Stand Up Comedians: ఐదుగురు స్టాండప్‌ కమెడియన్స్‌.. ఒకరైతే ఒంటి మీద దుస్తుల్లేకుండా కామెడీ...

12 Mar, 2023 14:59 IST|Sakshi

అమ్మ అంటుంది.. ‘‘ఎప్పటికైనా  నువ్వు పరాయింటికి వెళ్లాల్సిందానివే’’ అని.. అత్తగారు అంటారు.. ‘‘ఎంతైనా నువ్వు పరాయింటి నుంచి వచ్చిందానివే’’ అని.. సో జస్ట్‌ చిల్‌ లేడీస్‌.. మనకంటూ ఒక ఇల్లున్నప్పుడు క్లీన్‌ చేసుకుందాం! జోక్‌లా వినిపించే వాస్తవం అది. పేల్చింది.. ఇన్‌స్టాలో ఇలాంటి వ్యంగ్యాస్త్రాల రీల్స్‌తో పాపులర్‌ అయిన గాయత్రి దర్శిక.  ఆ విరుపు అమ్మాయిలకు అబ్బిన నేరుపు. ఎక్కడి నుంచో కాదు.. చుట్టూ ఉన్న వాతావరణం నుంచే!

ఇలా సమాజంలోని పురుషాధిపత్య సూత్రాలు.. కార్పొరేట్‌ నైజాలు.. పాలిటిక్స్‌ ఆటలు.. పేరెంటిగ్‌ పాట్లు.. పెంపకంలో లోట్లు.. వాట్‌ నాట్‌.. పొద్దున లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకోబోయే వరకు ఎదురైన అనుభవంలోకి వచ్చిన సంఘటనలన్నింటినీ హాస్యంగా ఒలిచి.. సటిల్‌గా చుట్టి.. నవ్వులు పండిస్తున్నారు. మేల్‌ వరల్డ్‌గా ఉన్న హ్యూమర్‌ ఫీల్డ్‌లోకి స్టాండప్‌ కమెడియన్స్‌గా అడుగుపెట్టారు. అక్కడా జెండర్‌ ఈక్వాలిటీ సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్లలో ప్రశస్తి సింగ్‌.. అదితి మిత్తల్‌.. సుముఖి సురేశ్, కనీజ్‌ సుర్‌కా.. రాధికా వాజ్‌.. వంటి టాప్‌ ఫిమేల్‌ స్టాండప్‌ కమెడియన్స్‌ గురించి ఓ పరిచయం.. 

ప్రశస్తి సింగ్‌.. 
బ్రాండ్‌ ఆఫ్‌ హ్యూమర్‌.. అనెక్డాటల్‌ కామెడీ

రైటర్, యాక్టర్, ఇంప్రొవైజర్‌ కూడా అయిన ప్రశస్తి సింగ్‌ పుట్టింది, పెరిగింది ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీలో. చదువులో ఫస్ట్‌. పదవ తరగతిలో జిల్లా టాపర్‌. ఢిల్లీలో ఇంజినీరింగ్, లక్నో ఐఐఎమ్‌లో ఎంబీఏ పూర్తిచేసింది. సంప్రదాయబద్ధమైన కుటుంబ నేపథ్యమున్న ప్రశస్తి.. అంతే రొడ్డకొట్టుడు కెరీర్‌ పాత్‌ను ఎంచుకుంది చదువైపోగానే. కార్పొరేట్‌ కొలువులో చేరింది. కొన్నాళ్లు బెంగళూరులో, ఇంకొన్నాళ్లు హైదరాబాద్‌లో పనిచేసింది. ఉద్యోగం బోర్‌కొట్టింది. కొత్తదేదైనా చేయడానికి ముంబైకి మకాం మార్చింది. స్టార్‌ టీవీలో చేరింది. అక్కడే కొంతమంది స్టాండప్‌ కమెడియన్స్‌ పరిచయం అయ్యారు. స్నేహం కుదిరింది. హ్యాంగవుట్స్‌లో వాళ్ల జోక్స్‌కి సమంగా ప్రశస్తి కౌంటర్‌ జోక్స్‌ వేయడం ఆ స్నేహితులు గమనించారు. ఆమెలోని హాస్యచతురతను పసిగట్టారు. ‘నువ్వు అద్భుతంగా కామెడీ చేయగలవు.. జనాల ముందుకు వెళ్లు’ అంటూ ఆమెకు మైక్‌ ఇచ్చి ప్రేక్షకుల ముందు నిలబెట్టారు. అలా ఆమె తొలి కామెడీ షో గొప్పగా కాకపోయినా.. ఆ రంగంలో ఆమె భవిష్యత్తుకు ఢోకా లేదనే భరోసానైతే ఇచ్చింది.

