చెల్లం సర్‌, నాకు పెళ్లెప్పుడు అవుతుంది?

8 Jun, 2021 21:11 IST|Sakshi

కొన్ని పాత్రలు మెరుపుతీగలా స్క్రీన్‌ మీద అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటాయి. కనిపించేది కొద్దిసేపు మాత్రమే అయినా జనాలకు తెగ నచ్చేస్తాయి. సినిమా చూడటం పూర్తయ్యాక కూడా వాళ్ల కోసమే ఆలోచింపజేసేలా చేస్తాయి. అలా కొన్ని సినిమాల్లో కొన్ని పాత్రలు కథను కీలక మలుపు తిప్పడంలో దోహదపడతాయి. అలాంటి పాత్రే చెల్లమ్‌ సర్‌. 'ఫ్యామిలీ మ్యాన్‌ 2' వెబ్‌ సిరీస్‌ చూసిన వారికి ఈ పాత్ర బాగా తెలిసి ఉంటుంది. చెల్లమ్‌ సర్‌ వల్లే అప్పటిదాకా  ఒక రకంగా సాగిన కథ మరో రకంగా మలుపు తిరుగుతుంది. ఇంతకీ చెల్లమ్‌ పాత్రలో జీవించేసిన తమిళ నటుడి పేరు ఉదయ్‌ మహేశ్‌.

ఇంతకీ ఆయన కథను ఏం మలుపు తిప్పాడా? అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం.. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)లో పని చేసి పదవీ విరమణ పొందిన వ్యక్తి చెల్లమ్. ఇతడు ఒకప్పుడు ఏజెంట్‌ కూడా! తమిళ రెబల్స్‌ నాయకుడు భాస్కరన్‌తో సన్నిహిత సంబంధాలున్న ఈ వ్యక్తి శ్రీలంక సివిల్‌వార్‌ సమయంలో విశేష సేవలందించాడు.  రా చీఫ్‌ శర్మకు మెంటార్‌ కూడా! చెన్నైలో తమిళ రెబల్స్‌ నాయకుడి తమ్ముడు సుబ్బును పట్టుకునేందుకు పోలీసులు, టాస్క్‌(థ్రెట్‌ అనాలసిస్‌ అండ్‌ సర్వైవలెన్స్‌) రంగంలోకి దిగుతుంది. ఓ హోటల్‌లో దాక్కున్న అతను తప్పించుకుని మరో గదిలో ఉన్న వారిని బందీలుగా చేసుకుంటాడు. అతడి బారి నుంచి వాళ్లందరినీ రక్షించేందుకు శ్రీకాంత్‌ తివారీ(మనోజ్‌ బాజ్‌పాయ్‌) చెల్లమ్‌ సాయం తీసుకుంటాడు.

చెల్లమ్‌తో మాట్లాడి, భాస్కరన్‌తో ఫోన్‌ చేయిస్తాడు. దీంతో పోలీసులు సుబ్బును సులభంగా చేజిక్కించుకుంటారు. అంతేకాకుండా, తమిళ రెబల్స్‌ చేస్తున్న కుట్రను తెలుసుకునేందుకు రంగంలోకి దిగిన శ్రీకాంత్‌ టీమ్‌కు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సాయం చేసేందుకు చెల్లమ్‌ రెడీగా ఉంటాడు. సుమారు 7 గంటలపైనే నిడివి ఉన్న ఈ సిరీస్‌లో చెల్లమ్‌ పాత్ర సరాసరిగా కనిపించేది కేవలం 15 నిమిషాలు మాత్రమే. ఉన్నది కొద్ది నిమిషాలే అయినా కథను కీలక మలుపు తిప్పేది కూడా ఈ పాత్రే కావడంతో సిరీస్‌ను చూసినవారందరూ చెల్లమ్‌ సర్‌ పాత్రను కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. అందుకే ట్విటర్‌లోనూ చెల్లమ్‌ సర్‌ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌గా మారింది. చెల్లమ్‌ సర్‌, నాకు పెళ్లెప్పుడు అవుతుంది? గూగుల్‌కు వికీపీడియా ఎలాగో మనకు చెల్లం సర్‌ అలాగా! అంటూ మీమ్స్‌ తెగ సందడి చేస్తున్నాయి.

చదవండి: బిగ్‌బాస్‌ కలిపిన ప్రేమ.. అషూతో లవ్‌లో రాహుల్‌

The Family Man 2: నటీనటుల పారితోషికం వివరాలు లీక్‌!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు