ఆయనతో సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని చూస్తున్నా: పూజా

5 May, 2021 00:24 IST|Sakshi

ప్లాన్‌ చేయడంవరకే మన చేతుల్లో ఉంటుంది. ప్లాన్‌ చేసిన ప్రకారం జరగడం అనేది మన చేతుల్లో ఉండదు. పూజా హెగ్డే కూడా ఇదే విషయం గురించి చెప్పారు. సల్మాన్‌తో షూటింగ్‌లో పాల్గొనడానికి ప్లాన్‌ చేసుకున్నారామె. ప్లాన్‌ వాయిదా పడింది. మరో సినిమా అనుకున్నారు. ఆ ప్లాన్‌ కూడా ఫెయిల్‌. అంతా కరోనా వల్లే.  ఈ కరోనా ఒక్క పూజా హెగ్డే ప్లాన్స్‌నే కాదు... అందరి ప్లాన్‌లను తారుమారు చేసింది. ఇక ఇటీవల కోవిడ్‌ పాజిటివ్‌తో హోమ్‌ ఐసొలేషన్‌లో ఉంటున్న పూజా హెగ్డే ఏం చెప్పారో తెలుసుకుందాం.

పరిస్థితులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేసుకోవాలి. మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటి వాటిని మన అలవాట్లుగా మార్చుకోవాలి. తాము భద్రంగానే ఉన్నామనే భావన ప్రజల్లో ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే మన పాత రోజులు వచ్చినట్లుగా నేను భావిస్తాను. కరోనాతో ఎలా జీవించాలో నేర్చుకోవాలి. ఇప్పుడున్న కరోనా పరిస్థితులు తగ్గడానికి మరికొంత సమయం పట్టొచ్చు. ప్రభుత్వ  నియమాలను, వైద్యుల సూచనలను పాటించడం, సామాజిక దూరం.. ఇవే కరోనా నియంత్రణ మార్గాలు.

అన్నీ సవ్యంగా జరిగి ఉంటే ఈ ఏడాది ఈద్‌కు సల్మాన్‌ఖాన్‌తో నేను నటించాల్సిన ‘కభీ ఈద్‌...  కభీ దీవాలి’ సినిమా విడుదల కావాల్సింది. కానీ కరోనా మా ఆలోచనలను తారుమారు చేసింది. కోవిడ్‌ వల్ల ఏర్పడిన పరిస్థితుల కారణంగా ఈ సినిమా షూటింగ్‌ ఇంకా ఆరంభం కాలేదు. సల్మాన్‌ఖాన్‌తో కలిసి నటించడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. సెట్స్‌లో ఆయనతో కలిసి నేను మాట్లాడాలనుకుంటున్న విషయాలు చాలా ఉన్నాయి. ఇది ఒక ఫన్‌ ఫిల్మ్‌. సినిమా చూస్తున్నంతసేపూ ప్రేక్షకులు తప్పకుండా నవ్వుతారు. అలాగే సల్మాన్‌ స్టైల్‌ ఆఫ్‌ యాక్షన్‌ కూడా సినిమాలో ఉంటుంది.

ఈ ఏడాది జనవరిలో సౌత్‌లో చాలా సినిమాలు విడుదలయ్యాయి. ప్రేక్షకులు సినిమాలను చూసేందుకు థియేటర్స్‌కు  వచ్చారు. అది చూసి నాకు చాలా సంతోషం అనిపించింది. సౌత్‌లో తమ అభిమాన తారల సినిమాలను ప్రేక్షకులు బాగా ప్రేమిస్తారు. కరోనా ప్రభావం లేకపోయినట్లయితే నా సినిమాలు కొన్ని ఈ ఏడాది విడుదలయ్యేవి. ప్రస్తుత పరిస్థితుల్లో షూటింగ్స్‌ సాధ్యపడటం లేదు. ఇది దురదృష్టకరం. త్వరలోనే పరిస్థితులన్నీ చక్కబడాలి. సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు భయం లేకుండా థియేటర్స్‌కు రావాలి.

కోవిడ్‌ నుంచి బాగానే కోలుకుంటున్నాను. నాకు పాజిటివ్‌ అని నిర్ధారణ అయినప్పుడు అదృష్టవశాత్తు నాలో స్పల్పమైన కోవిడ్‌ లక్షణాలు మాత్రమే ఉన్నాయి. అందుకని కోవిడ్‌ నన్ను పెద్దగా ఇబ్బందిపెట్టడంలేదు. వైద్యులు సూచించిన చికిత్సను మాత్రమే ఫాలో అవుతున్నాను. వాళ్లు చెప్పిన మందులు మాత్రమే వాడుతున్నాను. పౌష్టికాహారంతో పాటుగా తగినంత విశ్రాంతి తీసుకుంటున్నాను. యోగా చేస్తున్నాను. ఏది ఏమైనా ప్రస్తుతం చేతిలో చాలా సినిమాలు ఉన్నా ఇంట్లో కూర్చునే పరిస్థితి రావడం బాధాకరం. కరోనా వల్ల షూటింగ్‌లన్నీ ఆగిపోయాయి.

రణ్‌వీర్‌సింగ్‌ హీరోగా చేస్తున్న ‘సర్కస్‌’ సినిమా షూటింగ్‌లో ఇటీవల పాల్గొన్నాను. నిబంధనల ప్రకారం అందరూ కరోనా టెస్టులు చేయించుకున్నాం. మాస్కులు ధరించాం. భౌతిక దూరం పాటించాం. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. అయినప్పటికీ నాకు పాజిటివ్‌ రావడం దురదృష్టకరం. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు