ఘంటసాల రత్నకుమార్‌ కన్నుమూత

11 Jun, 2021 02:03 IST|Sakshi
ఘంటసాల రత్నకుమార్‌

మధురమైన గానం, సంగీతంతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన దివంగత ఘంటసాల వెంకటేశ్వరరావు రెండో కుమారుడు ఘంటసాల రత్నకుమార్‌ (63)కన్నుమూశారు. చాలా రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన కొన్ని రోజులుగా డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రత్నకుమార్‌ పరిస్థితి విషమించడంతో గురువారం తుదిశ్వాస విడిచారు. కాగా ఇటీవల కరోనా బారిన పడిన ఆయనకు రెండు రోజుల క్రితమే నెగటివ్‌ వచ్చింది.

డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా గుర్తింపు...
ఘంటసాల వెంకటేశ్వరరావు అమర గాయకుడిగా పేరు గడిస్తే, రత్నకుమార్‌ మాత్రం డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్‌ తొలినాళ్లలో తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ గాయకుడు కావాలనుకున్నా, సరైన బ్రేక్‌ రాలేదు రత్నకుమార్‌కి. ఆ సమయంలో తమిళ చిత్రం ‘కంచి కామాక్షి’కి తెలుగులో డబ్బింగ్‌ చెప్పారాయన. అప్పటినుంచి నాలుగు దశాబ్దాల కెరీర్‌లో వెయ్యికిపైగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, సంస్కృత చిత్రాలకు రత్నకుమార్‌ డబ్బింగ్‌ చెప్పారు.

పదివేలకు పైగా తమిళ, తెలుగు టీవీ సీరియల్‌ ఎపిసోడ్స్‌కు గాత్రాన్ని ఇచ్చారు. 50కి పైగా డాక్యుమెంటరీలకు వాయిస్‌ ఓవర్‌ అందించారు. ఓ సందర్భంలో ఎనిమిది గంటలపాటు ఏకధాటిగా డబ్బింగ్‌ చెప్పి, ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించుకున్నారు. అదే విధంగా ‘అమేజింగ్‌ వరల్డ్‌ రికార్డ్స్, తమిళనాడు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లోనూ ఆయన పేరు నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నుండి ‘ఉత్తమ అనువాద కళాకారుడి’గా ‘తాత–మనవడు’ చిత్రంలో వినోద్‌కుమార్‌ పాత్రకు చెప్పిన డబ్బింగ్‌కి నంది అవార్డును అందుకున్నారు. ఇంకా తెలుగులో రోజా, బొంబాయి సినిమాల్లో అరవింద్‌ స్వామి పాత్రలకు, ‘పుణ్యస్త్రీ, అభినందన’ చిత్రాల్లో కార్తీక్‌ పాత్రలకు, ‘అన్నమయ్య’ తమిళ డబ్బింగ్‌ ‘అన్నమాచార్య’లో నాగార్జున పాత్రకు... ఇలా తన గాత్రంతో ఆ పాత్రలు హైలైట్‌ అయ్యేలా చేశారు రత్నకుమార్‌.

‘డాక్టర్‌ అంబేద్కర్‌’ చిత్రంలో టైటిల్‌ రోల్‌ చేసిన ఆకాష్‌ ఖురానాకి చెప్పిన డబ్బింగ్‌ తనకు చాలా సంతృప్తినిచ్చిందని పలు సందర్భాల్లో రత్నకుమార్‌ పేర్కొన్నారు. తెలుగులో ‘వీరుడొక్కడే’, ‘ఆట ఆరంభం’ వంటి 30కి పైగా సినిమాలకు రత్నకుమార్‌ మాటలు అందించారు. అలాగే ఒక మెగా సీరియల్, ఒక సినిమాకి దర్శకత్వం వహించాలనుకున్నారు. తన తండ్రి ఘంటసాల జ్ఞాపకార్థం ఓ భారీ సినిమా తీయాలనుకున్నారు. అయితే ఆ కోరిక తీరకుండానే తుది శ్వాస విడిచారు. రత్నకుమార్‌కి భార్య కృష్ణకుమారి, కుమార్తెలు వీణ, వాణి ఉన్నారు. తల్లి సావిత్రమ్మ కూడా కొడుకు వద్దే ఉంటున్నారు. రత్నకుమార్‌ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖలు సంతాపం తెలిపారు.
     

ఘంటసాల రత్నకుమార్‌ మరణం దక్షిణ భారత చలన చిత్ర రంగానికి తీరని లోటు అని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
     

ఘంటసాల రత్నకుమార్‌ ఆకస్మిక మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగ¯Œ మోహ¯Œ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రత్నకుమార్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు