మళ్లీ డ్రగ్స్‌ కలకలం.. తెరపైకి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ పేరు

13 Sep, 2020 02:34 IST|Sakshi

రియా, రకుల్, సంజనా ముగ్గురు కథానాయికలూ తెలుగులో నటించినవారే 

ఈ కేసులు నిలిచేనా?

గత కేసులను అటకెక్కించిన ఎక్సైజ్‌ శాఖ

సాక్షి, హైదరాబాద్‌: నెల రోజులుగా బాలీవుడ్, శాండల్‌వుడ్‌లో చిచ్చురేపుతున్న డ్రగ్స్‌ మంటలు.. తాజాగా తెలుగు చలనచిత్ర సీమనూ తాకాయి. టాలీవుడ్‌లో డ్రగ్స్‌ ఆరోపణలు కొత్తేం కాకపోయినా.. ఈసారి ఇద్దరు తెలుగు హీరోయిన్లపై ఆరోపణలు రావడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ గమ నించాల్సిన అంశం ఏంటంటే.. ఈ ముగ్గురు కథా నాయికలూ తెలుగులో నటించిన వారే కావడం. వాస్తవానికి నటుడు సుశాంత్‌ సింగ్‌ అనుమానా స్పద మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తిని మాదకద్రవ్యాల కేసులో నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎన్‌ సీబీకి రియా.. డ్రగ్స్‌తో సంబంధమున్న పలువురు సెలబ్రి టీల పేర్లు చెప్పిందని సమాచారం. అందులో సారా అలీఖాన్, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ పేర్లు ఉన్నాయి.

ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే.. రియా చక్ర వర్తి, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఇద్దరూ టాలీవుడ్‌ నటులే. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కన్నా ముందే.. రియా చక్రవర్తిటాలీవుడ్‌లో 2012లో ‘తూనీగ తూనీగ’ సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. ఆ తరువాత సంవత్సరంలో రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. డ్రగ్స్‌ కేసులో రియా చక్రవర్తి ఎన్‌ సీబీ అధికారు లకు వెల్లడించిన దాదాపుకు 25 మందికిపైగా పేర్లలో రకుల్‌ ఉందన్న వార్త కలకలం రేపుతోంది. ఈ క్రమంలో సదరు 25 మంది సెలెబ్రిటీలను త్వరలోనే విచారణకు రావాల్సిందిగా ఎన్‌ సీబీ నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయని సమా చారం. మరోవైపు రకుల్‌ మాత్రం వికారాబాద్‌లో జరుగుతున్న ఓ సినిమా షూటింగ్‌లో బిజీగా గడిపారు. శనివారం ప్రసార మాధ్యమాల్లో డ్రగ్స్‌ వివాదంలో ఆమె పేరు ఉందన్న ప్రచారం తీవ్రం కావడంతో షూటింగ్‌ నుంచి ఆమె వెళ్లిపోయారని తెలిసింది. అభిమానులు ఆమెకు అండగా నిలుస్తుంటే.. నెటిజన్లు మాత్రం నిష్పక్షపాత విచారణ జరగాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు. గతంలో టాలీవుడ్‌లో బయటపడ్డ డ్రగ్స్‌ కేసులో పలువురు తెలుగు సినిమా నిర్మాతలు, దర్శకులు, నటులు, టెక్నీషియన్లను అప్పటి ఎక్సైజ్‌ శాఖ విచారించిన సంగతి తెలిసిందే. తరువాత ఈ కేసు క్రమంగా నీరుగారిందన్న విమర్శలున్నాయి.

