ఏలూరులో నకిలీ సినిమా టిక్కెట్లు! కళ్లు కాయలు కాచేలా వేచి చూసి మూవీకెళ్తే..

3 May, 2022 21:14 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఏలూరు టౌన్‌ (పశ్చిమ గోదావరి): ఏదైనా పెద్ద హీరో సినిమా వచ్చిందంటే చాలు.. అభిమానుల ఉత్సాహం, సినిమా చూడాలనే ఆతృత అంతా ఇంతా కాదు. దీనిని ఆసరాగా చేసుకొని వారికి నకిలీ టిక్కెట్లు విక్రయించి మోసం చేస్తూ డబ్బు దోచేస్తున్నారు ఓ థియేటర్‌ సిబ్బంది. తీరా సినిమా చూద్దామని థియేటర్‌కి వెళితే.. నకిలీదంటూ బయటికి గెంటేస్తున్నారు. దీంతో డబ్బూ పోయి, సినిమా చూడలేకపోయామనే ఆవేదనతో పాటు అవమానానికి గురవుతున్నారు అభిమానులు.

జిల్లా కేంద్రమైన ఏలూరులో ఈ ఘటనలు జరుగుతుండటం గమనార్హం. ఇటీవల రిలీజ్‌ అయిన ఓ పెద్ద హీరో సినిమాకు వెంకటకుమార్‌ అనే ఒక ప్రేక్షకుడు వెళ్లాడు. ముందురోజే థియేటర్‌ వద్ద రూ.300 పెట్టి టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు. కళ్లు కాయలు కాచేలా వేచి చూసి ఉదయం ఐదు గంటలకు బెనిఫిట్‌ షోకు వెళ్లాడు. టిక్కెట్‌పై ఉన్న తన సీట్‌ నంబర్‌ చూసుకుని కూర్చున్నాడు. ఈలోగా మరో వ్యక్తి వచ్చి తన సీట్‌ నంబర్‌ కూడా అదేనంటూ టిక్కెట్‌ చూపించాడు.

ఈలోగా థియేటర్‌ సిబ్బంది వచ్చి అతన్ని కూర్చోబెట్టి.. రాత్రంతా వేచిచూసి అధిక ధరకు టిక్కెట్‌ కొన్న వెంకట కుమార్‌ను బయటకు నెట్టేశారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. నీది నకిలీ టిక్కెట్‌.. మాకు సంబంధం లేదని చెప్పారు. తీరా అభిమాని తనకు ఈ టిక్కెట్‌ ఎలా వచ్చిందో చెప్పాలంటూ పట్టుబట్టడంతో థియేటర్‌ యాజమాన్యం, సిబ్బంది కంగుతిన్నారు. అతను వెళ్లి ఏలూరు వన్‌టౌన్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేశారు.  
చదవండి👉 తిరుపతి, అరకుకు స్పెషల్‌ టూర్స్‌

భారీగా దోపిడీ 
సినిమా థియేటర్‌లోని సిబ్బంది చాకచక్యంగా టిక్కెట్లను నకిలీవి తయారు చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఫ్యామిలీతో కలిసి వెళితే నకిలీ టిక్కెట్‌ కొన్నారు మాకు సంబంధం లేదంటూ బయటకు పంపేస్తున్నారు. వారంతా అవమానంగా ఫీలవుతూ ఎవరికీ చెప్పుకోలేక ఆవేదనకు గురవుతున్నారు. రోజూ ఒక్కో షోకు ఈ విధంగా పది టిక్కెట్ల వరకు విక్రయిస్తున్నట్టు సమాచారం. ఒక్కో టిక్కెట్‌ ధర రూ.300 అనుకుంటే షోకు రూ.3 వేలు సంపాదిస్తున్నారు. నాలుగు షోలకు రూ.12 వేల వరకు జేబుల్లో వేసుకుంటున్నారు. వీరిపై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని సినిమా అభిమానులు కోరుతున్నారు.  
చదవండి👉🏻 నా కారునే ఆపుతావా అంటూ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై దాడి    

మరిన్ని వార్తలు