Malik Movie Review: ఫహద్‌ ఫాజిల్‌ ‘మాలిక్‌’ రివ్యూ

14 Aug, 2022 13:07 IST|Sakshi

వరుసగా ప్రయోగాత్మక చిత్రాలు, విలక్షణ నటనతో సౌత్‌లో క్రేజీ స్టార్‌గా మారిపోయాడు మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌. ‘పుష్ప’, ‘విక్రమ్‌’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.  గతేడాది ఆయన నటించిన మలయాళ చిత్రం ‘మాలిక్‌’ తాజాగా ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతోంది.  ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 

టైటిల్‌: మాలిక్‌
కాస్టింగ్‌: ఫహద్‌ ఫాజిల్‌, నిమిషా సజయన్‌, వినయ్‌ ఫోర్రట్‌, జోజూ జార్జ్‌, దిలీష్‌ పోతన్‌, ఇంద్రాన్స్‌, పార్వతి కృష్ణ, సనల్‌ అమన్‌ తదితరులు
నిర్మాణ సంస్థ: యాంట్స్ టూ ఎలిఫంట్స్స్ సినిమాస్ కో

నిర్మాతలు: అనీల్ కె రెడ్డి, కిషోర్ రెడ్డి
సమర్పణ: మొజ్విత్,నినిన్

డైరెక్టర్‌: మహేష్‌ నారాయణన్‌
సంగీతం : సుశిన్ శ్యామ్

సినిమాటోగ్రఫీ: సను వర్గీస్
ఓటీటీ: ఆహా(ఆగస్ట్‌12, 2022)


కథ
కేరళ తిరువనంతపురం జిల్లా తీర గ్రామం రామడపల్లి. బంధువుల కోలాహలం నడుమ హజ్‌ యాత్రకు బయలుదేరుతాడు సులైమాన్‌ అలీ అహమ్మద్‌ అలియాస్‌ మాలిక్‌ అలియాస్‌ అలీ ఇక్కా(ఫహద్‌ ఫాజిల్‌). అయితే ఎయిర్‌పోర్ట్‌లోనే ఆ పెద్దాయనను పోలీసులు అరెస్ట్‌ చేస్తారు. గతంలో జరిగిన ఓ హత్య కేసుతో పాటు మరికొన్ని నేరాల కింద కేసులు నమోదు చేసి అతన్ని జైళ్లో పెడతారు. అనూహ్యంగా మాలిక్‌ తల్లి జలజ అప్రూవర్‌గా మారిపోయి వ్యతిరేకంగా సాక్క్ష్యం చెప్పేందుకు ముందుకొస్తుంది. మరోవైపు భార్య రోస్లిన్‌ మాత్రం ఆయన్ని ఎలాగైనా బయటకు తెప్పించే ప్రయత్నం చేస్తుంటుంది. ఈ లోపు మాలిక్‌ గతం తెర మీదకు కదలాడుతుంది. దశాబ్దాలపాటు పోలీసులు.. రాజకీయ నేతల కుట్రల నుంచి తన నేలను, ప్రజలను కాపాడుకుంటూ ఉద్యమనేతగా ఎదిగిన మాలిక్‌, ‘బడా డాన్‌గా, మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌’గా ఎందుకు జైలుపాలు కావాల్సి వస్తుంది? సొంతవాళ్లే అతన్ని వెన్నుపోటు పొడిచేంత నేరం మాలిక్‌ ఏం చేస్తాడు? రాజకీయ కుట్రల నడుమ మాలిక్‌ కథ ఎలా ముగుస్తుందనేది చూసి తెలుసుకోవాల్సిందే.

ఎలా ఉందంటే.. 
‘టేకాఫ్‌, సీయూ సూన్‌’ తర్వాత ఫహద్‌-మహేష్‌ నారాయణన్‌ కాంబోలో వచ్చిన మూవీ ఇది. ‘గాడ్‌ ఫాదర్‌, నాయకన్‌(నాయకుడు), అభిమన్యు(1991 మలయాళం), వన్స్‌ అపాన్‌ ఎ టైం ఇన్‌ అమెరికా’.. ఇలా టైంలైన్‌ కథల తరహాలో సాగే డాన్‌ కమ్‌ పొలిటికల్‌ థ్రిల్లర్‌ కథల తరహాలోనే ‘మాలిక్‌’ ఉంటుంది. కానీ, ‘రెలిజియన్‌ టచ్‌’ ఇచ్చి ఆడియొన్స్‌ను మెప్పించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్‌ మహేష్‌. భూముల ఆక్రమణలు-దాడులు, బతుకు దెరువు కోసం అక్రమ వ్యాపారాలు.. ఇలా కొన్ని వాస్తవ ఘటనలను తెరపై చూపించే ప్రయత్నం చేశాడు.

