ఇప్పుడు సీన్‌  రివర్స్‌.. ఆ పాత్రలైనా ఓకే!

26 Feb, 2021 01:44 IST|Sakshi

సాధారణంగా స్క్రీన్‌  మీద తమ వయసు కన్నా తక్కువ వయసున్న పాత్రలు చేస్తుంటారు స్టార్స్‌. వాళ్ల అభిమానులు కూడా అదే కోరుకుంటుంటారు. కానీ ఇప్పుడు సీన్‌  మారింది. కథ కోరుకుంటే వయసుకి మించిన పాత్రలైనా ఫర్వాలేదంటున్నారు. క్యారెక్టర్‌లో కంటెంట్‌ ఉంటే స్క్రీన్‌  మీద ముసలి పాత్రలైనా సై అంటున్నారు స్టార్స్‌. ప్రస్తుతం వయసుకు మించిన పాత్రలు చేస్తున్నారు కొందరు తారలు. ఆ విశేషాలు...

భారతీయుడు రిటర్న్స్‌
అవినీతిని నిర్మూలించడానికి భారతీయుడి అవతారమెత్తారు కమల్‌హాసన్‌ . ఇప్పుడు మరోసారి భారతీయుడిగా మారారాయన. 1996లో శంకర్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌  చేసిన చిత్రం ‘భారతీయుడు’. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో 90 ఏళ్ల వృద్ధుడి పాత్రలో కనిపించనున్నారు కమల్‌. ఆయన లుక్‌ కరెక్ట్‌గా రావడం కోసం హాలీవుడ్‌ మేకప్‌ నిపుణులతో ప్రొస్థెటిక్‌ మేకప్‌ను వినియోగిస్తున్నారు. కోవిడ్‌ బ్రేక్‌ తర్వాత ఈ సినిమా ప్రారంభం కాలేదు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభించి, వచ్చే ఏడాది రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

కొమురం భీమ్‌
ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడికల్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ సినిమాలో కొమురంభీమ్‌ పాత్ర చేస్తున్నారు ఎన్టీఆర్‌. ఇందులో ఆయన వృద్ధుడిగా నటించే సన్నివేశాలు కూడా ఉంటాయని సమాచారం. దీనికి సంబంధించిన లుక్‌ కూడా హైలైట్‌గా ఉంటుందని వార్తలు వచ్చాయి. నిజానికి కొమురం భీమ్‌ చిన్న వయసులోనే చనిపోయారు. మరి ఈ ఓల్డ్‌ లుక్‌కి సంబంధించిన సన్నివేశాలను రాజమౌళి ఎలా ప్లాన్‌  చేశారో చూడాలి. అక్టోబర్‌ 13న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదల కానుంది.

అరణ్య
అడవి.. తల్లి లాంటిది. ఆ తల్లిని కాపాడుకోవాలి అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘అరణ్య’.  ఈ సినిమాలో అడవిలో నివశించే ముసలి వ్యక్తి పాత్రలో రానా కనిపించనున్నారు. ఈ సినిమా కోసం చాలా బరువు తగ్గిపోయారు. ప్రభు సాల్మన్‌  దర్శకత్వంలో  ఈ సినిమా హిందీ, తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కింది. మార్చి 26న ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.

భారతీయుడి భార్య
‘భారతీయుడు 2’ సినిమాలో కమల్‌హాసన్‌  భార్య పాత్రలో నటిస్తున్నారు కాజల్‌ అగర్వాల్‌. ఈ సినిమాలో ఆమె 85 ఏళ్ల వృద్ధురాలి పాత్రలో కనిపించనున్నారు. ఇలాంటి రోల్‌లో కాజల్‌ కనిపించడం ఇదే తొలిసారి. అలాగే ఈ సినిమా కోసం కళరియపయట్టు అనే యుద్ధ విద్య కూడా నేర్చుకున్నారీ బ్యూటీ.

గ్యాంగ్‌స్టర్‌ కథ
‘పవర్‌ పేట’ చిత్రం కోసం పవర్‌ఫుల్‌ గ్యాంగ్‌స్టర్‌గా మారారు నితిన్‌ . ‘ఛల్‌ మోహన్‌  రంగా’ తర్వాత ‘పవర్‌ పేట’ అనే గ్యాంగ్‌స్టర్‌ చిత్రం కోసం కలిశారు దర్శకుడు కృష్ణ చైతన్య, హీరో నితిన్‌ . ఓ గ్యాంగ్‌స్టర్‌ జీవితాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారు. ఈ సినిమాలో 20, 40, 60 ఏళ్ల వ్యక్తిగా మూడు దశల్లో కనిపిస్తారట నితిన్‌ . ఈ వేసవిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.

తలైవి
దివంగత తమిళ నటి, రాజకీయ నాయకురాలు జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. కంగనా రనౌత్‌ టైటిల్‌ రోల్‌ చేస్తున్నారు. జయ సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి సీయంగా ఎన్నికైన వరకూ ముఖ్యమైన విషయాలను ఈ సినిమాలో చర్చించనున్నారు. జయలలిత చివరి దశలో ఉన్నప్పటి సన్నివేశాలకు ప్రోస్థటిక్‌ మేకప్‌ను ఉపయోగించి కంగనాను 60 ఏళ్లకు పైబడిన జయలలితగా మార్చారు. జయగా మారడానికి చాలా హోమ్‌వర్క్‌ చేశాను అని పేర్కొన్నారు కంగన. ‘తలైవి’ చిత్రం ఏప్రిల్‌ 23న విడుదల కానుంది.