కొద్దిపాటి ఆ ప్రోత్సాహంతోనే స్టాండప్‌ కామెడీ షోలు చేయడం మొదలుపెట్టింది. ఆ ప్రయాణం ఎనిమిది నెలలు సాగాక అమెజాన్‌ ప్రైమ్‌  కామెడీ షో ‘కామికిస్తాన్‌’లో పార్టిసిపేట్‌ చేసే చాన్స్‌ వచ్చింది ఆమెకు. ఈ ఎనిమిది నెలలూ తనను తాను ఎప్పటికప్పుడు తీర్చిదిద్దుకుంటూనే ఉంది. తన మైనస్‌లను గ్రహించి వాటిని స్ట్రెంత్‌గా మలచుకుంటూనే ఉంది. ఆ ప్రయత్నం ‘కామికిస్తాన్‌’ షోకి బాగా వర్కవుట్‌ అయింది. "కామికిస్తాన్‌లో కనిపించిన స్టాండప్‌ కమెడియన్స్‌ రాత్రికి రాత్రే పాపులర్‌ అయిపోతారు అనుకున్నా అందులో పార్టిసిపేట్‌ చేయకముందు.. కానీ పాల్గొన్న తర్వాత తెలిసింది పాపులర్‌ అయిన కమెడియన్స్‌కే అందులో పాల్గొనే చాన్స్‌ వస్తుంది అని" అంటుంది ఆ షో గురించి మాట్లాడుతూ. అందులో తను ఫెయిల్‌ అవకుండా ఏదో నెట్టుకొస్తాలే అనుకుంది కానీ ఊహించని రెస్పాన్స్‌ వచ్చి బాగా హిట్‌ అయింది. దాంతో ఆమె మరింత పాపులర్‌ అయింది. ప్రతి షోకి కొత్తదనాన్ని తేవడం ఒక ఎత్తయితే.. స్వరంలో ఆమె పలికించే మాడ్యులేషన్స్‌ మరో ఎత్తు. ఇవే ఆమె ఎసెట్స్‌.

‘స్పోకెన్‌ ఫెస్ట్‌ 2019’ షోలో ప్రశస్తికి ప్రేక్షకుల నుంచి స్టాండింగ్‌ ఒవేషన్‌ లభించింది. అందులో ఆమె.. తన తండ్రి చనిపోయినప్పుడు తన తల్లి చూపించిన ధైర్యం.. కుటుంబాన్ని ఆమె నిలబెట్టిన తీరు గురించి చెబుతూ ‘మా అమ్మ నాకు సూపర్‌ హీరో’ అంటూ తల్లిని అభివర్ణించింది. అంత సున్నితమైన.. సీరియస్‌ విషయాన్ని గాఢత ఏమాత్రం తగ్గకుండా.. హాస్యపు పాళ్లు మితిమీరకుండా వర్ణించిన తీరుకు ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. ఓ కంట భావోద్వేగపు  తడి.. మరో కంట నవ్వుల తడితో చప్పట్లు మోగించారు. అయితే కార్పొరేట్‌ జాబ్‌ వద్దనుకుని జోక్స్‌ని క్రాక్‌ చేసే పనిలో ప్రశస్తి పడడాన్ని మొదట్లో వాళ్లమ్మ భారతి సింగ్‌ అంతగా ఇష్టపడలేదు. తర్వాత్తర్వాత కూతురి పట్టుదల చూసి ఆమెకు సపోర్ట్‌గా నిలబడింది.

‘నేను ఆర్థికంగా కాస్త స్థిరపడ్డాకే ఈ ఫీల్డ్‌లోకి వచ్చా. అయినా చాలా విషయాల్లో ఆమెను ఇబ్బంది పెట్టా. అయినా సరే.. నాకు సపోర్ట్‌గానే ఉంది’ అంటుంది వాళ్లమ్మ గురించి ప్రశస్తి. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్‌తో జోక్స్‌ వేస్తూ అందరిలో తన ప్రెజెన్స్‌ను స్పెషల్‌గా మలచుకునేదట. కానీ తనిలా స్టాండప్‌ కమెడియన్‌గా మారతానని.. తనలో అంత హాస్య చతురత.. అంత అద్భుతమైన టైమింగ్‌ ఉన్నాయని.. ఎప్పుడూ అనుకోలేదట. ఆ క్రెడిట్‌ వాళ్ల నాన్నకే ఇస్తుంది. ‘నాకు ఇది మా నాన్న నుంచే వచ్చింది’ అంటూ. ‘అయితే మా నాన్న ఇప్పుడు ఉండి ఉంటే.. నేను కమెడియన్‌ అవడం పట్ల చాలా ఆశ్చర్యపోయేవారు. ఎట్‌ ది సేమ్‌ టైమ్‌ హ్యాపీగా ఫీలయ్యే వారు కూడా. ఎందుకంటే మా నాన్న ఎప్పుడూ ఒకటే చెబుతుండేవారు.. ఏ పని చేసినా అందులో మన మార్క్‌ చూపించాలని. అందుకే ఇందులో నేను పెడుతున్న హండ్రెడ్‌ పర్సెంట్‌ ఎఫర్ట్స్‌ని చూసి తప్పకుండా సంతోషించేవారు’ అంటుంది. తనను తాను కన్‌ఫ్యూజ్డ్‌ సోల్‌గా వర్ణించుకుంటుంది ప్రశస్తి. ఆ నైజం, కార్పొరేట్‌ సెక్టార్‌లో పనిచేసిన అనుభవం.. మహిళలకు సంబంధించిన సమస్యలు.. వంటివన్నీ తన జోక్స్‌కి ముడి సరుకులే అంటుంది. ‘ఓపెన్‌ మైక్‌లో ఆడియెన్స్‌ ముందు ఎప్పటికప్పుడు కొత్త కొత్త జోక్స్‌ను క్రాక్‌ చేస్తున్నా.. వాళ్ల రెస్పాన్స్‌ను తెలుసుకుంటున్నా. కాబట్టి.. ఇంకా చాలా దూరం ప్రయాణించాలి అన్న నిజం తెలుస్తోంది’ అని చెబుతుంది.

ప్రశస్తికి హిందీ భాషే సౌకర్యంగా ఉన్నప్పటికీ కార్పొరేట్‌ ఉద్యోగుల కోసం స్టాండప్‌ కామెడీ చేయాల్సి రావడంతో ఇంగ్లిష్‌లో తన కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను మెరుగుపరచుకోవాల్సి వచ్చింది. కానీ అభిషేక్‌ ఉపమన్యు, జకీర్‌ ఖాన్‌ వంటి స్టాండప్‌ కామెడీ స్టార్స్‌ వాళ్ల హాస్యానికి భాషా హద్దులను చెరిపేసి హిందీలోనే జోక్స్‌ పేలుస్తూ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకోవడం మొదలెట్టేసరికి ప్రశస్తికీ దారి దొరికినట్టయింది. అంతే అప్పటి నుంచి ఆమే తనకు సులువైన హిందీలోనే హాస్యాన్ని పండిస్తూ వస్తోంది. ‘నాకు సహజంగా వచ్చేది హిందీనే. ఎప్పుడైతే ఈ ఇద్దరూ.. హిందీలో ఆలోచనలకు దారులు వేస్తూ వచ్చారో అప్పుడు నాకు భలే ఊరటగా అనిపించింది. ఎందుకంటే భాష కన్నా ఆలోచనలు ముఖ్యం కదా!’ అంటుంది ప్రశస్తి. 

కాంట్రవర్సీ...
2019, డిసెంబర్‌ 31న ప్రశస్తి తన ఇస్టాగ్రామ్‌ అకౌంట్‌లో.. బాలీవుడ్‌ నటుడు సిద్ధార్థ్‌ మల్హోత్రాతో తను కలసి దిగిన ఓ పాత ఫొటోని పోస్ట్‌ చేసింది.. అతన్ని వెయిటర్‌గా కామెంట్‌ చేస్తూ. అంతే సిద్ధార్థ్‌ ఫ్యాన్స్‌ ఆమె మీద విరుచుకుపడ్డారు. ఒక్క సిద్ధార్థ్‌నే కాదు మొత్తం వెయిటర్స్‌నే ఆమె అవమానించిందంటూ. 

