Dwayne Johnson: జేమ్స్‌ బాండ్‌ క్రేజ్‌.. కూల్‌ బాండ్‌గా చేయాలనుందన్న ఆ హీరో

27 Nov, 2021 16:17 IST|Sakshi

Dwayne Johnson Wants To Play James Bond Character: హాలీవుడ్‌ ఐకానిక్‌ స్పై థ్రిల్లర్‌ 'జేమ్స్‌ బాండ్‌' సినిమా ఫ్రాంచైజీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. అభిమానులైతే చిన్న చిన‍్న స్పైలు చేస్తూ తాము జేమ్స్‌ బాండ్‌ల ఫీల్‌ అవుతుంటారు.  ఆ పాత్రలో నటించేందుకు యాక్టర్స్‌ సైతం బాండ్‌ అనే బ్రాండ్‌ కోసం ఎంతో ఆరాటపడుతారు. అలాంటి జాబితాలో 'సూపర్‌ మ్యాన్‌'గా పాపులర్‌ అయిన 'కావిల్‌ హెన్రీ'తోపాటు హాలీవుడ్‌ హీరోలు ఎంతోమంది ఉన్నారు. ఈ జాబితాలో తాజాగా చేరారు 'డ్వేన్‌ జాన్సన్‌ (ది రాక్‌)'. ఇటీవల ఈ స్టార్‌ నటించిన రెడ్‌ నోటీస్ సూపర్‌ సక్సెస్‌ అందుకుంది. ఈ విజయాన్ని ఎంజాయ్‌ చేస్తున్న డ్వేన్ ఓ ఇంటర్య్వూలో తన మనసులోని కోరికను బయటపెట్టాడు. రీసెంట్‌గా వచ్చిన జేమ్స్‌ బాండ్‌ చిత్రం 'నో టైమ్‌ టూ డై'లో హీరోగా చేసిన డేనియల్‌ క్రేగ్‌కి బాండ్‌గా చివరి సినిమా. కాగా జేమ్స్‌ బాండ్‌ పాత్రలో తర్వాత ఎవరినీ తీసుకోవాలనే చర్చ నడుస‍్తోంది. 

'1967లో వచ్చిన 007 సినిమా యూ ఓన్లీ లివ్‌ ట్వైస్‌లో మా తాత పీటర్‌ మైవియా విలన్‌గా నటించారు. అవును, 'సీన్‌ కానరీ' బాండ్‌గా చేసిన సినిమాలో మా తాత విలన్‌. నేను ఆ 'సీన్‌ కానరీ'లా కూల్‌ బాండ్‌గా నటించాలనుకుంటున్నాను. నాకు విలన్‌ అవ్వాలని లేదు. నేను బాండ్‌ అవ్వాలి' అని 'ఎస్కైవర్‌ వీడియో సిరీస్‌ అయిన ఎక్స్‌ప్లేన్‌ దిస్‌ షో'లో జాన్సన్‌ తెలిపాడు. అయితే ఇంతకుముందు ఏ ఒక్క అమెరికన్‌ బాండ్‌ పాత్ర పోషించకపోగా, అమెరికన్లందరూ బాండ్‌ ఫ్రాంచైజీలో విలన్లుగా కనిపించారు. అందుకే జాన్సన్‌కు విలన్‌గా చేయాలని లేనట్లు తెలుస్తోంది.
 

డేనియల్‌ క్రేగ్‌కు బాండ్‌గా ఐదో చిత్రమైన 'నో టైమ్‌ టూ డై' అక్టోబర్‌ మొదటి వారంలో విడుదలై యూఎస్‌ బాక‍్సాఫీస్‌ వద్ద 56 మిలియన్ల అమెరికన్‌ డాలర్లు కొల‍్లగొట్టింది. తదుపరి బాండ్‌ చిత్రం ఎప్పుడూ అనేది ఇంకా స్పష్టత రాలేదు. ఎందుకంటే డేనియల్‌కి ప్రత్యామ్నాయంగా తర్వాతి బాండ్‌ ఎవరూ అనేది ప్రకటించలేదు. ఈ జేమ్స్‌ బాండ్‌ పాత్ర ఎంపికపై 2022 వరకు చర్చించలేమని దర్శకనిర్మాతలు తెలిపారు. మరోవైపు జాన్సన్‌ 'బ్లాక్‌ ఆడమ్‌' సినిమాతో డీసీ ఫ్రాంచైజీలోకి అడుగుపెడుతున్నాడు. అలాగే ఇటీవల విడుదలైన డిస్నీ వెంచర్‌ 'జంగిల్‌ క్రూజ్‌'కు సీక్వెల్‌ కూడా రానుంది. 

మరిన్ని వార్తలు