అదృష్టవశాత్తూ ఆ ప్రమాదం నుంచి బయటపడ్డ: ఫాహద్‌

18 Jun, 2021 08:22 IST|Sakshi

సినిమా షూటింగ్స్‌లో.. ప్రత్యేకించి పోరాట సన్నివేశాలు చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు నటీనటులకు గాయాలు అవుతుంటాయి. తాజాగా మలయాళ హీరో ఫాహద్‌ ఫాజిల్‌ కూడా షూటింగ్‌లో జరిగిన పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ‘‘అదృష్టవశాత్తూ బతికిపోయా’’ అని పేర్కొన్నారాయన. ‘మలయాన్‌ కుంజు’ అనే మలయాళ చిత్రంలో నటిస్తున్నారు ఫాహద్‌ ఫాజిల్‌. ఈ సినిమా షూటింగ్‌లో ఉండగా ప్రమాదవశాత్తు పెద్ద ఎత్తు నుంచి కిందకి పడిపోయారు. ఆ సమయంలో చేతులు ముందుకు చాచడంతో తలకి దెబ్బ తగలకుండా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు.

ఈ విషయాన్ని తెలియజేస్తూ– ‘‘సాధారణంగా పై నుంచి కిందకి పడేటప్పుడు చేతులు ముందుకు చాచడం అంత సులభం కాదు.. అదృష్టవశాత్తూ ఆ సమయంలో నా మెదడు చురుగ్గా పనిచేయడంతో బతికిపోయాను.. అయితే ఆ ప్రమాదంలో నా ముక్కుకి గాయం కావడం వల్ల మూడు కుట్లు పడ్డాయి.. ఆ గాయం నొప్పి తగ్గడానికి కొంత టైమ్‌ పడుతుంది’’ అన్నారు ఫాహద్‌ ఫాజిల్‌. కాగా అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పుష్ప’లో విలన్‌గా నటిస్తున్నారు ఫాహద్‌ ఫాజిల్‌. 

చదవండి: లాక్‌డౌన్‌లో ‘పుష్ప’ కోసం నటుడు ఫహద్‌ ఫాసిల్‌ కసరత్తు!

మరిన్ని వార్తలు