అవి ప్రిస్క్రిప్షన్‌తో తీసుకున్న మందులు: అర్జున్‌

14 Nov, 2020 14:19 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ డ్రగ్స్‌ వ్యవహరంలో నటుడు అర్జున్‌ రాంపాల్‌కు సంబంధం ఉందనే ఆరోపణలతో నార్కోటిక్స్‌‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) ఆయనకు సమన్లు జారీ చేసి విచారణకు పిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన నిన్న(శుక్రవారం) ముంబైలోని ఎన్‌సీబీ కార్యాలయంలో విచారణకు హజరయ్యారు. గత సోమవారం అర్జున్‌ నివాసంలో ఎన్‌సీబీ అధికారులు సోదాలు నిర్వహించి కొన్ని ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌తో పాటు పలు అనుమానిత పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై ఆయనను నిన్న దాదాపు ఆరు గంటలపాటు ఎన్‌సీబీ విచారించింది.  అనంతరం అర్జున్‌ మీడియాతో మాట్లాడుతూ... తాను పూర్తిగా ఎన్‌సీబీకి సహకరిస్తున్నానని చెప్పారు. అయితే డ్రగ్స్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన ఇంట్లో దొరికిన ప్రిస్క్రిప్షన్‌ ద్వారా కొన్న మందులని స్పష్టం చేశారు. ఆ ప్రిస్క్రిప్షన్‌ను అధికారులను అందించానని కూడా అర్జున్‌ పేర్కొన్నారు.

డ్రగ్స్‌ కేసులో ఎన్‌సీబీ అధికారులు నిబద్ధతతో ఉన్నారని, వారి పని వారు చేసుకుంటున్నారని అధికారులను ప్రశంసించారు. ముఖ్యంగా అధికారుల్లో ఒకరైన సమీర్‌ వాఖేండే బాగా పని చేస్తున్నారన్నారు. అయితే ఆయన గర్ల్‌‌ఫ్రెండ్‌ గాబ్రియేలా సోదరుడు అజియాలోస్‌ దిమిత్రియేడ్స్‌ను డ్రగ్స్‌ పెడ్లర్‌తో సంబంధాలు ఉన్నాయని ఇప్పటికే అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గాబ్రియేలాకు కూడా సమన్లు జారీ చేసిన ఎన్‌సిబీ విచారించింది. కాగా ఈ డ్రగ్స్‌ కేసులో ఇప్పటికే బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ దీపికా పదుకొనె, శ్రద్దా కపూర్‌, సారా అలీ ఖాన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లు కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. వారిని విచారణకు పలిచిన ఎన్‌సీబీ ఆ తర్వాత వారికి డ్రగ్స్‌ ఎటువంటి సంబంధాలు లేవని క్లీన్‌‌చిట్‌ ఇచ్చింది. 

>
మరిన్ని వార్తలు