Dongata Movie Telugu Review: ఫాహద్‌ ఫాజిల్ 'దొంగాట' రివ్యూ.. ఎలా ఉందంటే ?

8 May, 2022 20:57 IST|Sakshi

టైటిల్‌: దొంగాట
నటీనటులు: ఫాహద్‌ ఫాజిల్, సూరజ్ వెంజరమూడ్, నిమిషా సజయన్‌, అలెన్సియర్‌ లే లోపెజ్‌ తదితరులు
నిర్మాతలు: సందీప్‌ సేనన్‌, అనీష్‌ ఎం థామస్‌
కథ: సజీవ్ పజూర్‌
దర్శకత్వం: దిలీష్‌ పోతన్‌
సినిమాటోగ్రఫీ: రాజీవ్‌ రవి
సంగీతం: బిజిబాల్‌
విడుదల తేది: మే 06, 2022 (ఆహా)

చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుల్లో మలయాళీ నటుడు ఫాహద్ ఫాజిల్ ఒకరు. కరోనా సమయంలో ఆడియెన్స్‌ ఓటీటీలకు అలవాటు కావడంతో ఒక్కసారిగా ఫాహద్ పేరు దేశవ్యాప్తంగా వినిపించింది. విభిన్నమైన చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు. పాత్ర బలంగా ఉంటే ఎలాంటి సినిమా అయినా చేసేందుకు వెనుకాడరు. 'పుష్ప: ది రైజ్‌' సినిమాలో భన్వర్ సింగ్ షేకవాత్‌ అనే పోలీసు పాత్రలో ఎంతలా ఆకట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డిఫరెంట్‌ రోల్స్‌ చేస్తూ ఫ్యాన్స్‌, ఆడియెన్స్‌ ఎంటర్‌టైన్‌ చేస్తున్న ఫాహద్ ఫాజిల్‌ నటించిన మలయాళ చిత్రం 'తొండిముత్యాలుం దృక్సాక్షియుం'. 2017లో విడుదల మంచి విజయం సాధించిన ఈ చిత్రాన్ని తాజాగా తెలుగులో 'దొంగాట' పేరుతో 'ఆహా' ఓటీటీలో విడుదల చేశారు. ఫహద్ ఫాజిల్, సూరజ్‌ వెంజరమూడ్‌, నిమిషా సజయన్‌ కీలకపాత్రల్లో నటించారు. మూడు జాతీయ పురస్కారాలను అందుకున్న ఈ 'దొంగాట' ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 

కథ:
ఒక మిస్‌అండర్‌స్టాండింగ్‌ కారణంగా దగ్గరైన ప్రసాద్‌ (సూరజ్ వెంజరమూడ్‌), శ్రీజ (నిమిషా సజయన్‌) ప్రేమించి గుడిలో పెళ్లి చేసుకుంటారు. తర్వాత వేరే కాపురం పెడతారు. వ్యవసాయం పండించడానికని నీళ్ల కోసం బోర్‌ వేసేందుకు శ్రీజ దగ్గర ఉన్న తాళి తాకట్టు పెట్టేందుకు బస్సులో వెళ్తారు. బస్సులో ప్రయాణించేటప్పుడు శ్రీజ మెడలోని బంగారు గొలుసును (తాళి) ప్రసాద్‌ (ఫాహద్‌ ఫాజిల్) అనే దొంగ కొట్టేస్తాడు. అది గమనించిన శ్రీజ.. ప్రసాద్‌ను పట్టుకుని నిలదీస్తే తాను దొంగలించలేదని బుకాయిస్తాడు. దీంతో బస్సులోని వారి సహాయంతో ప్రసాద్‌ను (ఫాహద్‌ ఫాజిల్‌) పోలీస్‌లకు అప్పగిస్తారు. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన ప్రసాద్‌-శ్రీజ దంపతులు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. గొలుసు కొట్టేసిన ప్రసాద్ అనే దొంగ నేరం ఒప్పుకున్నాడా ? ఆ తాళి శ్రీజ-ప్రసాద్‌లకు చేరిందా ? ఇలాంటి కేసుల్లో పోలీసులు ఎలా వ్యవహరిస్తారు? అనే అంశాలతో తెరకెక్కిందే ఈ 'దొంగాట'. 

