నాన్న ఇంట్లో ఉండటమే మాకు పెద్ద పండుగ...

13 Jun, 2021 14:41 IST|Sakshi

ధర్మదాత, అక్కాచెల్లెళ్లు, నాటకాల రాయుడు... చిత్రాలకు దర్శకత్వం వహించారు...
మరెన్నో చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేశారు...
ఎల్‌.వి.ప్రసాద్‌ తమ్ముడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు..
ఎ. సంజీవిగా పేరు నిలబెట్టుకున్నారు..
కుమారుడు కూడా ఎడిటర్‌ అయ్యారు...
తండ్రి తాలూకు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ప్రముఖ ఎడిటర్‌ శ్రీకర్‌ప్రసాద్‌..

నాన్న ఇంట్లో ఉన్న రోజే మాకు పండుగ. సినిమాలలో బిజీగా ఉండటం వల్ల నాన్నతో తక్కు వ సమయం గడిపేవాళ్లం. సమయం దొరికినప్పుడు మాతో సరదగా గడిపేవారు. తెల్లటి వస్త్రాలలో, క్లీన్‌ షేవ్‌ చేసుకుని నీట్‌గా ఉండేవారు. ఎడిటింగ్‌ రూమ్‌ కూడా ఎంతో శుభ్రంగా ఉండేది. అక్కినేని శ్రీరాములు, బసవమ్మ దంపతులకు నాన్న ఆరో సంతానం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దగ్గర పెద్దవేగిలో పుట్టారు. నాన్నకి నలుగురు అన్నయ్యలు, ఒక అక్కయ్య. బసవయ్య, ఎల్‌. వి. ప్రసాద్, సుబ్బమ్మ, నారాయణరావు, రామచంద్ర రావు. మా పెద్దనాన్న ఎల్‌వి ప్రసాద్‌ అందరికంటె ముందుగా సినీ రంగంలోకి ప్రవేశించారు. ఆ తరవాత నాన్న చెన్నై వచ్చి, పెద్ద నాన్న దగ్గర సినిమా ఎడిటింగ్‌ నేర్చుకున్నారు. కొంతకాలం తర్వాత దర్శకత్వం కూడా చేశారు. అక్కచెల్లెళ్లు, ధర్మదాత, సిసింద్రీ చిట్టిబాబు, విశాలి, నాటకాల రాయుడు వంటి చిత్రాలు తీశారు.  

గారం చేసేవారు..
1963 లో నేను పుట్టే నాటికి నాన్న బిజీగా ఉండేవారు. రాత్రి పన్నెండు గంటలకు వచ్చి, ఉదయం ఎనిమిది గంటలకు వెళ్లిపోయేవారు. నాకు ఇద్దరు అక్కలు.. గృహలక్ష్మి, పంకజ. నేనొక్కడినే అబ్బాయిని కావటం వల్ల నన్ను గారం చేస్తున్నారని అందరూ నాన్నను ఆటపట్టించేవారు. చెన్నై ప్యారిస్‌ కార్నర్‌ నుంచి దానిమ్మ కాయలు, బాసుంది వంటివి తెచ్చేవారు.  

నాన్న దగ్గర చేరిక..
ఇల్లు చూసుకుంటూ స్ట్రిక్ట్‌గా ఉండే అమ్మ రాధ, లిబరల్‌గా ఉండే నాన్న... ఇటువంటప్పుడు తండ్రి వైపు మొగ్గు చూపటం సహజమే కదా. అందువల్ల నాన్నతో అటాచ్‌మెంట్‌ ఎక్కువ. నాన్న మమ్మల్ని ఎన్నడూ కొట్టలేదు, తిట్టలేదు. ఏది చదువుకుంటా మంటే అదే చదివించారు. నేను బి.ఏ లిటరేచర్‌ చేశాను. ఆ తరవాత జర్నలిజం చదువుదామను కున్నాను. కాని నాన్న దగ్గర పని నేర్చుకోవటంలో ఆ విషయమే కాదు, పోటీ పరీక్షలు రాయవలసిన విషయం కూడా మర్చిపోయాను. 

మా బాల్యంలో...
నేను చిన్నప్పుడు బాగా అల్లరిచేసేవాడిననీ, నేను చేసే అల్లరి పనులన్నీ అక్కయ్యల మీదకు తోసేవాడిన నీ నాన్న సరదాగా చెప్పేవారు. మా స్కూల్‌ లంచ్‌ టైమ్‌లో నాన్న ఇంటికి భోజనానికి వచ్చేవారు. ఇల్లు స్కూల్‌కి బాగా దగ్గర కావటం వల్ల మేం కూడా ఇంటికి వచ్చేవాళ్లం. అందరం కలిసి భోజనం చేసేవాళ్లం. అసలు నాన్న ఇంట్లో ఉండటమే పండుగ అంటారు అక్కయ్యలు. ఒక విషయం నాన్న తరచు చెప్పేవారు. మా ఇంట్లో ఒక అల్సేషియన్‌ డాగ్‌ ఉండేది. నేను పుట్టక ముందు వరకు దాన్ని చాలా గారంగా చూశారట. నేను పుట్టాక ఆ అటెన్షన్‌ నా మీదకు తిరిగింది. దాంతో మా డాగ్‌కి కోపం వచ్చి, నాకు ఐదేళ్లు వచ్చేలోపు నన్ను ఐదారుసార్లు కరిచేసింది. నేను ఏడుస్తుంటే, నాన్న బాధపడేవారు. ఒకరోజున నాన్నకి కోపం వచ్చి, దాన్ని కేకలేశారు. అది అలిగి మంచం కిందకు దూరి, రెండు రోజుల దాకా బయటకు రాలేదు. ఆ విషయం తలుచుకున్నప్పుడల్లా నాకు చాలా ఆనందం కలుగుతుంది. 

ఇష్టం లేకుండానే... 
నాన్న తనతో పాటు నన్ను షూటింగ్‌కి తీసుకెళ్లేవారు. ఒకసారి ప్రముఖ సినిమాటో గ్రాఫర్‌ రవికాంత్‌ నగాయిచ్‌ ట్రిక్‌ ఫొటోగ్రఫీ చేస్తున్నారు. ఫిల్మ్‌ రోల్‌ను చుట్టలా చుట్టి, కెమెరాకు పెట్టి, ఏదో చేస్తున్నారు. అప్పుడు అందులో నుంచి బాణాలు వస్తున్న ఎఫెక్ట్‌ వచ్చింది. అలా నాన్నతో వెళ్లినప్పుడు అక్కడ జరుగుతున్న విషయాలు చూస్తూండేవాడిని. కాని నాకు పని నేర్చుకోవాలనే శ్రద్ధ ఉండేది కాదు. నేను సినిమా లైన్‌లోకి రాకూడదనుకున్నారు ఇంట్లో వాళ్లంతా. సినిమాల వల్ల ఫ్యామిలీతో గడపటానికి సమయం దొరకదు, సినిమా ప్రపంచంలో నిలకడ ఉండదు, ఎత్తుపల్లాలు ఉంటాయి... అని ఇంట్లో వాళ్లు చెప్పిన మాటలు నా మనసులో పడిపోయాయి. 

నన్ను నేర్చుకోమన్నారు..
నాన్న ఎన్ని ఇబ్బందులు పడుతున్నా తన ఒత్తిడిని మా వరకు రానిచ్చేవారు కాదు. అప్పట్లో బుక్స్‌ చదువుతుండేవాడిని. నెమ్మదిగా సినిమాలు చూడటం ప్రారంభించాను. సినిమా చూడాలనే ఆసక్తి పెరిగింది కానీ ఎడిటింగ్‌ మీద ఆలోచన లేదు. కాని నాన్న ఒకసారి, ‘ఎడిటింగ్‌ చేసేటప్పుడు చూసి ఎలా చేయాలో నేర్చుకో’ అని చెప్పారు. నెమ్మదిగా నాన్న చేస్తున్న పనిని దీక్షగా పరిశీలించటం మొదలుపెట్టాను. నాన్నగారి కమిట్‌మెంట్‌ గురించి అర్థం చేసుకున్నాను. 24 ఫ్రేమ్స్‌ రన్‌ అయితే ఒక సెకన్‌ సినిమా కనిపిస్తుంది, ఏ సందర్భంలో ఎలా ఎడిట్‌ చేయాలి.. అనే విషయాలు నాన్న దగ్గర అసిస్టెంట్‌గా పని చేస్తూ, చూసి నేర్చుకున్నాను. నాన్న పక్కన ఉంటే చాలా ప్రొటెక్టివ్‌గా అనిపించేది. నాన్న తన జీవితంలో ఎత్తుపల్లాలు చూశారు. భవిష్యత్తులో డబ్బు ఇబ్బంది వస్తుంది, దాచుకోవాలి.. అనే ఆలోచనే ఉండేది కాదు. చేతిలో ఎంత ఉంటే అంత ఖర్చు చేసేవారు. దీపావళి పండుగకి బుట్టెడు టపాసులు కొనేవారు. 

నాన్న ప్రోగ్రెసివ్‌..
నాన్న చాలా ప్రోగ్రెసివ్‌ అనిపిస్తారు. నాన్న నా మీద ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు. ‘నేను అనుకున్నది జరగాలి’ అని కాకుండా ‘వాళ్లు అనుకున్నది జరగాలి’ అనుకునేవారు. నాన్నను చూస్తే ‘జెంటిల్‌మన్‌’ అనిపిస్తుంది. నాకు నాన్న అలాగే తెలుసు. 1989 హిందీలో తీసిన రాక్‌ సినిమాకు నాకు ఉత్తమ ఎడిటర్‌ అవార్డు వచ్చినప్పుడు నాన్న ముఖంలో ఆ ఆనందం స్పష్టంగా కనిపించింది. శ్రద్ధగా పనిచేయటం నాన్న దగ్గరే నేర్చుకున్నాను. అదే నాకు అవార్డు తెచ్చిపెట్టిందనుకుంటాను. 2002లో 74 వ ఏట నాన్న కన్నుమూశారు. అది మాకు పెద్ద షాక్‌.

- వైజయంతి పురాణపండ

మరిన్ని వార్తలు