ఫ్రాడ్‌ కేసు: వివాదంలో రాఖీ సావంత్‌!

3 Mar, 2021 14:41 IST|Sakshi

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ నటి రాఖీ సావంత్‌ వివాదంలో ఇరుక్కుంది. డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాఖీ సావంత్‌తో పాటు, ఆమె సోదరుడు రాకేశ్‌, రాజ్‌ ఖత్రి అనే మరో వ్యక్తి ఈ మోసానికి పాల్పడ్డారని ఢిల్లీలోని వికాస్‌పురి పోలీస్‌ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. నవ భారత్‌ టైమ్స్‌ పేర్కొన్న వివరాల ప్రకారం.. శైలేష్‌ శ్రీవాత్సవ అనే రిటైర్డ్‌ బ్యాంక్‌ ఎంప్లాయ్‌ తన స్నేహితుడు రాజ్‌ ద్వారా రాఖీ సావంత్‌ సోదరుడు రాకేశ్‌ను కలిశాడు. వీళ్లిద్దరూ బాబా గుర్‌మీత్‌ రామ్‌ రహీమ్‌ జీవితం ఆధారంగా ఓ సినిమా నిర్మించాలనుకున్నారు.

అలాగే వికాస్‌పురిలో ఓ డ్యాన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ సైతం ప్రారంభించాలని భావించారు. అయితే ఈ ఇన్‌స్టిట్యూట్‌ బాధ్యతలు రాఖీ సావంత్‌ చూసుకుంటుందని చెప్పి రాకేశ్‌, రాజ్‌ ఇద్దరూ  శైలేష్‌ దగ్గర నుంచి ఆరు లక్షలు తీసుకున్నారు. తర్వాత వాళ్లు తీసుకున్న మొత్తానికి మరో లక్ష కలిపి మొత్తంగా ఏడు లక్షల రూపాయల పోస్ట్‌ డేటెడ్‌ చెక్‌ రాసిచ్చారు. కానీ తప్పుడు సంతకాలు ఉండటంతో ఈ చెక్‌ బౌన్స్‌ అయింది. దీంతో శైలేష్‌ పోలీసులను ఆశ్రయించాడు. 2017 నుంచే ఈ కేసు నడుస్తున్నప్పటికీ తాజాగా మరోసారి ఎఫ్‌ఐఆర్‌ నమోదు కావడంతో ఈ అంశం మళ్లీ చర్చనీయాంశంగా మారింది.

ఈ వివాదం గురించి నటి సోదరుడు రాకేశ్‌ స్పందిస్తూ తను ఎలాంటి తప్పు చేయలేదని పేర్కొన్నాడు. "రాజ్‌ ఖత్రితో కలిసి ఢిల్లీలో యాక్షింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రారంభించినప్పుడు అమ్మ అనారోగ్యం పాలైంది. అప్పుడు నెల రోజుల పాటు నేను ముంబైలో ఉన్నాను. తర్వాత ఢిల్లీకి వెళ్లగా అక్కడ నా చెక్‌బుక్‌ సహా ఇతర ముఖ్య వస్తువులన్నీ కనిపించకుండా పోయాయి. నా పార్టనర్‌ నన్ను మోసం చేశాడని అర్థమైంది. ఈ విషయంలో ఢిల్లీ, ముంబై పోలీసులకు ఇదివరకే ఫిర్యాదు చేశాను.  ఈ కేసులో రాఖీకి ఎలాంటి సంబంధం లేదు. అనవసరంగా ఆమెను ఇందులోకి కావాలని లాగుతున్నారు. ఈ కేసులో చట్టపరంగా ముందుకు వెళ్తాం" అని పేర్కొన్నాడు. ప్రస్తుతం రాఖీ సావంత్‌ క్యాన్సర్‌ చికిత్స తీసుకుంటున్న తల్లి బాధ్యతలు చూసుకుంటోంది.

చదవండి: అమ్మ కోసం ప్రార్థించండి: రాఖీ సావంత్‌

కరీనా కపూర్‌ ఇంటి గోడెక్కిన ఫొటోగ్రాఫర్‌

మరిన్ని వార్తలు