విశ్లేషణ:
ఇద్దరు దంపతులు, ఒక దొంగ, చిన్న కేసు, పోలీసులు అనే చిన్న కథను చాలా చక్కగా ప్రజెంట్‌ చేశాడు డైరెక్టర్ దిలీష్ పోతన్‌. ఒక దొంగతనాన్ని పోలీసులు ఎలా చేధిస్తారో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఫాహద్ ఫాజిల్‌ బంగారు తాళిని దొంగతనం చేయడంతోనే అసలు కథ ప్రారంభవుతుంది. తర్వాత వచ్చే సీన్లు, దొంగలు, సాక్షులు, సామాన్యులతో పోలీసులు వ్యవహరించే తీరు బాగా అలరిస్తుంది. పరిస్థితులకు అనుగుణంగా తమకు ఎలాంటి సమస్య రాకుండా పోలీసుల ప్రవర్తనా శైలీ ఆలోచింపజేసేలా ఉంటుంది. అమాయకంగా ఉంటూ చివరివరకు నేరాన్ని ఒప్పుకోని దొంగల తీరు, తమకు నష్టం కలిగినా ఇంకొకరికి అన్యాయం జరగకూడదనే భావించే మధ్యతరగతి వ్యక్తుల ఆలోచనలను చాలా బాగా చూపించారు. అక్కడక్కడా సినిమా కొంచెం సాగదీసినట్లుగా అనిపిస్తుంది. 

ఎవరెలా చేశారంటే ?
దొంగలు పారిపోతే పోలీసులు వెతికే తీరు, పై అధికారులకు సమాధానం ఇచ్చేటప్పుడు వారికి కలిగే భయం, దొంగతనం చేసిన కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉండే దొంగల ప్రవర్తన వంటి అంశాలను నటీనటులు వారి నటనతో చాలా చక్కగా చూపించారు. దొంగ పాత్రలో ఫాహద్ ఫాజిల్‌ అద్భుతంగా నటించాడు. 'చివరివరకు బయటపడకూడదు అనేదే తన స్టైల్‌' అని చెబుతూ అమాయకపు చూపులు, పోలీసులతో మాట్లాడే వైఖరీ, ఎవరు లేనప్పుడు అసలైన దొంగలా ప్రవర్తించే ఫాహద్‌ నటన ఆకట్టుకునేలా ఉంది. మధ్యతరగతి వ్యక్తుల్లా సూరజ్‌, నిమిషా కూడా చాలా చక్కగా ఒదిగిపోయి నటించారు. మిగతా పోలీసు పాత్రలు సైతం వారి నటనతో మెప్పించారు. 

పోలీసు వ్యవస్థలోని లొసుగులు, మధ్యతరగతి వ్యక్తుల ఆలోచనా ధోరణి, సమస్యలు ఎదురైనప్పుడు వారు రాజీపడే విధానాన్ని చూపించి దర్శకుడు దిలీప్‌ పోతన్‌ మంచి మార్కులు కొట్టేశారనే చెప్పవచ్చు. అయితే ఫాహద్ ఫాజిల్‌ దొంగగా మారడానికి కారణాలు, తర్వాత మంచివాడిలా మారేందుకు ప్రేరేపించిన కారణాలు అంతగా చూపించలేకపోయాడు. సజీవ్‌ పజూర్‌ అందించిన కథ, శ్యామ్ పుష్కరణ్‌ డైలాగ్‌లు ఓకే అనిపించాయి. రాజీవ్‌ రవి సినిమాటోగ్రఫీ, బిజిబాల్‌ సంగీతం పర్వాలేదనిపించింది. ఈ సినిమాలో నటనకు గానూ ఫాహద్ ఫాజిల్‌కు ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డు వచ్చింది. బెస్ట్ స్క్రీన్‌ప్లే రైటర్‌గా సజీవ్‌ పజూర్‌ కూడాల జాతీయ అవార్డును అందుకున్నారు. ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డును సైతం అందుకుంది ఈ మూవీ. ఫైనల్‌గా ఏంటంటే కాస్త నెమ్మదిగా సాగిన ఈ 'దొంగాట' ఓసారి చూడాల్సిందే. 

మరిన్ని వార్తలు