The Dirty Picture Sequel: డర్టీ పిక్చర్‌ హీరోయిన్‌ ఎవరు?

18 Aug, 2022 00:31 IST|Sakshi
తాప్సీ, కృతీ సనన్‌

‘ది డర్టీ పిక్చర్‌’కి సీక్వెల్‌ రానుందా? అంటే బాలీవుడ్‌ అవునంటోంది. విద్యాబాలన్‌ కథానాయికగా ఏక్తా కపూర్‌ నిర్మించిన ‘ది డర్టీ పిక్చర్‌’ (2011) గుర్తుండే  ఉంటుంది. విద్యా నటనకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. మిలన్‌ లూథ్రియా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం దివంగత ప్రముఖ నటి సిల్క్‌ స్మిత జీవితంలోని కొన్ని అంశాలతో రూపొందినట్లుగా టాక్‌ వినిపించింది. అయితే దర్శక–నిర్మాతలు ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఆ సంగతలా ఉంచితే ‘ది డర్టీ పిక్చర్‌’కి సీక్వెల్‌ నిర్మించడానికి ఏక్తా కపూర్‌ సన్నాహాలు మొదలుపెట్టారని సమాచారం. మరో     రచయితతో కలిసి కనికా థిల్లాన్‌ ఈ సీక్వెల్‌కి స్టోరీ సిద్ధం చేస్తున్నారట.

సీక్వెల్‌లో విద్యాబాలన్‌ కాదు... సీక్వెల్‌లో విద్యాబాలన్‌ నటించడంలేదు. కాగా ఫస్ట్‌ పార్ట్‌ అప్పుడే కంగనా రనౌత్‌ని కథానాయికగా అడిగారు ఏక్తా కపూర్‌. అయితే   కంగన తిరస్కరించారు. సీక్వెల్‌కి అడగ్గా.. మళ్లీ తిరస్కరించారట. ఈ నేపథ్యంలో తాప్సీ, కృతీ సనన్‌ వంటి తారలతో సెకండ్‌ పార్ట్‌ గురించి ఏక్తా చెప్పారట. ఇద్దరూ నటించడానికి సుముఖత వ్యక్తపరచారని టాక్‌. అయితే పూర్తి కథ రెడీ అయ్యాక మరోసారి కలుద్దామని కృతీ, తాప్సీతో అన్నారట ఏక్తా. మరి..    ఇద్దరిలో ‘డర్టీ పిక్చర్‌ 2’ హీరోయిన్‌ ఎవరు? అనేది కాలం చెబుతుంది. అలాగే తొలి భాగానికి దర్శకత్వం వహించిన మిలన్‌ మలి భాగాన్ని కూడా తెరకెక్కిస్తారా? అనేది కూడా తెలియాల్సి ఉంది.

వేరే కథ... ‘ది డర్టీ పిక్చర్‌’ విద్యాబాలన్‌ పాత్ర చనిపోవడంతో ముగుస్తుంది. మరి.. సీక్వెల్‌ కథ ఏంటి? అనే చర్చ జరుగుతోంది. అయితే పూర్తిగా వేరే కథ తయారు చేస్తున్నారట. ఈ ఏడాది  చివరికి కథ సిద్ధమవుతుందని సమాచారం. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో సీక్వెల్‌ షూటింగ్‌ ఆరంభించాలను    కుంటున్నారని భోగట్టా.

మరిన్ని వార్తలు