కొడుకు ఫొటోతో థియేటర్‌కు వచ్చిన తండ్రి, కన్నీరు ఆగట్లేదు..

6 Apr, 2021 14:46 IST|Sakshi

శాండల్‌ వుడ్‌ స్టార్‌ హీరో పునీత్‌ రాజ్‌కుమార్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన తాజా సినిమా 'యువరత్న' విడుదల కోసం కర్ణాటక సీఎం యాడ్యురప్ప జీవో సైతం మార్చిన సంగతి తెలిసిందే. పునీత్‌ తాజాగా నటించిన ‘యువరత్న’ సినిమా విడుదల కరోనా కారణంగా కొంత వివాదంలో పడింది. మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా ‘యువరత్న’ మూవీ విడుదల తేదీని వాయిదా వేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఈ మూవీని విడుదలకు అనుమతించాల్సిందిగా చిత్ర యూనిట్‌తో పాటు అభిమానులు, శాండల్ వుడ్‌ ప్రేక్షకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

దీనిపై నిరసలు కూడా చేశారు. ఇక ఎన్నో వివాదాల మధ్య ఎట్టకేలకు ఈ మూవీ ఏప్రీల్‌ 1వ తేదీన థీయేటర్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పునీత్‌ ‘యువరత్న’ మూవీ చూసేందుకు ఓ వ్యక్తి తన కొడుకు ఫొటోతో థియేటర్‌కు వచ్చాడు. అది చూసి ఎంతో మంది ఆశ్చర్యపోయారు. చివరకు దాని వెనక ఉన్న కారణం తెలిసి అందరూ భావోద్వేగానికి లోనవుతున్నారు. కాగా కర్ణాటకలోని మైసూర్‌ కువెంపు నగరంకు చెందిన మురళీధర్‌ అనే వ్యక్తి కుమారుడు హరికృష్ణన్‌ నాలుగు నెలల కిందట మిత్రులతో కలిసి వరుణ కాలువలో ఈతకు వెళ్లి నీట మునిగి ప్రాణాలు విడిచాడు.

యువరత్న సినిమా విడుదలైన రోజే మొదటి ఆట చూడాలని తండ్రిలో చెప్పేవాడు. ఈ నేపథ్యంలో యువరత్న ఆడుతున్న సినిమా థియేటర్‌కు బాలుని తల్లిదండ్రులు, అన్నయ్య వచ్చారు. తమతో పాటు బాలుని ఫోటోను తీసుకొచ్చి నాలుగు టికెట్లు తీసుకుని మూవీని చూశారు. దీనిపై అతడు మాట్లాడుతూ.. కొడుకు హరికృష్ణన్‌ హీరో పునీత్‌ రాజ్‌కుమార్‌కు వీరాభిమాని అని, ఆయన సినిమాలన్నీ విడుదలైన మొదటి రోజే చూసేవాడని చెప్పాడు. కానీ దురదృష్టవశాత్తు యువరత్న మూవీ విడుదలకు ముందే తన కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ కన్నీరుమున్నీరయ్యాడు. 

మరిన్ని వార్తలు