కోబ్రా
సినిమా సినిమాకి భిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తుంటారు విక్రమ్‌. ఆయన చేస్తున్న తాజా చిత్రం ‘కోబ్రా’. ఈ సినిమాలో సుమారు 20 గెటప్స్‌లో కనిపిస్తారని టాక్‌. అయితే ఇందులో ఓ ముసలి వ్యక్తిగా కనిపించే పాత్ర కీలకం అని తెలిసింది. ఈ లుక్‌ కోసం, బాడీ లాంగ్వేజ్‌ కోసం చాలా శ్రమించారట విక్రమ్‌. ఈ సినిమాలో ఈ లుక్‌ ఓ హైలెట్‌గా ఉంటుందట. అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.

వెన్నెల పాట
రానా, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘విరాట పర్వం’. వేణు ఊడుగుల దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు. ఈ సినిమాలోని ‘కోలు కోలమ్మ కోలో కోలో...’ అంటూ సాగే పాట గురువారం విడుదలయింది. ఈ పాట లిరికల్‌ వీడియోను వెంకటేశ్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో వెన్నెల అనే అమ్మాయి పాత్రలో నటిస్తున్నారు సాయిపల్లవి.  హీరో కోసం వెన్నెల పాడుకునే పాట ఇది. చంద్రబోస్‌ సాహిత్యం అందించిన ఈ పాటకు సురేశ్‌ బొబ్బిలి సంగీత దర్శకుడు. దివ్యమల్లిక, సురేశ్‌ బొబ్బిలి ఈ గీతాన్ని ఆలపించారు. ఏప్రిల్‌ 30న ‘విరాట పర్వం’ విడుదల కానుంది.

 

కొత్త ఉడ్‌.. కొత్త ఇల్లు!
క్యూట్‌ గర్ల్‌ రష్మికా మందన్నా ఇప్పుడు తెలుగు, కన్నడ, తమిళ చిత్రాలకే కాదు.. కొత్త ఉడ్‌కి కూడా వెళుతున్నారు. హిందీ సినిమాలకు కూడా ఓకే చెప్పి బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ‘మిషన్‌  మజ్ను’ అనే సినిమా ద్వారా హిందీ పరిశ్రమకు పరిచయం కాబోతున్నారామె. అలాగే మరో హిందీ సినిమా కూడా అంగీకరించారని సమాచారం. బ్యాక్‌ టు బ్యాక్‌ రెండు హిందీ సినిమాలు ఒప్పుకోవడంతో ఇటు తెలుగు సినిమాల కోసం హైదరాబాద్‌ అటు హిందీ కోసం ముంబై ప్రయాణం చేస్తున్నారామె. అయితే ముంబై వెళ్లిన ప్రతిసారీ హోటల్స్‌లో ఉండటం ఇబ్బందిగా అనిపించడంతో కొత్త ఇల్లు తీసుకోవాలని నిశ్చయించుకున్నారట రష్మిక. అనుకున్నట్లే ఇల్లు కొనుక్కున్నారని సమాచారం.   

షారుక్‌కి అతిథి
షారుక్‌ ఖాన్‌  హీరోగా నటించిన ‘జీరో’ సినిమాలో సల్మాన్‌  ఖాన్‌  అతిథి పాత్ర చేశారు. ఇప్పుడు మరోసారి షారుక్‌కి అతిథి కానున్నారు సల్మాన్‌ . సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో షారుక్‌ ఖాన్‌  హీరోగా ‘పఠాన్‌ ’ (వర్కింగ్‌ టైటిల్‌) అనే సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో దీపికా పదుకోన్‌  హీరోయిన్‌ గా నటిస్తోంది. ఇందులో సల్మాన్‌  గెస్ట్‌ రోల్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ముంబైలోని ఓ స్టూడియోలో జరుగుతోంది. షారుక్‌ ఖాన్‌ , సల్మాన్‌  ఖాన్‌ ... ఇద్దరూ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. దాదాపు పది నుంచి పన్నెండు రోజులు ఈ షెడ్యూల్‌ జరుగుతుంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.

పిశాచికి ఓకే
మిస్కిన్‌  దర్శకత్వంలో 2014లో వచ్చిన హిట్‌ మూవీ ‘పిశాచి’. ఈ సినిమాకు సీక్వెల్‌గా మిస్కిన్‌  దర్శకత్వంలోనే ఆండ్రియా ప్రధాన పాత్రధారిగా ‘పిశాచి 2’ తెరకెక్కుతోంది. ఇందులో విజయ్‌ సేతుపతి గెస్ట్‌ రోల్‌ చేస్తున్నారు. ‘పిశాచి 2’లోని ఓ కీలక సన్నివేశంలో వచ్చే పాత్ర కోసం విజయ్‌ సేతుపతిని అడిగారట మిస్కిన్‌ . క్యారెక్టర్‌ నచ్చితే చాలు.. హీరోనా? విలనా? అని చూడరు సేతుపతి. ఓకే అన్నారట. ఆయన పాల్గొనగా సీన్స్‌ కూడా తీశారని కోలీవుడ్‌ టాక్‌. ఈ ఏడాది ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.

మరిన్ని వార్తలు