ఆరోజు నేనే పోలీసులకు ఫోన్‌ చేశా: దిశ తండ్రి

17 Sep, 2020 20:35 IST|Sakshi

మా కూతురి మరణం వెనుక ఏ కుట్రలేదు

దయచేసి మమ్మల్ని ఇలా బతకనివ్వండి

సుశాంత్‌ మాజీ మేనేజర్‌ దిశా సలియాన్‌ తండ్రి

‘‘ఇప్పటికే కూతురిని పొగొట్టుకున్న దుఃఖంలో ఉన్నాం. అయినా కొంతమంది పదే పదే అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తూ మాకు మనశ్శాంతి దూరం చేస్తున్నారు. ఇలా కూడా మమ్మల్ని బతకనివ్వడం లేదు. మా పరువు తీయాలని చూస్తున్నారు. ఇప్పటికైనా నా కూతురి మరణం వెనుక కుట్ర దాగుందన్న ప్రచారాలకు స్వస్తి పలకండి’’ అని దిశా సలియాన్‌ తండ్రి సతీశ్‌ సలియాన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దిశ ఎన్నడూ పోలీసులకు ఫోన్‌ చేయలేదని, తానే మే 10న 100కు డయల్‌ చేశానని స్పష్టం చేశారు. జూన్‌ 4 తర్వాత తన కూతురు ఇల్లు విడిచి బయటకు వెళ్లలేదన చెప్పుకొచ్చారు. (చదవండి: కృతికి టైం కేటాయించాలి, వాళ్లతో టూర్‌ వెళ్లాలి)

కాగా బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మాజీ మేనేజర్‌ దిశ జూన్‌ 8 రాత్రి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ఆ తర్వాత వారం రోజులు కూడా గడవకముందే సుశాంత్‌ కూడా బలవన‍్మరణానికి పాల్పడటంతో వీరిద్దరి మృతికి ఏదైనా సంబంధం ఉందా అన్న అనుమానాలు తలెత్తాయి దిశకు సహాయం చేసే క్రమంలోనే సుశాంత్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయని.. అందుకే అతడు కూడా మరణించాడన్న వాదనలు వినిపించాయి. ఈ క్రమంలో దిశ సలియాన్‌ది ఆత్మహత్య కాదని ఆమెపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేశారంటూ బీజేపీ నేత నారాయణ్‌ రాణే సంచలన ఆరోపణలు చేశారు. (చదవండి: తనపై అత్యాచారం జరుగలేదు)

ముంబై పోలీసులకు కాల్‌ చేసింది..
ఇక ఆనాటి నుంచి నేటికీ దిశ మృతికి సంబంధించి అనేక విధాలుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో బీజేపీ నేత నితీశ్‌ రాణే.. మరణానికి ముందు దిశ పోలీసులకు ఫోన్‌ చేసిందని, ఆ తర్వాత సుశాంత్‌కు కూడా డయల్‌ చేసి తనకు ప్రాణహాని ఉందని చెప్పిందంటూ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ జాతీయ మీడియాతో మాట్లాడిన దిశ తండ్రి సతీశ్‌.. ఇవన్నీ తప్పుడు కథనాలు అని కొట్టిపారేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ- పాస్‌ కోసం నేనే దిశ ఫోన్‌ నుంచి మే 10న పోలీసులకు ఫోన్‌ చేశాను. నా కూతురు, కాబోయే అల్లుడు రోహన్‌ మలద్‌ ప్రాంతంలో ఇటీవలే ఓ ఇల్లు కొనుగోలు చేశారు. 

దాన్ని క్లీన్‌ చేయించాలనుకున్నారు. అందుకే కార్లో అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో అనుమతి కోసం ఈ- పాస్‌ కోసం పోలీసులకు ఫోన్‌ చేశాం. అయితే మా ఇంటి నుంచి ఆ కొత్త ఇల్లు తక్కువ దూరమే కాబట్టి ఈ- పాస్‌ అవసరం లేదని చెప్పారు. దాంతో దిశ, రోహన్‌ అక్కడికి వెళ్లారు. కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చేశారు’’అని వివరించారు. ఇక ఈ విషయం గురించి సదరు మీడియా విలేకర్లు ముంబై పోలీసులకు సంప్రదించగా.. వారు సైతం ఇదే రకమైన వివరణ ఇచ్చినట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించి తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని, (కాల్‌ రికార్డులు, సీసీటీవీ ఫుటేజీ(దిశ తమ ఇంట్లోనే ఉందని)) చెప్పినట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు