కెల్విన్‌కు నగదు బదిలీ చేశారా?

9 Sep, 2021 04:22 IST|Sakshi
విచారణ అనంతరం ఈడీ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న రానా

డ్రగ్స్‌ కేసులో రానాను ప్రశ్నించిన ఈడీ అధికారులు 

రెండోరోజూ విచారణకు వచ్చిన కెల్విన్‌ 

ఇద్దరినీ క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసిన ఈడీ 

నేడు విచారణకు రవితేజ, ఆయన డ్రైవర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ‘టాలీవుడ్‌ డ్రగ్స్‌’ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు బుధవారం సినీ నటుడు దగ్గుబాటి రానాను ప్రశ్నించారు. ఈడీ అధికారులకు డ్రగ్స్‌ కేసు ప్రధాన నిందితుడు కెల్విన్‌ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే రానా విచారణ జరిగినట్లు తెలిసింది. ఉదయం 10.30 గంటల నుంచి దాదాపు ఏడున్నర గంట ల పాటు విచారణ జరిగింది. డ్రగ్స్‌ కేసులో తెలంగాణ ఎక్సైజ్‌ విభాగానికి చెందిన సిట్‌ దాఖలు చేసిన చార్జిషీట్ల ఆధారంగా మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.  

లావాదేవీలన్నీ సినీరంగానివే... 
మంగళవారం నటుడు నందు విచారణ సందర్భంగా కెల్విన్‌ను తీసుకొచ్చిన అధికారులు.. బుధవారం కూడా ఆయనను ఈడీ కార్యాలయానికి రప్పించారు. అతడి ల్యాప్‌టాప్‌ను తెరిపించి అందులోంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలిసింది. రానా, కెల్విన్‌లను విడివిడిగా, ఆపై ఇద్దరినీ కలిపి ఈడీ బృందం ప్రశ్నిం చింది. ఇరువురూ చెప్పిన అంశాల్లో కొన్నింటిని క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసింది. రానా తన వెంట రెండు బ్యాంకు ఖాతాలకు సంబందించిన స్టేట్‌మెంట్లు తెచ్చారు.

2015–17 మధ్య లావాదేవీల వివరాలను ఈడీకి ఇచ్చారు. 2017లో ఎఫ్‌–క్లబ్‌లో జరిగిన పార్టీకి హాజరయ్యారా? దాని ముందు, ఆ తర్వాత కెల్విన్‌కు నగదు బదిలీ చేశారా? తదితర అంశాలపై రానాను ప్రశ్నించారు. ఇంతకు ముందే కెల్విన్‌ బ్యాంక్‌ ఖాతా వివరాలు సేకరించిన అధికారులు అం దులో రానా ఖాతా నుంచి డబ్బు బదిలీ అయినట్లు గుర్తించారని సమాచారం. ఈవెంట్‌ మేనేజర్‌ అయిన కెల్విన్‌తో తాను చేసిన లావాదేవీలన్నీ సినీ రంగానికి సంబంధించినవే అని ఈడీ అధికారులకు రానా స్పష్టం చేసినట్లు తెలి సింది. రానా సాయంత్రం 6 గంటలకు ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోగా, ఆ తర్వాత 2 గంటల పాటు కెల్విన్‌ విచారణ సాగింది. 

నేడు నవ్‌దీప్‌ కూడా..? 
ఈడీ సమన్లు అందుకున్న వారిలో నటుడు రవితేజ, ఆయన డ్రైవర్‌ శ్రీనివాస్‌ కూడా ఉన్నారు. వీరిద్దరూ గురువారం ఈడీ కార్యాలయానికి రానున్నారు. సోమవారం నటుడు పి.నవ్‌దీప్‌ హాజరుకావాల్సి ఉంది. అనివార్య కారణాల నేపథ్యంలో ఆయన కూడా గురువారం హాజరుకావడానికి అనుమతి కోరినట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు