‘ఏక్ మినీ క‌థ‌’ మూవీ రివ్యూ

27 May, 2021 11:14 IST|Sakshi
Rating:  

టైటిల్‌:  ఏక్ మినీ క‌థ‌
న‌టీటులు: సంతోష్ శోభన్, కావ్య థాపర్, బ్రహ్మాజీ, హర్షవర్ధన్‌, సుదర్శన్‌, పోసాని, శ్రద్ధాదాస్‌, సప్తగిరి తదితరులు
నిర్మాణ సంస్థ :  యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగో మాస్ మీడియా
ద‌ర్శ‌క‌త్వం: కార్తీక్ రాపోలు
సంగీతం:   ప్రవీణ్‌ లక్కరాజు
సినిమాటోగ్ర‌ఫీ : గోకుల్‌ భారతి
విడుదల తేది :  మే 27, 2021(అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో)

‘పేపర్‌ బాయ్‌’ సినిమా ఫేమ్‌ సంతోష్‌ శోభన్, కావ్యా తప్పర్‌ జంటగా నటించిన చిత్రం ‘ఏక్‌ మినీ కథ’. కార్తీక్‌ రాపోలు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించడం విశేషం. ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్ ద‌గ్గ‌ర నుంచి అంద‌రిలో ఆస‌క్తి పెంచుతూ వ‌చ్చింది. ఈ సినిమా టీజ‌ర్, ట్రైల‌ర్ లు అంద‌ర్ని విశేషంగా ఆక‌ట్టుకోవడ‌మే కాకుండా సోష‌ల్ మీడియా ట్రెండింగ్ లో నిలిచాయి.  దీంతో ఈ సినిమాపై పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయింది.  దీనికి తోడు ప్రమోషన్స్‌ కూగా గ్రాండ్‌గా చేయడంతో  సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ.. ఎన్నో అంచనాల మధ్య గురువారం (మే 27)న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదలైంది. మరి ఆ అంచనాలను ‘ఏక్ మినీ క‌థ‌’ ఏ మేరకు అందుకుంది? ‘పేపర్‌ బాయ్‌’తొ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంతోష్‌ ఈ సినిమాతో హిట్‌ కొట్టాడా లేదా? రివ్యూలో చూద్దాం.

కథ
సివిల్‌ ఇంజనీర్‌ సంతోష్‌(సంతోష్‌ శోభన్‌) చిన్నప్పటి నుంచి తన జననాంగంచిన్నదనే న్యూనతాభావంతో ఉంటాడు. ‘సైజ్’చిన్నగా ఉండడం వల్ల వివాహ జీవితంలో సమస్యలు వస్తాయని భావించి, పరిష్కారం కోసం పలు రకాలుగా ప్రయత్నిస్తాడు. చివరకి ‘సైజ్‌’పెంచుకోవడం కోసం ప్రాణాలు ఫణంగా పెట్టి ఆపరేషన్‌కి కూడా సిద్దమౌతాడు. కానీ ఆయన సమస్యకు పరిష్కారం మాత్రం లభించదు. ఈక్రమంలోనే తనకు అమృత(కావ్య థాప‌ర్‌)తో వివాహం జరుగుతుంది. కానీ శోభనాన్ని మాత్రం వాయిదా వేస్తుంటాడు. ‘సైజ్‌’పెంచుకున్నా తర్వాతే శోభనాన్ని జరుపుకోవాలని భావించిన శోభన్‌.. మళ్లీ ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఈక్రమంలో సంతోష్‌ ఇంటికి స్వామిజీ(శ్రద్ధాదాస్‌) వస్తుంది. అసలు స్వామిజీ సంతోష్‌ ఇంటికి ఎందుకు వచ్చింది? సంతోష్‌ సమస్యకు పరిష్కారం లభించిందా లేదా? తన సమస్యకు పరిష్కారం వెతికే క్రమంలో సంతోష్‌ను తండ్రి రామ్మోహన్ (బ్రహ్మాజీ) ఎలా అపార్థం చేసుకొన్నాడు? ‘సైజ్‌’ప్రాబ్లం ఆ కొత్త కాపురంలో ఎలాంటి అపార్థాలు తీసుకొచ్చింది? అనేది ఓటీటీ తెరపై చూడాల్సిందే.