2017లో ఏం జరిగిందంటే..?
ఎక్సైజ్‌ అధికారులు 2017, జూలై 24న మణికొండలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటూ తెలుగు ఇండస్ట్రీలో మేనేజర్‌గా పనిచేస్తున్న పుట్టకర్‌ రాన్సన్‌  జోసెఫ్‌ అనే వ్యక్తి ప్లాట్‌పై దాడులు చేశారు. ఈ సందర్భంగా గంజాయి, హుక్కా తదితర నిషేధిత మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. ఇతన్ని విచారించగా సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు డ్రగ్స్‌ తీసుకుంటున్నారన్న సమాచారం సంచలనం సృష్టించింది. దీంతోపాటు రాజీవ్‌గాంధీ విమానాశ్రయంలో అలెక్స్‌ విక్టర్‌ అనే దక్షిణాఫ్రికా దేశస్తుడి వద్ద కొకైన్‌  పాకెట్లు లభించాయి. వీరంతా నగరంలోని పలు కార్పొరేట్‌ స్కూళ్ల చిన్నారులకు కూడా డ్రగ్స్‌ (ఎల్‌ఎస్‌డీ) విక్రయిస్తున్నారన్న విషయాన్ని ప్రభుత్వం మొదట్లో తీవ్రంగానే పరిగణించింది. ఈ కేసులను లోతుగా దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, ఎక్సైజ్‌ కమిషనర్‌ అకున్‌  సబర్వాల్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌ )ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా సిట్‌ అధికారులు 62 మంది సినీరంగంతో సంబంధం ఉన్న ప్రముఖులను విచారణకు పిలిచారు. ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లోనే కాక జాతీయస్థాయిలో పెద్ద దుమారాన్నే లేపింది.  విచారణకు వచ్చిన పలువురు సెలబ్రిటీలు తాము ఎలాంటి తప్పు చేయలేదని వివరణ ఇచ్చుకున్నారు. వీరిలో పలువురిని అరెస్టు చేస్తారన్న ప్రచారం కూడా జరగడం తీవ్ర ఉత్కంఠ రేపింది. తరువాత ఎక్సైజ్‌ నుంచి అకున్‌  సబర్వాల్‌ బదిలీ కావడం, ఈ సిట్‌కు వేరే అధికారుల నేతృత్వంతో కేసు నీరుగారిపోయిందని, సిట్‌ తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు. 

సంజన కూడా..
అదే సమయంలో ప్రస్తుతం ఇవే ఆరోపణలపై అరెస్టయిన ప్రముఖ కన్నడ నటి సంజన కూడా గతంలో తెలుగులో  సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. గతంలో సంజనతో తెలుగులో కలిసి పనిచేసిన ఓ దర్శకుడు, సహనటులు, టెక్నీషియన్లు కూడా 2017 నాటి టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో విచారణకు హాజరవ్వడం గమనార్హం. మూడేళ్ల తరువాత సంజన కూడా అదే కేసులో అరెస్టవడం విశేషం. 2017 డ్రగ్స్‌ కేసు కంటే ముందు కూడా ఉమ్మడి రాష్ట్రంలోనూ కొందరు నటులపై డ్రగ్స్‌ ఆరోపణలు వచ్చాయి. అసలు ఇండస్ట్రీలో డ్రగ్స్‌ కలకలం కొత్తేం కాదు. ఒక రకంగా చెప్పాలంటే గ్లామర్‌తో ముడిపడిన సినీపరిశ్రమకు డ్రగ్స్‌కు విడదీయరాని సంబంధం ఉంది. ఎలాగంటే.. ముఖంపై ముడతలు కనిపించకూడదని, బాడీ ఫిట్‌నెస్‌గా ఉండాలని, చర్మం కాంతులీనేందుకు, వెండితెరపై నిత్యం యవ్వనంతో కనిపించాలని, వేగంగా సిక్స్‌ ప్యాక్‌ తెచ్చుకోవాలని రకరకాల కారణాలతో కొందరు నటులు డ్రగ్స్‌ తీసుకుంటుంటారు.

ముందు హడావుడి.. 
డ్రగ్స్‌ తీసుకున్నట్లు తేలితే.. అరెస్టు చేస్తామని మీడియాకు గతంలో లీకులు ఇచ్చిన ఎక్సైజ్‌ శాఖ అధికారులు ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 62 మంది చిత్రసీమ వ్యక్తులకు నోటీసులు ఇచ్చిన అధికారులు నటుల గోళ్లు, వెంట్రుకలు, ఇతర నమూనాలు తీసుకుని హడావుడి చేశారు. అరెస్టులు తప్పవన్న ప్రచారం జరిగింది. కానీ, తరువాత ఎక్సైజ్‌ శాఖ దాఖలు చేసిన చార్జిషీటులో ఒక్క సినిమా వ్యక్తి పేరు లేక పోవడం  చర్చనీయాంశమైంది. అయితే, ఇప్పటికీ ఈ కేసును విచారిస్తున్నామని ఎక్సైజ్‌ శాఖ చెబుతోంది. ఒకవేళ కేసులు పెట్టినా.. డ్రగ్స్‌ తీసుకున్న వారిని బాధితులుగా చూపిస్తే వారికి పెద్దగా శిక్షలేమీ పడక పోవచ్చ న్నది న్యాయనిపుణుల అభిప్రాయం. ఇప్పుడూ కేసులు నమోదైనా.. అవి నిలిచేనా అన్న అనుమానాలు అప్పుడే మొదలయ్యాయి.

మరిన్ని వార్తలు