Tollywood Drugs Case: 'సెలబ్రిటీలపై కెల్విన్ చెప్పిన విషయాలు నమ్మశక్యంగా లేవు'

20 Sep, 2021 18:38 IST|Sakshi

Tollywood Drugs Case: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో సెలబ్రిటీలపై బలమైన ఆధారాలు లేవని ఎక్సైజ్‌ శాఖ తెలిపింది. సినీతారలపై కెల్విన్‌ ఇచ్చిన కెల్విన్ వాంగ్మూలం దర్యాప్తును తప్పుదోవపట్టించేలా ఉన్నాయని, కేవలం నిందితుడు చెప్పిన విషయాలను బలమైన ఆధారాలుగా భావించలేం అని ఎక్సైజ్‌ శాఖ తెలిపింది. 'సినీ తారలు, విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, హోటల్ నిర్వాహకులకు డ్రగ్స్ అమ్మినట్లు కెల్విన్ వాంగ్మూలం ఇచ్చారు.

దాని ఆధారంగా సిట్‌ బృందం పలువురు సినీ తారలకు నోటీసులు ఇచ్చి ప్రశ్నించింది. అన్ని రకాల సాక్ష్యాలను సిట్ బృందం పరిశీలించి, విశ్లేషించింది. అయితే సెలబ్రిటీలపై బలమైన ఆధారాలు లభించలేదు. సెలబ్రిటీలను నిందితులుగా చేర్చేందుకు కేవలం కెల్విన్ వాంగ్మూలం సరిపోదు. అంతేకాకుండా సెలబ్రిటీలు, ఇతర అనుమానితుల వద్ద డ్రగ్స్ కూడా లభించలేదు' అని ఎక్సైజ్‌ శాఖ పేర్కొంది. 

ఇప్పటికే పూరి జగన్నాథ్, తరుణ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఫోరెన్సిక్‌  సైన్స్‌ ల్యాబ్‌(ఎఫ్ఎస్‌ఎల్‌) తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. కాగా నిందితులు, సాక్షుల జాబితాలో సినీ తారల పేర్లను ఎక్సైజ్ శాఖ  పొందుపరచలేదు. 

మరోవైపు ఈ  కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కెల్విన్‌ గురించి మాట్లాడుతూ.. 'కెల్విన్‌ మంగళూరులో చదువుకునేటప్పుడు డ్రగ్స్ కు అలవాటు పడ్డాడని ఎక్సైజ్‌ శాఖ తెలిపింది. 2013 నుంచి తన స్నేహితులకు డ్రగ్స్ అమ్మడం మొదలు పెట్టాడు. గోవా, విదేశాల నుండి డార్క్ వెబ్ ద్వారా కెల్విన్ డ్రగ్స్ తెప్పించాడు. వాట్సప్, మెయిల్ ద్వారా ఇతరుల నుంచి ఆర్డర్లు తీసుకొని డ్రగ్స్ సరఫరా చేశాడు.

చిరునామాలు, ఇతర కీలక వివరాలు దర్యాప్తులో కెల్విన్ వెల్లడించలేదు. కెల్విన్, అతని స్నేహితులు నిశ్చయ్, రవికిరణ్ ప్రమేయం ఆధారాలున్నాయి. సోదాల సందర్భంగా కెల్విన్ వంటగది నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు' అని ఎక్సైజ్‌ శాఖ వివరించింది. 

మరిన్ని వార్తలు