మీడియా వేధింపుల గురించి ముంబై పోలీసులకు లేఖ

5 Aug, 2020 21:15 IST|Sakshi

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో ఆసక్తికర మలుపులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుశాంత్‌ మాజీ మేనేజర్‌ దిశా సలియన్‌ మృతి కేసులో ముంబై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ రెండు కేసులకు సంబంధించి పోలీసుల వ్యవహార శైలిపై సోషల్‌ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి దిశ పేరు తెరపైకి వచ్చింది. వీరిద్దరి మరణాలకు ఏదైనా సంబంధం ఉండవచ్చని జనాలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో దిశ తండ్రి సతీష్ సలియాన్ మహారాష్ట్రలోని మాల్వాని జిల్లా అదనపు పోలీసు కమిషనర్ దిలీప్ యాదవ్‌కు లేఖ రాశారు. (సుశాంత్‌ కేసు: ‘దిశాది ఆత్మహత్య కాదు హత్యాచారం’)

తమ కుటుంబంపై జరుగుతున్న మానసిక వేధింపుల గురించి, మరణించిన కుమార్తెకు సంబంధించి మీడియా, పాత్రికేయులు వ్యవహరిస్తున్న తీరు గురించి దిశ తండ్రి ఈ లేఖలో తెలిపారు. ఈ వ్యక్తులు తమకు ముంబై పోలీసుల పట్ల గల నమ్మకాన్ని పదే పదే ప్రశ్నిస్తూ.. వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. అంతేకాక తమ కుమార్తె మరణానికి సంబంధించి అన్యాయంగా ఎవరిని బాధ్యులను చేయవద్దని గతంలోనే పోలీసులను కోరామన్నారు. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి సమాచారం తెలిసినా.. ఆధారాలు దొరికినా ఆ వివరాలు తమకు అందచేయాలని ముంబై పోలీసులు బుధవారం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. (సుశాంత్‌ కేసు: ప్రెస్‌ నోట్‌ విడుదల)

సుశాంత్‌ మాజీ మేనేజర్‌ దిశా సలియన్‌ (28) జూన్‌ 8న ముంబైలోని మలద్‌ ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనం పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. దిశ మృతిపై యాక్సిడెంటల్‌ డెత్‌ రిపోర్ట్‌ను నమోదు చేసిన మల్వానీ పోలీసులు దర్యాప్తు చేపట్టామని వెల్లడించారు. దిశ మరణంపై సోషల్‌ మీడియా, వార్తాపత్రికలు, టీవీ చానెళ్లలో పలు కథనాలు ప్రచారం అయ్యాయి. దాంతో ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారం కోసం ఈ కథనాలను పరిశీలిస్తామని పోలీస్‌ అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఏ సమాచారమైనా ప్రజలు తమతో పంచుకోవచ్చని తెలిపారు. మరోవైపు దిశ సలియాన్‌ ఆత్మహత్య చేసుకోలేదని ఆమెపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేశారని బీజేపీ ఎంపీ నారాయణ్‌ రాణే సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు