నేనెప్పుడూ పాజిటివ్‌

17 Sep, 2020 01:01 IST|Sakshi
సింగీతం శ్రీనివాసరావు

‘‘ఈ నెల 21న నా పుట్టినరోజు. చాలామంది నాకు ఫోన్‌ చేసి నా జన్మదినానికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. ముఖ్యంగా మీడియా నుండి అనేక మంది ఫోన్‌ చేసి బర్త్‌డే ఇంటర్వ్యూలు అడుగుతున్నారు. అయితే ఇప్పుడు కాదు.. 22 తర్వాత మాట్లాడతాను’’ అని బుధవారం ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో... ‘‘నాకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిందని, స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని ఈ నెల 9న వైద్యులు చెప్పారు. నాకు నవ్వొచ్చింది.

‘అదేంటీ... నేను ఎప్పుడూ పాజిటివే కదా, ఎప్పుడూ నెగెటివ్‌ కాదు కదా’ అనుకున్నాను (నవ్వుతూ). ప్రస్తుతం హోమ్‌ ఐసొలేషన్‌లో నా గదిలో నేనుంటున్నాను. బుక్స్‌ చదువుకుంటూ ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తున్నాను. ఫుడ్‌ కూడా గదిలోకే వస్తోంది. ఇదంతా చూస్తుంటే నా హాస్టల్‌ డేస్‌ గుర్తుకు వస్తున్నాయి. సీటీ స్కాన్‌ పని సీటీ స్కాన్‌ చేసింది, మందులు పని మందులు చేస్తున్నాయి. నా వంతు పని నేను చేయాలి కాబట్టి గదిలోనే ఉంటున్నాను. నిజానికి కరోనా రాకుండా నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. కానీ అది ఏ రూపంలో వచ్చిందో తెలియదు. నా బర్త్‌డే గురించి ఎవరూ ఫోన్‌ చేయవద్దని మనవి చేస్తున్నా. 22వ తేదీ వరకూ ఐసొలేషన్లో ఉండాలని డాక్టర్లు చెప్పారు. ఆ తర్వాత నన్ను అభిమానించే అందరితో మాట్లాడతాను’’ అని సింగీతం శ్రీనివాసరావు చెప్పారు.

మరిన్ని వార్తలు