టుండి సర్‌ప్రైజ్‌ చేస్తుంది. అంతదాకా పెట్టుకున్న అంచనాలను మార్చేస్తుంది. అదే ఈ సినిమాకు ఉన్న బలం.

కథేమిటంటే..: చేయి తిరిగిన చెస్‌ ప్లేయర్‌ హరి (శ్రవణ్‌ రెడ్డి). ఎలాగైనా జీవితంలో పైకి రావాలనే యాంబిషన్‌ ఉన్న ఆ కుర్రాడు అవకాశాల వేటలో హైదరాబాద్‌కు వస్తాడు. అక్కడ ఓ బడా కంపెనీ దంపతుల (అంబరీష అప్పాజీ, సురేఖావాణి) కుమార్తె – పెయింటరైన వసుధ (రుహానీ శర్మ)తో ప్రేమలో పడతాడు. మరోపక్క వసుధ కజిన్, హరికి స్నేహితుడూ అయిన ఆకాశ్‌ ఏమో సినిమాల్లోకి పైకి రావాలని ప్రయత్నిస్తున్న మోడల్‌ గర్ల్‌ జాస్మిన్‌ (సిమ్రత్‌ కౌర్‌)తో ప్రేమలో ఉంటాడు.

వసుధతో ప్రేమ పెళ్ళి పీటలకెక్కే దశలో ఉన్నప్పటికీ, హరి మాత్రం తన స్నేహితుడి లవర్‌ మీద కన్నేస్తాడు. జాస్మిన్‌ కూడా హరికి లొంగిపోతుంది. తీరా ఆకాశ్‌తో ఆమె ప్రేమ బ్రేకప్‌ అవుతుంది. వసుధతో పెళ్ళయిపోయినా సరే జాస్మిన్‌తో ఎఫైర్‌ను మన యాంబిషియస్‌ హరి కొనసాగిస్తాడు. ఆ క్రమంలో జాస్మిన్‌ గర్భవతి అవుతుంది. ఆ వ్యవహారం చివరకు ఎక్కడ దాకా వెళ్ళింది, హరి వైవాహిక జీవితం ఏ మలుపు తిరిగింది, ఏమైంది అన్నది ఆసక్తికరంగా సాగే చివరి ముప్పావుగంట మిగతా కథ.

ఎలా చేశారంటే..: దాదాపు రెండు గంటల సినిమాకు ప్రధాన బలం ప్రధాన పాత్రల్లో హరిగా నటించిన శ్రవణ్‌ రెడ్డి, జాస్మిన్‌గా కనిపించిన పంజాబీ పిల్ల సిమ్రత్‌ కౌర్‌. ఈ హీరోయిన్‌ గతంలో ‘పరిచయం’ లాంటి ఒకటీ అరా సినిమాల్లో చేసింది. కొంతకాలంగా ముంబయ్‌లో హిందీ సినిమాలు, సిరీస్‌లలో స్థిరపడ్డ తెలంగాణలోని కరీంనగర్‌ కుర్రాడైన శ్రవణ్‌ రెడ్డికి తెలుగులో ఇదే తొలి పెద్ద ఛాన్స్‌. అలా ఈ ప్రధాన పాత్రధారులిద్దరూ మన ప్రేక్షకులకు కొత్త ముఖాల కిందే లెక్క. అయినప్పటికీ, క్యారెక్టరైజేషన్‌లో కొన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ ఇద్దరూ తెరపై ఆకట్టుకుంటారు.

ఫస్టాఫ్‌లో కథానుగుణంగా హీరో స్వభావాన్ని ఎస్టాబ్లిష్‌ చేసే క్లిష్టమైన అడల్ట్‌ సీన్లలో అచ్చంగా పాత్రలలానే ప్రవర్తించారు. ఇక, జీవితంలో పైకి ఎదగడానికి ఎత్తులు పైయెత్తుల ఆట, కళ్ళలోనే కనిపించేసే కామం, మనసులోని చెడును కనపడనివ్వకుండా పైకి మంచిగా ప్రవర్తించే తీరు, కోపం – ఇలా బోలెడన్ని వేరియేషన్లను హరి పాత్రలో శ్రవణ్‌ రెడ్డి బాగా చూపించారు. కడుపు పండాలని ఆరాటపడే అమ్మాయిగా రుహానీ శర్మ ఉన్నంతలో బాగానే చేశారు. మిగిలిన పాత్రలన్నీ కథానుగుణంగా వచ్చిపోతుంటాయి. చివరలో వచ్చే పోలీసు ఇంటరాగేషన్‌ సీన్ల లాంటివి మరికొంత బలంగా రాసుకొని ఉంటే ఇంకా బాగుండేది.

