ఫాదర్స్‌ డే స్పెషల్‌: ఈ సినిమాలు చూశారా?

20 Jun, 2021 10:08 IST|Sakshi

బాధ్యతకు మారు పేరు నాన్న. మనం వేసే తప్పటడుగులను హెచ్చరిస్తూ వాటిని సరిదిద్దుతూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశించే వ్యక్తి నాన్న. మనల్ని 9 నెలలు కడుపులో మోసేది తల్లయితే, ఈ భూమి మీదకు వచ్చిన మరుక్షణం నుంచి జీవితాంతం గుండెల మీద పెట్టుకుని చూసేది నాన్న. వేలు పట్టి నడిపించేది, భుజంపై ఎక్కించుకుని ప్రపంచాన్ని మనకు చూపిస్తూ మన కళ్లతో ప్రపంచాన్ని చూసి మురిసిపోయే వ్యక్తి నాన్న. అందుకే ప్రతి ఒక్కరికి ఫస్ట్‌ హీరో, రీయల్‌ హీరో ఆయనే. మన జీవితంలో తండ్రి కీలక పాత్ర పోషిస్తాడు. అయనతో​ ఉండే అనుబంధం, ఆయన పంచే ప్రేమ చాలా గొప్పది, దానిని మాటల్లో చెప్పలేం. కానీ తెరపై మాత్రం ఈ బంధాలను అద్భుతంగా చూపించిన సినిమాలున్నాయి. తండ్రి-కొడుకుల ఎమోషనల్‌ బాండింగ్‌తో మనల్ని కట్టిపడేసిన టాప్‌ చిత్రాలేంటో చూసేద్దాం రండి.. 

బొమ్మరిల్లు
ఈ సినిమాలో తండ్రి ప్రేమ, కేరింగ్‌ తట్టుకోలేక హీరో సతమతమవుతాడు. కానీ ఆయన మాత్రం కొడుకు, కూతుళ్లకు ఏం చేసినా, ఏం ఇచ్చినా ది బెస్ట్‌ ఇవ్వాలని చూస్తాడు. ఎక్కడ కూడా వారికి ఇబ్బంది కలగకుండా ముందే వారికి అన్నీ అమర్చి పెడతాడు. కొడుక్కి ఎన్ని చేసినా ఇంకా ఏదో చేయాలని పరితపించే తండ్రిగా ప్రకాశ్‌ రాజ్‌, అతడి ప్రేమ, కేరింగ్‌తో తన సెల్ఫ్‌ ఐడెంటిటీని పొగొట్టుకుంటున్నానని బాధపడే కొడుకుగా హీరో సిద్దార్థ్‌ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నారు. అయితే తండ్రి ఏం చేసినా మన సౌకర్యం, సంతోషం కోసమేనని చెప్పడానికి బొమ్మరిల్లు మూవీ ఉదాహరణ.

సన్నాఫ్‌ సత్యమూర్తి
తండ్రి చనిపోయినా కూడా ఆయన పాటించిన విలువలను బతికించాలని ఉన్న ఆస్తిని వదులుకుంటాడు కొడుకు. అంతేగాక ఆయనను నమ్మిన వారు నష్టపోకూడదని ఎలాంటి రిస్క్‌ అయినా చేస్తాడు. తన తండ్రి గొప్పవాడని, ఆయన పాటించే విలువలు తప్పు కాదని, దీన్ని వందకు వంద మంది నమ్మాలని కోరుకుంటాడు కొడుకు. అలా ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయిన తండ్రి మీద ఒక్క మచ్చ రాకుండా ఉండాలని ఆరాటపడుతాడు. అంటే తండ్రి విలువలను కాపాడటం కొడుకు బాధ్యత అని చెప్పేదే సన్నాఫ్‌ సత్యమూర్తి. 

నాన్నకు ప్రేమతో.. 
తల్లి లేకపోయినా చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచిన తండ్రి కృతజ్ఞత తీర్చుకోవడానికి ఆయన పగను పంచుకుంటాడు కొడుకు. బిజినెస్‌లో మోసం చేసిన వ్యక్తి గురించి డైరీలో రాసుకుని పగ తీర్చుకోవాలని ఆరాటపడతాడు తండ్రి. ఈ విషయం తెలుసుకుని ఆ పగను తన పగగా తీసుకుని బిజినెస్‌మ్యాన్‌కు గుణపాఠం చెబుతాడు. అంటే తండ్రి ఆస్తే కాదు ఆయన ఆశయం కూడా మనదే అని చెప్పడానికి నాన్నకు ప్రేమతో మూవీ ఒక ఉదాహరణ.

​కిక్‌
ఈ మూవీలో తండ్రీకొడుకులు ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉంటారు. కొడుకు ఏం చేసినా వాడు కరెక్ట్‌ అంటూ మురిసిపోతాడు తండ్రి. అలా తండ్రి, కొడుకు మధ్య స్నేహ బంధం కూడా ఉందని చెప్పడానికి ఈ మూవీ బెస్ట్‌ ఎగ్జాంపుల్‌. 

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే..
ఈ మూవీలో కొడుకు ఉద్యోగం లేకుండా జులాయిగా తీరుగుతున్నాడని  తండ్రి ఎప్పుడూ తిట్టిపోస్తుంటాడు. నీకు తిండి దండగ అంటూ విమర్శిస్తుంటాడు. కానీ ఒక్కసారిగా కొడుకు ఉద్యోగం తెచ్చుకోగానే తన గుండె బరువు దిగినంతగా రిలాక్స్‌ అవుతాడు. కొడుకు మొదటి జీతంతో కొనిచ్చిన పట్టు వస్త్రాలను ధరించి నలుగురికి గొప్పగా చెప్పుకుంటాడు. అంటే కొడుకు బాధ్యతగా ఉండి ఓ స్థాయికి చేరుకుంటే ఆ తం‍డ్రి ఎంతలా పొంగిపోతాడో చెప్పడానికి ఈ మూవీ నిదర్శనం. అంటే ఏ తండ్రీ తన కొడుకుని పనికి మాలిన వాడిగా చూడలేక వాళ్లు మంచి ప్రయోజకులవ్వాలనే అలా కోప్పడుతుంటారని కుర్రాళ్లు అర్థం చేసుకోవాలి. ​ 

నువ్వు నాకు నచ్చావ్‌.. 
కొడుకు ఊర్లో జులాయిగా తిరుగుతూ ఉంటాడు. అతడికి త్వరగా పెళ్లి చేయాలనుకుంటాడు తండ్రి. కానీ సంబంధాలు రావు. మరోవైపు కొడుకు పాస్‌ అవ్వాలని ఎగ్జామ్‌ హాల్‌లో చిట్టీలు కూడా అందిస్తాడు తండ్రి. అంటే కొడుకు బాగుపడటానికి ఆ తండ్రి ఏం చేయడానికైనా వెనుకాడడని చెప్పాడానికి ఈ మూవీ చాలు. అలాగే తండ్రి స్నేహం పాడవకూడదని తను ప్రేమించిన అమ్మాయినే త్యాగం చేయడానికి సిద్ధపడటం కొసమెరుపు.

చదవండి: అప్పట్లో షారుక్‌ ఇచ్చింది ఇంకా నా పర్సులోనే ఉంది: ప్రియమణి

మరిన్ని వార్తలు