నలభై మూడు నిమిషాల తర్వాత మొదలయ్యే ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ నుంచి ప్రీ క్లైమాక్స్‌ వరకు కథను జెట్‌ స్పీడ్‌తో పరుగులు పెట్టించాడు. పవర్‌ఫుల్‌ పాత్రలు- వాటి మధ్య పేలే డైలాగులు, సెంటిమెంట్‌, పొలిటికల్‌ సీక్వెన్స్‌లు ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. అయితే మధ్య కథలో కొంచెం సాగదీత, అక్కడక్కడా కొన్ని సీన్ల కట్టింగ్‌తో కొంత గందరగోళంగా అనిపించినప్పటికీ.. పవర్‌ఫుల్‌ స్టోరీ ముందు ఆ మైనస్‌లు తేలిపోయాయి.

  

నటనపరంగా.. 
ఫహద్‌ ఫాజిల్‌ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏజ్‌ వైజ్‌ క్యారెక్టర్‌లలో వేరియేషన్‌తో రఫ్ఫాడించేశాడు. ఆయా పాత్రల కోసం బరువు తగ్గడం, పెరగడం చూస్తే.. ఫహద్‌ ఆ క్యారెక్టర్‌ కోసం పడ్డ కష్టం ఏంటో కనిపిస్తుంది. అప్పటిదాకా అగ్రెసివ్‌ క్యారెక్టర్‌గా కనిపించి.. కొడుకు ప్రాణం పోయాక శవాన్ని పట్టుకుని విలపించే సీన్‌ హైలైట్‌గా అనిపిస్తుంది. అటుపై జైళ్లో ఉన్నప్పుడు మెచ్యూర్డ్‌ యాక్టింగ్‌తో కట్టిపడేస్తాడు. రోజ్లిన్‌గా నిమిషా.. ఫహద్‌తో పోటీ నటన కనబర్చింది. ఒకరకంగా సినిమాకు మాలిక్‌-రోజ్లిన్‌లు మెయిన్‌ పిల్లర్లుగా నిలిచారు.

ఇక  మాలిక్‌ పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచే క్యారెక్టర్‌లో వినయ్‌ నటన మెప్పిస్తుంది. కెరీర్‌లో ఎక్కువగా కామెడీ వేషాలే వేసిన వినయ్‌.. డేవిడ్‌ పాత్రలో ఛాలెంజిగ్‌ రోల్‌తో అలరించాడనే చెప్పొచ్చు. వీళ్ల తర్వాత మేనల్లుడు ఫ్రెడ్డీ క్యారెక్టర్‌లో సనల్‌ అమన్‌, డాక్టర్‌ షెర్మిన్‌గా పార్వతీ కృష్ణన్‌లు మెప్పించారు. కలెక్టర్‌గా జోజూ జార్జ్‌ హుందా పాత్రలో అలరించాడు. మాలిక్‌ తల్లిగా జమీల, మాలిక్‌ గురువుగా సలీం కుమార్‌, పార్టీ నేతగా దిలీష్‌పోతన్‌లు తమ నటనతో ఆకట్టుకున్నారు.

టెక్నికల్‌గా.. 
మాలిక్‌లో దర్శకుడి స్టోరీ టెల్లింగ్‌తో పాటు టెక్నికల్‌ బ్రిలియన్స్‌ కూడా కనిపిస్తుంది. 60వ దశకం నుంచి 2000 వరకు టైం లైన్‌గా  మాలిక్‌ కథ సాగుతుంది. గతంలో వచ్చిన గ్యాంగ్‌ స్టర్‌ డ్రామాల స్ఫూర్తితో ఈ కథను తీసినప్పటికీ.. ప్రత్యేకించి కొన్ని పాయింట్లను తెరపై చూపించడం మాత్రం ఆకట్టుకుంటుంది. సాను వర్గీస్‌ సినిమాటోగ్రఫీ సినిమాకు తగ్గ మూడ్‌ను క్రియేట్‌ చేయడంలో సక్సెస్‌ అయ్యిది. సుషిన్‌ శ్యామ్‌ సంగీతం ‘తీరమే’లాంటి సాంగ్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తోనూ మెప్పించాడు. మేకప్‌..కాస్టూమ్స్‌ కథకు తగ్గట్లు బాగున్నాయి. కథ, దర్శకత్వం బాధ్యతతో పాటు తన కథను తానే ఎడిటింగ్‌ చేసుకుని ‘మాలిక్‌’ను మరింత పక్కాగా చూపించి ఆకట్టుకున్నాడు దర్శకుడు మహేష్‌ నారాయణన్‌. వెరసి.. మాలిక్‌ను తప్పకచూడాల్సిన ఓ పవర్‌ఫుల్‌ పొలిటికల్‌ డ్రామాగా తీర్చిదిద్దాడు.

మరిన్ని వార్తలు