అమెజాన్ ప్రైమ్ లో టాప్ 10 చిత్రంగా ‘ఏకమ్‌’

18 Jan, 2022 15:32 IST|Sakshi

చిన్న చిత్రాలకు ఓటీటీలు వరంలా మారాయి. థియేటర్లలో రిలీజ్‌కు నోచుకోని చిత్రాలకు, విడుదలైన అంతగా ఆడలేకపోయిన సినిమాలకు మంచి వేదికగా మారాయి. ఇప్పటికే పలు చిన్న చిత్రాలు ఓటీటీలో విడుదలై.. మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. తాజాగా మరో చిన్న చిత్రం ‘ఏకమ్‌’ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదలై  విజయవంతంగా దూసుకెళ్లోంది. ప్రైమ్‌లో 503వ చిత్రంగా విడుదలైన ఈ చిత్రం.. కేవలం పది రోజుల్లో టాప్-10లో స్థానం సంపాదించుకుని అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షిస్తోంది.

పంచ భూతాల నేపథ్యంలో ఫిలసాఫికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి  వరుణ్ వంశీ దర్శకత్వం వహించగా.. ఎస్.ఎమ్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై ఎ.కళ్యాణ్ శాస్త్రి-పూజ.ఎమ్-శ్రీరామ్.కె సంయుక్తంగా నిర్మించారు.  అభిరామ్ వర్మ, శ్వేతావర్మ, తనికెళ్ళ భరణి, అదితి మ్యాకల్, కల్పిక గణేష్, దయానంద్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమెజాన్‌ ప్రైమ్‌లో తమ చిత్రం టాప్‌-10లో స్థానం సంపాదించుకోవడం పట్ల చిత్ర యూనిట్‌ హర్షం వ్యక్తం చేసింది.  

ఈ సందర్భంగా చిత్రదర్శకుడు వరుణ్ వంశీ మాట్లాడుతూ... "ఏకమ్" చిత్రాన్ని ప్రేక్షకులంతా ఏకగ్రీవంగా ఆదరిస్తుండడం చాలా సంతోషాన్నిస్తోంది. మా నిర్మాతల పెట్టుబడిని సేఫ్ గా వెనక్కి తెస్తుండడంతోపాటు... దర్శకుడిగా నాకు రెండో సినిమా వచ్చేలా చేసింది. ప్రస్తుతం అమెజాన్ లో టాప్ 10లో ఉన్న "ఏకమ్" అతి త్వరలో మొదటి రెండు మూడు స్థానాల్లో సగర్వంగా నిలుస్తుందనే నమ్మకం మాకుంది. అమెజాన్ ఆడియన్స్ తోపాటు... "ఏకమ్" చిత్ర రూపకల్పనలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను" అన్నారు.

మరిన్ని వార్తలు