ఎలా తీశారంటే..: ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ లాంటి అభిరుచి గల చిత్రాలు నిర్మించి, భారీ విజయాలు అందుకున్న ప్రముఖ నిర్మాత ఎం.ఎస్‌. రాజుకు దర్శకుడయ్యాక లభించిన సక్సెస్‌ శూన్యం. ఈ నేపథ్యంలో ఆయన తన ట్రెండ్‌ మార్చి, ‘డర్టీ హరి’ లాంటి పేరుతో, పెద్దలకు మాత్రమే కంటెంట్‌తో న్యూ ఏజ్‌ సినిమా తీస్తుంటే సహజంగానే ఆశ్చర్యమేస్తుంది. తీరా సినిమా చూశాక కథాగమనం, కథలోని ట్విస్టులతో ఆశ్చర్యం పెరుగుతుంది. అందుకే, ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ – దర్శకుడు ఎం.ఎస్‌. రాజే!

దర్శక – రచయిత, నిర్మాతలు ఎవరూ పైకి చెప్పకపోయినా, సినీ ప్రియులు ఈ కథకు మూలం ఇట్టే చెప్పేస్తారు. ఉడీ అలెన్‌ రచన, దర్శకత్వంలో పదిహేనేళ్ళ క్రితం వచ్చిన హాలీవుడ్‌ సినిమా ‘మ్యాచ్‌ పాయింట్‌’ (2005) కథను మనవాళ్ళు యథాతథంగా తీసుకొని, చివరి ఘట్టాలను మనదైన పద్ధతిలో మార్చేసుకున్నారు. ఆకట్టుకొనేలా, తెలివిగా ఆ కాపీ కొట్టడమే అసలైన సినీ ట్రేడ్‌ సీక్రెట్‌. హైక్లాస్‌ జీవితాన్ని చూపించే నేపథ్య నిర్మాణ విలువలు మొదలు కీలకమైన ఘట్టాల్లో రీరికార్డింగ్, కెమెరా వర్క్‌ దాకా అనేకం బాగా తీర్చిదిద్దారు. పనిలో పనిగా నవతరంలోని హైక్లాసు వర్గం వాడే అశ్లీల పదాలు ఈ సినిమాలో యథేచ్ఛగా వినిపిస్తాయి.

ఫస్టాఫ్‌లో, అలాగే సెకండాఫ్‌ మొదట్లో కాసేపు శృంగారం మోతాదు మించి చూపించినా, చివరి ముప్పావుగంట థ్రిల్లింగ్‌ అంశాలు వాటిని మర్చిపోయేలా చేస్తాయి. ఒక్కమాటలో... ఫస్టాఫ్‌ డర్టీనెస్, క్లైమాక్స్‌ హెవీ హార్టెడ్‌నెస్‌ ఫీలింగ్‌! చూడడం పూర్తయ్యాక, సినిమా సంతృప్తిగా ఉందనే భావన కలిగిస్తాయి. చాలా గ్యాప్‌ వచ్చిన ఎం.ఎస్‌. రాజు మళ్ళీ లైమ్‌ లైట్‌లోకి వచ్చారనిపించేలా చేస్తాయి. అయితే, వచ్చిన చిక్కల్లా... థియేటర్లు పూర్తిగా ఓపెన్‌ కాని పరిస్థితుల్లో... ఎన్నిసార్లు చూస్తే, అన్నిసార్లు డబ్బులు కట్టి చూసే ‘పే పర్‌ వ్యూ’ పద్ధతిలో, టెక్నికల్‌ ఇబ్బందులుండే కొత్త ‘ఎనీ టైమ్‌ థియేటర్‌’ (ఏ.టి.టి.) యాప్‌లో సినిమా రిలీజు చేయడం! అది ఈ సినిమాకు ఎంత వరకు కలిసొస్తుందో వేచి చూడాలి.

కొసమెరుపు: ఎంగేజింగ్‌ ఎరోటిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌!

బలాలు:
ఊహించని ట్విస్టున్న కథ 
ఆలోచింపనివ్వని కథనం
ప్రధాన పాత్రధారుల నటన, రీరికార్డింగ్‌
ప్రొడక్షన్‌ విలువలు, చివరి ముప్పావుగంట సినిమా

బలహీనతలు:
పిల్లాపాపలతో చూడలేని అడల్ట్‌ సీన్లు
క్యారెక్టరైజేషన్‌లో ఎగుడుదిగుళ్ళు
పెద్దగా పరిచయం లేని నటీనటులు.

– రెంటాల జయదేవ

మరిన్ని వార్తలు