కొరియాలో దృశ్యం

22 May, 2023 04:04 IST|Sakshi
జే వోన్, మంగత్‌ పాతక్‌

భారతీయ ‘దృశ్యం’ కొరియా తెరపైకి వెళ్లనుంది. మోహన్‌లాల్‌ హీరోగా, మీనా, ఆశా శరత్, అన్సిబా హాసన్, సిద్ధిఖ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘దృశ్యం’. జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో ఆంటోనీ పెరుంబవూర్‌ నిర్మించిన ఈ చిత్రం 2013లో విడుదలై అద్భుత విజయం సాధించింది. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ రీమేక్‌ అయి హిట్‌ అయింది. ‘దృశ్యం’ తర్వాత  మోహన్‌లాల్‌–జీతూజోసెష్‌ కాంబోలో వచ్చిన ‘దృశ్యం 2’ కూడా వీక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంది.

ఇక దృశ్యం సినిమా హిందీ రీమేక్‌లో అజయ్‌ దేవగన్‌ హీరోగా నటించిన విషయం తెలిసిందే. కాగా ‘దృశ్యం’ ఫ్రాంచైజీ కొరియాలో రీమేక్‌ కానుంది. సౌత్‌ కొరియా ఆంథాలజీ స్టూడియోస్, ఇండియన్‌ పనోరమ స్టూడియోస్‌ పతాకాలపై చోయ్‌ జే వోన్, కుమార్‌ మంగత్‌ పాఠక్‌ హిందీ ‘దృశ్యం’ ని కొరియాలో రీమేక్‌ చేయనున్నారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న 76వ కాన్స్‌ చలన చిత్రోవత్సాల్లో ఈ విషయాన్ని చోయ్‌ జే, మంగత్‌ పాఠక్‌ ప్రకటించారు. ఇండియన్, కొరియన్‌ ప్రొడక్షన్‌ హౌస్‌లు కలిసి ఓ సినిమాను నిర్మిస్తుండటం ఇదే తొలిసారి. ‘‘సాధారణంగా కొరియన్‌ చిత్రాలు భారతీయ భాషల్లో రీమేక్‌ అవుతుంటాయి. కానీ, ఇప్పుడు ఓ ఇండియన్‌ సినిమా కొరియాలో రీమేక్‌ అవుతుంది’’ అన్నారు పాతక్‌.

మరిన్ని వార్తలు