అదితి మిత్తల్‌
బ్రాండ్‌ ఆఫ్‌ హ్యూమర్‌.. పర్సనల్‌ ఎక్స్‌పీరియెన్సెస్‌

అదితి మిత్తల్‌ను దేశంలోనే తొలి మహిళా స్టాండప్‌ కమెడియన్‌గా చెప్తారు. ఈమె రైటర్, యాక్టర్‌ కూడా. ఈ మూడింటిలో దేన్నయినా అవలీలగా చేసేస్తుంది. పుణెలో పుట్టి, పెరిగింది. కెనడా, అమెరికాల్లో చదువుకుంది. కొన్నాళ్లు న్యూయార్క్‌లో ఉద్యోగం చేసింది. అయితే మొదటి నుంచి హాస్యం అంటే ఇష్టం. అదంటే ఆమెకు ప్యాషన్‌ కూడా. అందుకే ఉద్యోగాన్ని వదిలిపెట్టి ముంబై వచ్చేసింది. అప్పటికీ స్టాండప్‌ కామెడీ రంగంలో మహిళలు ఎవరూ లేరు. పైగా అదితి ఎంచుకున్న టాపిక్స్‌ అన్నీ బోల్డ్‌ టాపిక్సే. సెక్స్‌.. బ్రాస్‌.. పీరియడ్స్‌ ఇలా అన్నీ మహిళలకు సంబంధించినవే. వాటి గురించి అమ్మాయిలు పెదవి విప్పితేనే సమాజం వాళ్ల మీద ‘బ్యాడ్‌ గర్ల్‌’ అని ముద్రవేసేంత నిషిద్ధమైన వాటిని తన కామెడీకి సబ్జెక్ట్స్‌గా తీసుకున్నది. దీంతో ఆమె కెరీర్‌ మొదట్లో కాస్త ఇబ్బందులనే ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా జంకలేదు. అలాగే ముందుకు సాగింది.

తర్వాత్తర్వాత యూత్‌ ..ఆ జోక్స్‌ను ఓ ఎడ్యుకేషన్‌లా తీసుకోసాగింది. దాంతో ఆమె పాపులర్‌ అయింది. టీవీ చానెళ్లు ఆమెను ఇన్వైట్‌ చేయసాగాయి. ఆమె చేత కామెడీ షోస్‌ పెట్టించాయి. అలా అదితి స్టాండప్‌ కామెడీ దేశం దాటి యూకే, అమెరికాకూ చేరుకుంది. అమెరికన్, సౌత్‌ ఆఫ్రికన్‌ హాస్య దిగ్గజాలతో చేసిన అమెరికన్‌ డాక్యుమెంటరీ ‘స్టాండప్‌ ప్లానెట్‌’లో ఆమెకూ చోటు దక్కింది. అలా అంతర్జాతీయ ఖ్యాతినీ ఆర్జించింది. 2013లో లండన్‌లో బీబీసీ ఆధ్వర్యంలో జరిగిన 100 విమెన్‌ కాన్ఫరెన్స్‌కి ఆమెకూ ఆహ్వానం అందింది. సీఎన్‌ఎన్‌– ఐబీఎన్‌లోని ఓ రాజకీయ వ్యంగ్యాస్త్రపు షోలోనూ సైరస్‌ బ్రోచాతో కలసి నవ్వులు పూయించింది. ‘విమెన్‌ ఇన్‌ లేబర్‌’ అనే పాడ్‌కాస్ట్‌ ద్వారా ఉద్యోగినుల సమస్యలనూ చర్చించింది. నెట్‌ఫ్లిక్స్‌‘థింగ్స్‌ దే వుడ్‌ నాట్‌ లెట్‌ మి సే’, ‘గర్ల్‌ మీట్స్‌ మైక్‌’ వంటి షోలతో తన ప్రత్యేకతను చాటింది. ‘బ్యాడ్‌ గర్ల్స్‌’ అనే వెబ్‌ సిరీస్‌లోనూ నటించింది.

