దివ్య భారతి చనిపోయాక ఆమె సినిమాలు ఎవరు చేశారంటే?

25 Feb, 2021 16:33 IST|Sakshi

బొబ్బిలి రాజా, అసెంబ్లీ రౌడీ, చిట్టెమ్మ మొగుడు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మసులో చెరగని ముద్ర వేసుకుంది దివ్య భారతి. తెలుగుతో పాటు దీవానా, దిల్‌ కా క్యా కసూర్‌, జాన్‌ సే ప్యారా వంటి పలు హిందీ చిత్రాల్లో నటించిన ఆమె అందం, అభినయానికి హిందీ ప్రేక్షకులు సైతం మంత్రముగ్ధులయ్యారు. 16 ఏళ్లకే నటనారంగంలోకి అడుగు పెట్టిన ఆమె తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా పేడు గడించింది.

అదే సమయంలో 1993 ఏప్రిల్‌ 5న ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయి తీరని శోకాన్ని మిగిల్చింది. దీంతో ఆమె సినిమాలు కొన్ని మధ్యలోనే అర్ధాంతరంగా ఆగిపోగా, మరికొన్ని ఆమె స్థానాన్ని వేరొకరితో భర్తీ చేసి షూటింగ్‌ జరుపుకున్నాయి. ఆమె అకాల మరణం కారణంగా పలు హిట్‌ సినిమాల్లో దివ్య భారతి స్థానంలో పలువురు బాలీవుడ్‌ తారలను తీసుకున్నారు. నేడు ఆమె జయంతి సందర్భంగా తన చివరి రోజుల్లో చేజారిన సినిమాలేంటి? ఆమె పాత్రలను ఎవరు భర్తీ చేశారనేది ఓ సారి చదివేద్దాం...

కర్తవ్య
రాజ్‌ కన్వర్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో దివ్య భారతిని కథానాయికగా డిసైడ్‌ అయ్యారు. కొంత భాగం చిత్రీకరణ కూడా జరిపారు. కానీ సడన్‌గా ఆమె మరణించడంతో ఆమె స్థానంలోకి జూహీ చావ్లాను తీసుకోక తప్పలేదు.

హల్‌చల్‌
1995లో హల్‌చల్‌ సినిమాతో దర్శకుడిగా వెండితెరపై కాలు మోపాడు అనీస్‌ బజ్మీ. తొలి చిత్రం కావడంతో ఎలాగైనా దివ్య భారతినే హీరోయిన్‌గా తీసుకోవాలనుకున్నాడు. కానీ ఆమె మరణం ఈ సినిమా యూనిట్‌ను షాక్‌కు గురి చేసింది. తర్వాత దర్శకుడు ఆమె ప్లేస్‌లో కాజోల్‌ను తీసుకున్నాడు. ఇందులో కాజోల్‌ భర్త అజయ్‌ దేవ్‌గణ్‌ హీరో.

మోహ్రా
స్టార్‌ నటులు అక్షయ్‌ కుమార్‌, సునీల్‌ శెట్టి సినిమా మెహ్రాలో నటించే చాన్స్‌ కొట్టేసింది దివ్య భారతి. ఈ మేరకు కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారట. కానీ ఆమె ఆకస్మిక మరణం తర్వాత రవీనా టండన్‌ను రీప్లేస్‌ చేశారు. రాజీవ్‌ రాణి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచింది.

లాడ్లా
అనిల్‌ కపూర్‌ ప్రధాన పాత్రలో నటించిన లాడ్లా సినిమాకు సైన్‌ చేసింది దివ్య.. కానీ తన సడన్‌ డెత్‌ తర్వాత ఆమె పాత్రను శ్రీదేవి పోషించింది. ఈ చిత్రంలో రవీనా టండన్‌, శక్తి కపూర్‌ కీలక పాత్రల్లో నటించారు.

కాగా దివ్య భారతి, నిర్మాత సాజిద్‌ నడియాద్‌వాలా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు ఆమె తండ్రి అంగీకరించకపోవడంతో పెద్దలను ఎదిరించి మరీ అతడితో ఏడడుగులు నడిచింది. కానీ పెళ్లైన పది నెలలకే  ఐదో అంతస్థులోని బాల్కనీ నుంచి దూకి మరణించింది. అప్పుడామె వయసు 19ఏళ్లు మాత్రమే కావడం గమనార్హం.

చదవండి: సుశాంత్‌ కేసు: ఓ సోదరికి బెయిల్‌.. మరొకరికి షాక్‌

‘ఆస్కార్‌ నటితో మీకు పోలికా.. ప్లీజ్‌ బ్రేక్‌ తీసుకొండి’

మరిన్ని వార్తలు