ముగ్గురిపై దిశా సలియన్‌ తండ్రి ఫిర్యాదు

14 Aug, 2020 10:55 IST|Sakshi

ముంబై:  సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మాజీ మేనేజర్‌ దిశా సలియన్‌ ఆత్మహత్య కేసులో తాజా పరిణామం చోటు చేసుకుంది.  ఆమె తండ్రి సతీష్ సలియన్, దిశ మరణం గురించి పుకార్లు వ్యాప్తి చేసినందుకు గాను ముగ్గురు వ్యక్తులపై శుక్రవారం లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. కేసును ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై చట్టపరమైన అభిప్రాయాలను తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. కొంత మంది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణాన్ని దిశా సలియన్ మరణంతో కలిపి అనేక వాట్సాప్ ఫార్వర్డ్‌ మెసేజ్‌లు, సోషల్ మీడియా పోస్టులు చేస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, దిశా సలియన్ మరణ కేసుల మధ్య సంబంధం ఉందని పలువురు రాజకీయ నాయకులు కూడా  ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులు తన కుమార్తె పరువు తీశారని, ఆమె గురించి పలు పుకార్లు సృష్టించారని సతీష్ సలియన్ ముంబైలోని మల్వాని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా పోస్టులు తమను మానసికంగా ఎలా వేధిస్తున్నాయో ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ముగ్గురు వ్యక్తులు నకిలీ కథలను ప్రచారం చేస్తున్నారని తన ఫిర్యాదులో తెలిపారు. వారిని పునీత్ వసిష్ఠ, సందీప్ మలాని, నమన్ శర్మలుగా ఆయన తెలిపారు. ఈ ముగ్గురు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. (‘సుశాంత్‌ సోదరి నన్ను వేధించారు’)

సతీష్ సలియన్ ఇచ్చిన ఫిర్యాదును చాలా సీరియస్‌గా తీసుకుంటున్నామని ముంబై పోలీసు వర్గాలు తెలిపాయి. ఐటీ చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. సరైన చట్టపరమైన అభిప్రాయాలను తీసుకున్న తరువాత, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. అనంతరం ఆ ముగ్గురు వ్యక్తులను పిలిచి ఈ విషయంపై దర్యాప్తు చేస్తారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణించిన నాటి నుంచి ఆయన మేనేజర్‌గా పని చేసిన దిశ మరణంపై కూడా పలు కథనాలు ప్రచారమవుతున్న సంగతి తెలిసిందే. 

చదవండి: సుశాంత్‌ మాజీ మేనేజర్‌ మరణంపై సంచలన ఆరోపణలు

మరిన్ని వార్తలు