అక్టోబ‌ర్ 1 నుంచి థియేట‌ర్లు ఓపెన్‌?

16 Sep, 2020 19:51 IST|Sakshi

న్యూఢిల్లీ: అన్‌లాక్ ప్ర‌క్రియ‌లో భాగంగా కేంద్రం.. క‌రోనా వ‌ల్ల మూత‌ప‌డ్డ  ఒక్కో రంగానికి విముక్తి క‌ల్పిస్తూ వ‌స్తోంది. కానీ థియేట‌ర్లు తెర‌వడానికి మాత్రం వెన‌క‌డుగు వేస్తోంది. థియేట‌ర్ల‌ను తెరిపించి త‌మ బతుకులను చీక‌టి నుంచి విముక్తి క‌ల్పించండి అని కోరుతూ వ‌స్తున్నా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవడం లేదు. మ‌రోవైపు దీన్ని మాత్ర‌మే న‌మ్ముకున్న చాలామంది బ‌తుకులు రోడ్డున ప‌డ్డాయి. అటు సినిమాలు షూట్ చేయ‌డం పూర్తైన వాళ్లు మాత్రం వ‌చ్చిన రేటుకు ఓటీటీలో రిలీజ్ చేసుకుంటున్నారు. రేపు పొద్దున కూడా ఇదే అల‌వాటైతే త‌మ ప‌రిస్థితేంట‌ని కొంద‌రు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇంకా ఎన్నాళ్లు ఇలా ఉపాధి లేకుండా ప్ర‌భుత్వ అంగీకారం కోసం ఎదురు చూస్తూ కూర్చోవాల‌ని అస‌హ‌నానికి లోన‌వుతున్నారు. (చ‌ద‌వండి: తాళాలు తెరవాలి.. ఉద్యోగాలు కాపాడాలి)

ఈ క్ర‌మంలో మ‌ల్టీప్లెక్స్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా థియేటర్ల‌‌ను తెరిచేందుకు అనుమ‌తివ్వాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరింది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం నాడు 'అన్‌లాక్‌ సినిమాస్‌ – సేవ్‌ జాబ్స్‌’ అంటూ వినతిపత్రాన్ని అందించింది. దీనిపై ఇప్ప‌టివ‌ర‌కు కేంద్రం స్పందించ‌నేలేదు, కానీ సోష‌ల్ మీడియాలో మాత్రం దేశ‌వ్యాప్తంగా అక్టోబ‌ర్ 1 నుంచి థియేట‌ర్లు తెరుచుకోనున్నాయంటూ వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ మేర‌కు ప్ర‌భుత్వం నిబంధ‌న‌ల‌ను కూడా సిద్ధం చేసింద‌ని పుకార్లు లేపుతున్నారు అయితే ఈ వార్త అవాస్త‌వ‌మ‌ని ప్ర‌భుత్వ రంగ సంస్థ పీఐబీ(ప్రెస్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ బ్యూరో) స్ప‌ష్టం చేసింది. ప్ర‌భుత్వం ఇంత‌వ‌ర‌కు అలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌నేలేద‌ని తేల్చి చెప్పింది. (చ‌ద‌వండి: సుధా మూర్తి కూరగాయలు అమ్మారా?)

వాస్త‌వం: అక్టోబ‌ర్ 1 నుంచి థియేట‌ర్లు తెరుచుకునేందుకు కేంద్రం అనుమతివ్వ‌లేదు. (ఈ వార్త రాసే స‌మ‌యానికి ప్ర‌భుత్వం ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు