King of Kotha Movie: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న చిత్రం.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

25 Sep, 2023 19:20 IST|Sakshi

ప్రేమకథలకు చిరునామాగా మారిన దుల్కర్‌ సల్మాన్‌ తొలిసారి యాక్షన్‌ అవతారమెత్తిన చిత్రం కింగ్‌ ఆఫ్‌ కొత్త. కొత్త అంటే మలయాళంలో టౌన్‌ అని అర్థం. అభిలాష్‌ జోషి దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీ స్టూడియోస్, వేఫేరర్‌ ఫిల్మ్స్‌ నిర్మించాయి. అన్ని భాషల్లోనూ దుల్కర్‌ తనే స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకున్నాడు. ఆగస్టు 24న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సెప్టెంబర్‌ 22న ఓటీటీలోకి వస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. సడన్‌గా ఓటీటీలో వస్తుందేమో అంటే అదీ జరగలేదు.

దీంతో ఈ నెల 28 లేదా 29న ఏదో ఒకరోజు ఓటీటీలోకి రానుందని ప్రచారం జరిగింది.  ఈ ప్రచారానికి తెర దించుతూ అధికారిక ప్రకటన వెలువడింది. హాట్‌స్టార్‌లో సెప్టెంబర్‌ 29 నుంచి స్ట్రీమింగ్‌ కానున్నట్లు హాట్‌స్టార్‌ ప్రకటించింది.  తెలుగు, మలయాళం, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ చేస్తున్నారా? లేదా? అన్నది మాత్రం స్పష్టత లేదు.

సినిమా కథేంటంటే..
కింగ్‌ ఆఫ్‌ కొత్త కథ 80,90వ దశకంలో సాగుతుంది. కోతా అనే టౌన్‌కి చెందిన రాజు(దుల్కర్‌ సల్మాన్‌) తండ్రి రవిలాగే తాను కూడా ఓ పెద్ద రౌడీ కావాలని చిన్నప్పటి నుంచి కలలు కంటాడు. దాన్ని సాకారం చేసుకుంటాడు. అతనికి చెల్లి రీతూ(అనికా సురేంద్రన్‌)అంటే చాలా ఇష్టం. కొడుకు రౌడీ కావడంతో తల్లి అతనితో మాట్లాడేది కాదు. దీంతో కోతా టౌన్‌లోనే స్నేహితుడు కన్నా(షబీర్‌ కళ్లరక్కల్‌)తో కలిసి వేరుగా ఉండేవాడు. రాజుకి అదే ప్రాంతానికి చెందిన తార(ఐశ్వర్య లక్షీ) అంటే చాలా ఇష్టం. ఆమె కోసమే కోతాలో డ్రగ్స్‌ అనేది లేకుండా చేస్తాడు.

ఓ కారణంగా రాజుకు తాగుడు బానిసైతాడు. నెమ్మదిగా కోతా ప్రాంతాన్ని తన చేతుల్లోకి తెచ్చుకున్న కన్నా.. కన్నాభాయ్‌గా మారి ఆ ప్రాంతంలో డ్రగ్స్‌ని విచ్చలవిడిగా అమ్మేస్తుంటాడు. అయితే ఎంతో మంది గ్యాంగ్‌స్టర్స్‌ని మట్టుపెట్టిన సీఐ శావుల్‌(ప్రసన్న) కోతాకి ట్రాన్స్‌ఫర్‌ అవుతాడు. కన్నాభాయ్‌కి చెక్‌ పెట్టేందుకుగానూ రాజుని మళ్లీ కోతా వచ్చేలా చేస్తాడు. అసలు రాజు ఎందుకు కోతాని వదిలి వెళ్లాడు? ప్రాణ స్నేహితులుగా ఉన్న కన్నా, రాజులు ఎందుకు శత్రువులుగా మారారు? చివరకు కోతా ఎవరి ఆధీనంలోకి వెళ్లింది? అనేది తెలియాలంటే ‘కింగ్‌ ఆఫ్‌ కోతా’ను ఓటీటీలో చూడాల్సిందే. 

చదవండి: శరత్‌ బాబు రెండో భార్యగా నా ఫోటోలు.. చాలా బాధేసింది!!

మరిన్ని వార్తలు