లాక్‌డౌన్‌లో ‘పుష్ప’ కోసం నటుడు ఫహద్‌ ఫాసిల్‌ కసరత్తు!

4 Jun, 2021 19:42 IST|Sakshi

మలయాళం స్టార్‌ హీరో ఫహద్‌ ఫాసిల్‌ ప్రస్తుతం ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’లో మెయిన్‌ విలన్‌గా నటిస్తున్నాడు. అయితే ఈ మూవీలో ఆయనకు డబ్బింగ్‌ చెప్పేందుకు ఒకప్పటి టాలీవుడ్‌ లవర్‌ బాయ్‌, హీరో తరుణ్‌తో ఇటీవల పుష్ప టీం చర్చలు జరిపినట్లు ఫిలీంనగర్‌లో ఓ వార్త చక్కర్లు కొట్టింది. తాజా బజ్‌ ప్రకారం ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేనట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ లాక్‌డౌన్‌లో ఫహాద్‌ తెలుగు నేర్చుకునే పనిలో పడ్డాడట. తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పాలని గట్టిగా నిర్ణయించుకుని రోజు తెలుగు భాషపై కసరత్తు చేస్తున్నాడని సమాచారం.

అయితే ఇందులో ఫహాద్‌ అవినీతి పోలీసు అధికారిగా, చిత్తూరు యాసలో మాట్లాడాల్సి ఉంటుంది. అందుకే ఈ యాసపై పట్టుసాధించేందుకు రోజు ప్రాక్టీస్‌ చేస్తూ తెగ కష్టపడుతున్నాడట. అంతేకాదు దీనికి ప్రత్యేకంగా కోర్స్‌ కూడా తీసుకుంటున్నాడని వినికిడి. కాగా రూరల్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపొందుతున్న పుష్పను మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. ఇందులో అల్లు అర్జున్‌ సరసన రష్మిక మందన్నా నటిస్తుండగా.. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, సునీల్, ధనుంజయ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

మరిన్ని వార్తలు