నటీనటులు
‘పేపర్‌ బాయ్‌’సినిమాతో నటుడిగా మంచి గుర్తింపుతెచ్చుకున్న దర్శకుడు శోభన్‌ తనయుడు సంతోష్‌ ఈ సినిమాలో హీరోగా నటించాడు. ‘సైజ్‌’చిన్నదనే ఆత్మ నూన్యతా భావంతో బాధపడే యువ సివిల్‌ ఇంజనీర్‌ సంతోష్‌ పాత్రలో సంతోష్‌ శోభన్‌ ఒదిగిపోయాడు. తన అమాయకత్వపు పనులతో నవ్వించాడు. కొన్ని ఎమోషనల్‌ సీన్లను బాగా పండించాడు. త‌న ఎక్స్‌ప్రెష‌న్స్‌, డైలాగ్ డెలివ‌రీ అన్నీ చ‌క్క‌గా స‌రిపోయాయి. సినిమా భారం మొత్తాన్ని తన మీద వేసుకొని కథని నడిపించాడు. హీరోయిన్‌ కావ్య థాపర్‌ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ ఉన్నంతలో బాగా చేసింది. అపార్థం చేసుకునే తండ్రిగా బ్రహ్మాజీ మెప్పించాడు. కమెడియన్లు సుదర్శన్‌, సప్తగిరి నవ్వించే ప్రయత్నం చేశారు. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

విశ్లేషణ
‘స్వాతి పుస్తకంలో సెక్సాలజీ కాలమ్‌ చదువుతున్నప్పుడు ఈ కథ రాయాలనే ఆలోచన వచ్చింది’ అని రచయిత మేర్లపాక గాంధీ చెప్పినప్పుడే  ఇది అడల్ట్‌ సినిమా అని అర్థమైపోయింది. దానికి తోడు సినిమా కథ ఏమిటనేది ట్రైలర్‌లోనే క్లారీటీ ఇచ్చేశాడు దర్శకుడు. ‘సైజ్‌`చిన్న‌ద‌ని భ‌య‌ప‌డిపోయే ఓ యువకుడి కథ ఇది. నిజానికి చాలా సున్నితమైన అంశం ఇది. దీన్ని తెరపై చూపించడమనేది కత్తిమీద సాములాంటిదే.

ఇలాంటి సెన్సిబుల్‌, సెన్సిటివ్‌ పాయింట్‌కి కామెడీ పూత పూసి కథనం నడిపాడు దర్శకుడు. ఈ విషయంలో దర్శకుడిని ప్రశంసించాల్సిందే. ​కథలో బోల్డ్‌ అంశం ఉన్నప్పటీ.. కథనంలో మాత్రం మరీ అంత అడల్ట్‌ అయితే కనిపించడు. అయినప్పటికీ కుటుంబం అంతా కలిసి ఈ మూవీ చూడడం కష్టమే. ఇది సినిమాకు కాస్త మైనస్‌ అనే చెప్పాలి. ఈ సినిమాని బోల్డ్‌గా తెరకెక్కించినా ఒక వర్గం ఆడియన్స్‌ని ఆకర్షించేంది. పస్టాఫ్‌లో ఫన్‌ బాగున్నా.. కొన్ని సీన్లు కావాలని ఇరికించారనే ఫీలింగ్‌ కలుగుతోంది.

ఇక సెకండాఫ్‌ మొత్తం శోభ‌నాన్ని వాయిదా వేయ‌డం అనే పాయింట్ పైనే సాగుతుంది. చెప్పడానికి కథ పెద్దగా లేకపోవడంతో కొన్ని సీన్లను అతికించి సినిమాను నడిపించారు. స‌ప్త‌గిరి కామెడీ కాస్త నవ్వించినా... రిపీట్ అయిన ఫీలింగ్ క‌లుగుతుంది.  సెకండాఫ్‌లో శ్రద్ధదాస్‌ ఎంట్రీ తర్వాతో ఏదైన అద్భుతం జరుగుతందని భావించిన ప్రేక్షకుడికి నిరాశే మిగులుతుంది. ఎమోషన్‌ కూడా అంతగా పండలేదు.  క్లైమాక్స్‌ కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. క్లైమాక్స్‌లో హీరో హీరోయిన్లు కలవడం తప్పదు కాబట్టి ఈ సన్నీవేశాలు పెట్టారనే ఫీలింగ్‌ కలుగుతుంది. ప్రవీణ్‌ లక్కరాజు సంగీతం బాగుంది. గుర్తిండిపోయే పాటలు అయితే లేవు కానీ.. నేపథ్య సంగీతం మాత్రం చాలా బాగుంది.  గోకుల్‌ భారతి సినిమాటోగ్రాఫి ఆకట్టుకుంటుంది. యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగో మాస్ మీడియా నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌
సంతోష్‌ శోభన్‌ నటన
ఫస్టాఫ్‌
కొన్ని కామెడీ సీన్స్‌


మైనస్‌ పాయింట్స్‌
స్లో నేరేషన్
సెకండాఫ్‌
రొటీన్‌ క్లైమాక్స్‌

-- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(2.5/5)
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు