ఆ లోపు పాన్‌ వరల్డ్‌ హీరోయిన్‌ కావాలి: ఫరియా అబ్దుల్లా

29 Oct, 2022 06:25 IST|Sakshi

‘‘జాతిరత్నాలు’ లో నేను చేసిన చిట్టి పాత్రని అందరూ అభిమానించారు. ఈ విషయంలో ఆనందంతో పాటు బాధ్యత కూడా పెరిగింది. ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’ సినిమాలో చిట్టి కాదు.. నేను చేసిన వసుధ పాత్ర మాత్రమే కనిపిస్తుంది’’ అని ఫరియా అబ్దుల్లా అన్నారు. సంతోష్‌ శోభన్‌ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’. వెంకట్‌ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా నవంబర్‌ 4న విడుదలకానుంది.

ఈ సందర్భంగా చిత్ర హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ– ‘‘నాకు ప్రయాణం అంటే చాలా ఇష్టం. ఈ చిత్ర కథ ప్రయాణం నేపథ్యంలో ఉంటుంది. నేను ట్రావెల్‌ వ్లాగర్‌గా కనిపిస్తాను. నా నిజ జీవితంలో మొదటి విదేశీ ప్రయాణం ఈ సినిమా వల్లే జరిగింది. థాయిలాండ్‌లో ఒక పాట షూటింగ్‌ చేయడం మరచిపోలేని జ్ఞాపకం. ఈ సినిమా షూటింగ్‌ కోసం 20రోజులు అడవిలోనే ఉన్నాం. మొబైల్‌ సిగ్నల్‌ కూడా లేదు. ఈ మూవీలో యాక్షన్, చేజింగ్‌ సీన్లు కూడా ఉన్నాయి. మొత్తంగా ఈ మూవీ ‘ఖత్రోన్‌ కే ఖిలాడీ’ లాంటి మంచి అనుభవం ఇచ్చింది (నవ్వుతూ).

‘జాతిరత్నాలు’ సినిమాలాగానే ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. నేను హీరోయిన్‌గా నటించిన ‘జాతిరత్నాలు, లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’ చిత్రాల ట్రైలర్స్‌ని ప్రభాస్‌గారు విడుదల చేయడం అదృష్టంగా భావిస్తున్నా. సంతోష్‌ శోభన్‌ చాలా హార్డ్‌ వర్క్‌ చేస్తాడు. మేర్లపాక గాంధీగారితో పని చేయడం డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌. మరో ఐదేళ్లలో పాన్‌ వరల్డ్‌ స్థాయిలో నాకు గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. నాకు దర్శకత్వంపై ఆసక్తి ఉంది.. అందుకు మరో పదేళ్లు పడుతుంది. ప్రస్తుతం రవితేజగారితో ‘రావణాసుర’, ఓ తమిళ్‌ మూవీ, ఓ హిందీ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నా’’ అన్నారు.  

మరిన్ని వార్తలు