దీపావళి ‘సినిమా’ పటాసులు

28 Oct, 2020 00:03 IST|Sakshi

దీపావళికి ప్రతీ ఏడాది థియేటర్స్‌లోకి మతాబుల్లా సినిమాలు వస్తుంటాయి. చిచ్చుబుడ్డుల్లా వెలుగులు విరజిమ్ముతాయి. అయితే ఈ ఏడాది కోవిడ్‌ వల్ల పండగలకు కొత్త విడుదలలు ఉండట్లేదు. ఔట్లన్నీ ఓటీటీల్లో పేలుతున్నాయి. తమిళంలో ఈ దీపావళికి మూడు పెద్ద సినిమాలు ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. ఆ టపాసుల విశేషాలు. 

ఆశయం గొప్పదైతే...
నీ ఆశయం గొప్పదైతే ఆకాశం కూడా అందుకోగలవు అని తన తాజా చిత్రం ‘ఆకాశమే నీ హద్దురా!’ (తమిళంలో సూరరై పోట్రు) ద్వారా చెబుతున్నారు సూర్య. తక్కువ ఖరీదులోనే పేదవాడు కూడా విమానయానం చేయొచ్చు అని కల కని నిజం చేసుకున్న పైలెట్‌ పాత్రలో సూర్య నటించిన చిత్రం ఇది. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమాను సూర్యనే స్వయంగా నిర్మించారు. తమిళంలో నేరుగా ఓటీటీలో విడుదలవుతున్న భారీ చిత్రమిదే. నవంబర్‌ 12 నుంచి అమేజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమాను వీక్షించవచ్చు. 

అమ్మవారే దిగి వస్తే?
మతం అనేది అందర్నీ సరైన మార్గంలో నడిపించడానికి ఉన్నది. ఈ నమ్మకాన్ని తప్పు దోవలో పట్టించాలనే ప్రయత్నం చేసే కొందర్ని సరైన మార్గంలో పెట్టడానికి ఆ అమ్మవారే దిగి వస్తే? ఈ కథాంశంతో నయనతార ప్రధాన పాత్రలో ‘మూకుత్తి అమ్మన్‌’ తెరకెక్కింది. తెలుగులో ‘అమ్మోరు తల్లిగా’ విడుదల కానుంది. ఆర్జే బాలాజీ, యన్జే శ్రవణన్‌ దర్శకత్వం వహించారు. ఇందులో అమ్మవారి పాత్రలో నయనతార కనిపిస్తారు. నవంబర్‌ 14 నుంచి ఈ సినిమా డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. 

భూమి
రైతు ఆత్మహత్యలు, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యల ఆధారంగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘భూమి’. ‘జయం’ రవి హీరోగా నటించారు. ఇది ఆయన కెరీర్‌లో 25వ సినిమా. ఇందులో ఇస్మార్ట్‌ బ్యూటీ నిధీ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించారు. లక్ష్మణ్‌ దర్శకత్వం వహించారు. దీపావళి రోజు సాయత్రం సన్‌టీవీలో ప్రసారం కానుంది. అలాగే సన్‌ నెక్ట్స్‌లోనూ ఈ సినిమా ప్రసారం కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు