సూపర్‌ స్టార్‌ కృష్ణ మేకప్‌ లేకుండా నటించిన చిత్రం ఏమిటో తెలుసా?

16 Nov, 2022 15:51 IST|Sakshi

సీటీఆర్‌ఐ(రాజమహేంద్రవరం)/అమలాపురం టౌన్‌/ఆత్రేయపురం/అన్నవరం/కొత్తపేట/కరప: సూపర్‌ స్టార్‌ కృష్ణ మృతితో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఆయన అభిమానులు విషాదంలో మునిగిపోయారు. 50 ఏళ్ల పాటు నిరంతరాయంగా ‘సాహసమే ఊపిరి’గా వెండి తెరపై ఎన్నో రికార్డులను నెలకొల్పిన తమ నటశేఖరుడు.. మా ‘మాయదారి మల్లిగాడు’ ఇక లేడనే విషయం తెలుసుకుని కంటతడిపెట్టారు.

ఎన్నో హిట్లు, సూపర్‌ హిట్లు, అద్భుత విజయాలు ఆవిష్కరించి.. సినీ ‘సింహాసనం’పై మహానటుడిగా వెలుగొందిన కృష్ణతో తమ ప్రాంతానికి.. తమకు ఉన్న అనుబంధాన్ని స్మరణకు తెచ్చుకున్నారు. నటశేఖరుడు తన సినీ ప్రస్థానం ఆరంభంలోనే జిల్లాతో అనుబంధం ఏర్పరుచుకున్నారు.

గోదావరిని వెండితెరకు పరిచయం చేసిన దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు రాజమహేంద్రవరం ముుద్దుబిడ్డ. ఈయన 1965లో నిర్మించిన ‘తేనె మనసులు’ చిత్రం ద్వారా కృష్ణ సినీతెరకు హీరోగా పరిచయమై.. అందరి మనస్సుల్లో చోటు సంపాదించారు. ఆ చిత్రంలో ఆయన సరసన నటించిన సుకన్య కూడా మన రాజమహేంద్రవరానికి చెందిన ఆరి్టస్టే. ఈ రకంగా ఆయన తొలి హిట్‌ వెనుక గోదావరి ప్రభావముంది.

‘సాక్షి’ ఓ టర్నింగ్‌ పాయింట్‌.. 
గోదావరి ప్రాంతానికి చెందిన బాపు తీసిన ‘సాక్షి’ చిత్రం కృష్ణ కెరీర్‌ను ఓ మలుపు తిప్పింది. ఈ సినిమాలో కృష్ణ సినిమా పూర్తయ్యే వరకూ మేకప్‌ లేకుండానే నటించారు. మానవత్వం మీద నమ్మకం గల పల్లెటూరి అమాయకుడి పాత్రలో ఆయన ఒదిగిపోయారు. విజయనిర్మలతో నటించిన తొలి చిత్రం కూడా ఇదే. ఈ చిత్ర నిర్మాణం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 20 రోజులకు పైగా సాగింది. తర్వాత వరుస విజయాలతో చిత్ర పరిశ్రమలో సూపర్‌ స్టార్‌ దూసుకుపోయారు.

కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృష్ణ నటించిన ‘ఊరికి మొనగాడు’ చిత్రం షూటింగ్‌ రామచంద్రపురం పరిసరాల్లో ఎక్కువ కాలమే సాగిందని ఇక్కడి ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. అల్లూరి సీతారామరాజు, పాడి పంటలు, భోగిమంటలు, దొరగారికి స్వాగతం, నేనంటే నేనే వంటి తదితర చిత్రాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే షూటింగ్‌ జరిగాయి.

స్వాతంత్ర వీరుడా...స్వరాజ్య బాలుడా..! 
అల్లూరి సీతారామరాజు సినిమా చిత్రీకరణ ఈ ప్రాంతంపై చెరగని ముద్ర వేసుకుంది.  1974లో తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీతో పాటు అన్నవరం పరిసరాలను తొలిసారిగా తెరకెక్కించారు కృష్ణ.  తెలుగు వీర లేవరా ’ పాటలోని ‘స్వాతంత్ర వీరుడా స్వరాజ్య బాలుడా!  అనే చరణాన్ని సత్యదేవుని ఆలయ ప్రాంగణంలో చిత్రీకరించారు. ఆ పాట కోసం రాజమహేంద్రవరం, కడియం నుంచి రెండు లారీల పూలు రత్నగిరికి తీసుకువచ్చి అల్లూరి సీతారామరాజు పాత్రధారి కృష్ణ మీద చల్లారు. 1980 నాయుడు గారి అబ్బాయి షూటింగ్‌ కూడా అన్నవరంలోనే జరిగింది. కృష్ణ, అంబిక మధ్య ఒక పాట సత్యదేవుని ఆలయ ప్రాంగణం, పంపా నది, మిస్సెమ్మ కొండ పరిసరాల్లో చిత్రీకరించారు. నాయుడు గారి అబ్బాయి సినిమా షూటింగ్‌ సమయంలో పలువురు దేవస్థానం ఉద్యోగులు కృష్ణతో ఫొటో దిగారు.

కృష్ణ అంటే అభిమానమే వేరు 
అభిమానులను నటశేఖరుడు గుండెల్లో పెట్టుకుని చూసుకునేవాడు. రామచంద్రాపురంలోని రాజు గారి కోటలో ఊరికి మొనగాడు సినిమా షూటింగ్‌ సమయంలో ఎక్కడెక్కడి నుంచో అభిమానులు వచ్చి పడిగాపులు కాసేవారు. మనసున్న కృష్ణ వారందరికి భోజనాలు ఏర్పాటు చేయాలని చెప్పేవారు. భోజనం చేశాక వెళ్లాలని చెప్పేవారని నాటి తరం అభిమానులు చెబుతారు. ఈ సినిమా విజయవంతమైనప్పుడు తమకు వాచీలు బహూకరించారని అభిమాన సంఘం నాయకులు మననం చేసుకుంటున్నారు.

గలగల పారుతున్న గోదారిలా 
1974లో కోనసీమలో ‘గౌరి’ చిత్రం షూటింగ్‌ 30 శాతం పచ్చని సీమలోనే సాగింది. కృష్ణ, జమున ఈ చిత్రానికి హీరో హీరోయిన్లు. పి.గన్నవరం వద్ద వైనతీయ నదీ పాయపై హీరోయిన్‌ జమునకు కృష్ణ సైకిల్‌ నేర్పిస్తుండగా ఓ పాట చిత్రీకరించారు. ‘గల గల పారుతున్న గోదారిలా’ పాటను కూడా ఇక్కడి పరిసరాల్లోనే చిత్రీకరించారు. అప్పట్లో కృష్ణ కోనసీమలో దాదాపు 10 రోజుల బస చేశారు. డిగ్రీ విద్యారి్థగా 30 ఏళ్ల క్రితమే కృష్ణ చేతుల నుంచి వర్ధమాన కవిగా అవార్డు అందుకున్నానని అమలాపురానికి చెందిన కవి, రాష్ట్ర ప్రభుత్వ సాహిత్య పురస్కార గ్రహీత ఎస్‌ఆర్‌ఎస్‌ కొల్లూరి ఆయనతో తనకున్న కొద్దిపాటి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

పులిదిండిలోనే దండిగా షూటింగ్‌ 
1967లో కృష్ణ హీరోగా తీసిన ‘సాక్షి’ సినిమాను ఆత్రేయపురం మండలంలోని పలు ప్రాంతాల్లో చిత్రీకరించారు. అవుట్‌ డోర్‌ షూటింగ్‌ పులిదిండిలో జరిగింది. ఈ సినిమా చిత్రీకరణకు ముందు కథా రచయిత ముళ్లపూడి వెంకటరమణ, దర్శకుడు బాపు సినిమాకు తమ ఊహలకు తగ్గ గ్రామం ఎంపిక చేయాలని తమ బాల్యమిత్రుడు బీవీఎస్‌ రామారావును  కోరారు. ఆయన రాజమండ్రి వచ్చి ఇరిగేషన్‌ కాంట్రాక్టర్‌ కలిదిండి రామచంద్రరాజుకు సూచించారు. దీంతో బాపు, రమణల ఊహకు తగ్గట్టుగా  పులిదిండిని ఎంపిక చేశారు. ఇక్కడే చాలా వరకు షూటింగ్‌ చేశారు. గ్రామంలోని మీసాల కృష్ణుడి ఆలయంలో కూడా చిత్రీకరించారు.

ఎనలేని అభిమానం
నాకు కృష్ణ అంటే ప్రాణం. జిల్లాలో ఎక్కడ షూటింగ్‌ జరుగుతోందని తెలిసినా వెళ్లిపోయేవాడిని. ఏటా మా గ్రామంలో ఆయన పుట్టిన రోజు వేడుక నిర్వహిస్తాను. మమ్మల్ని ఆప్యాయంగా పలకరించేవారు. పద్మాలయ స్టూడియోలో ఆయనను కలిసిన రోజు ఎప్పటికీ మరిచిపోను. కలిసిన ప్రతిసారీ అన్నవరం ప్రసాదం అందజేసేవాడిని. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. 
– సలాది కృష్ణ, అభిమాన సంఘ అధ్యక్షుడు, ప్రత్తిపాడు, కాకినాడ జిల్లా  

మరిన్ని వార్తలు