పునీత్‌కు అప్పటికే చెమటలు పట్టాయి.. అందుకే అక్కడకు వెళ్లాలని సూచించా..

7 Nov, 2021 07:15 IST|Sakshi

పునీత్‌కు మొదట వైద్యం చేసిన డా.రమణరావు 

క్లినిక్‌ ముందు ధర్నాకు కొందరి ప్రయత్నాలు  

Puneeth Rajkumar Doctor Gets Police Protection: ప్రముఖ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ మృతికి వైద్యుని నిర్లక్ష్యం కారణమని కొందరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదులు చేయడంతో డా.రాజ్‌కుమార్‌ కుటుంబ వైద్యుడు డాక్టర్‌ రమణరావు నివాసం వద్ద పోలీసులు గట్టి భద్రతను కల్పించారు. బెంగళూరు సదాశివనగరలోని రమణరావు ఇల్లు, క్లినిక్‌ వద్ద శుక్రవారం సాయంత్రం నుంచి భద్రత ఏర్పాటైంది. డాక్టర్‌ రమణరావు నిర్లక్ష్యం కారణంతో పునీత్‌ కన్నుమూశారని, ఆయనను అరెస్టు చేయాలనే డిమాండుతో కొన్ని సంఘాలు ఆయన ఇంటి ముందు ధర్నాకు సిద్ధం కావడంతో ఆ ప్రాంతంలో గస్తీని పెంచారు.

చదవండి: (50 రకాల వంటకాలతో పునీత్‌కు పాలశాస్త్రం పూజలు)
 
చికిత్సలో లోపం లేదు: రమణరావు.. 

దీనిపై డా.రమణరావు ముందు నుంచి ఇస్తున్న వివరణనే ఇచ్చారు. పునీత్‌కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. క్లినిక్‌కు వచ్చిన సమయంలో ప్రాథమిక చికిత్సలు చేశానని రమణరావు తెలిపారు. 35 ఏళ్ల నుంచి తను రాజ్‌కుమార్‌ కుటుంబానికి వైద్యునిగా పని చేస్తున్నట్లు చెప్పారు. పునీత్‌కు చికిత్సలో తమ వైపు నుంచి ఎలాంటి లోపం జరగలేదని అన్నారు.

జిమ్‌ చేసిన తరువాత సుస్తిగా ఉందని గత నెల 29న ఉదయం 11.15కు పునీత్‌ మా క్లినిక్‌కు వచ్చారు. ఆయనకు అప్పటికే చెమటలు పట్టిన కారణంగా ఈసీజీ తీశా, గుండెపోటు వచ్చి ఉండవచ్చనే అనుమానంతో తక్షణం యాంజియోగ్రాం చేయటానికి విక్రం ఆస్పత్రికి వెళ్లాలని సూచించా. అయితే అంబులెన్స్‌ కోసం ఎదురు చూస్తే ఆలస్యం అవుతుందని వారి కారులోనే నాలుగైదు నిమిషాలలో ఆస్పత్రికి వెళ్లేలా చూశాం. అక్కడ చేసిన చికిత్స ఫలించలేని కారణంగా పునీత్‌ మృతి చెందారు. వైద్యులు ఎక్కడా నిర్లక్ష్యం వహించలేదు  అని పేర్కొన్నారు.  

చదవండి: (పునీత్‌కు ఇలా జరిగిందన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా: రామ్‌చరణ్‌)

>
మరిన్ని వార్తలు