కామెడీ షోలే కాక లండన్‌లోని సోహో థియేటర్‌లో కామెడీ వర్క్‌షాప్స్‌నూ నిర్వహిస్తోంది. ఆమె చేత హాస్య పాఠాలు చెప్పించుకున్న ఆమె స్టుడెంట్స్‌లో కొందరు ఆమెతో సరిసమంగా ఇంకొందరు ఆమెకన్నా గొప్ప కమెడియన్స్‌గా రాణిస్తున్నారు. ఇది తనకెంతో గర్వకారణం అంటుంది అదితి. ఇవన్నీ కాక ఆమె ‘గ్రేజియా మెన్‌’, ‘డీఎన్‌ఏ’, ‘ఫస్ట్‌పోస్ట్‌.కామ్‌’ వంటి వాటికి ఆర్టికల్స్‌ రాస్తుంది. అదితి గురించి ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ.. ఘంటా అవార్డ్స్, ఫిల్మ్‌ఫెయిల్‌ అవార్డ్స్‌ వంటి రెండు పురస్కార ప్రదాన షోలకు ఆమె వ్యవస్థాపక సభ్యురాలు. వ్యంగ్యం పొట్లంలో తెలివైన జోక్స్‌ను ప్యాక్‌ చేసి ఆడియెన్స్‌కు అందిస్తుందని హాస్యలోకంలో కితాబునందుకుంటున్న అదితి సోషల్‌ మీడియాలోనూ అంతే ఫేమస్‌. లక్షల్లో సబ్‌స్క్రైబర్స్, ఫ్యాన్స్‌ ఉన్నారు. ‘ఏదో సరదాకి చేస్తున్న పని.. నా కెరీర్‌గా స్థిరపడుతుందని ఎప్పుడూ అనుకోలేదు. ఈ విషయంలో నేను నిజంగానే అదృష్టవంతురాలిని. ఎందుకంటే ఇష్టమైన పని చేసే చాన్స్‌ దొరికింది. అందులో సక్సెస్‌ కూడా దక్కింది’అంటుంది అదితి మిత్తల్‌. 

కాంట్రావర్సీ 
2018లో అదితి ‘మీ టూ’ కింద ఆరోపణను ఎదుర్కొంది. కనీజ్‌ సుర్‌కా అనే మరో స్టాండప్‌ కమెడియన్‌ .. తన పెదవుల మీద అదితి బలవంతంగా ముద్దుపెట్టుకుందని ఆరోపించింది. దీనికి తర్వాత అదితి క్షమాపణ చెప్పుకుంది. ‘స్టేజ్‌ మీద ఒక షోలో భాగంగా.. జోక్‌గా పెక్‌ ఇచ్చాను అంతే. దానికి కనీజ్‌ హర్ట్‌ అయ్యుంటే అపాలజీ కోరుతున్నాను’ అంటూ! 

సుముఖి సురేశ్‌
బ్రాండ్‌ ఆఫ్‌ హ్యూమర్‌.. ఆల్‌రౌండర్‌

బహతీ నాక్, పుష్పవల్లి అనే కామెడీ వెబ్‌ సిరీస్‌తో సుముఖి వెల్‌నోన్‌. ఆమె ఒక్క స్టాండప్‌ కమేడియనే కాదు.. రైటర్, యాక్టర్, ప్రొడ్యూసర్‌.. ఔత్సాహిక స్టాండప్‌ కమేడియన్‌లను తీర్చిదిద్దుతున్న మెంటర్‌ కూడా. నాగ్‌పూర్‌లో పుట్టి పెరిగిన తమిళియన్‌ సుముఖి. ఫుడ్‌ సైన్స్‌ గ్రాడ్యుయేట్‌. హ్యూమర్‌ అంటే ఇష్టం. దాన్ని కెరీర్‌గా మొదలుపెట్టే కంటే ముందు బెంగళూరులోని ఓ చిన్నపిల్లల గ్రంథాలయంలో లైబ్రేరియన్‌గా పనిచేసింది. తర్వాత ఒక ఫుడ్‌ ల్యాబొరేటరీలోనూ పనిచేసింది. ఇంకొన్నాళ్లు ఓ ప్రైవేట్‌ కంపెనీలో బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌గానూ చేసింది. హాస్యం మీద ఆమెకున్న ప్రేమ ఆ ఉద్యోగాలను సవ్యంగా చేయనివ్వలేదు. దాంతో కామెడీ షోలు చేసే ‘ది ఇంప్రూవ్‌’ అనే గ్రూప్‌లో చేరింది. దాదాపు వందకు పైగా షోస్‌ చేసింది. అలా ఆమె స్టాండప్‌ కమెడియన్‌గా దేశమంతా పరిచయమైంది.

ఆమె కామెడీలోనే కాదు జీవితంలోనూ ఆల్‌రౌండర్‌గా ఉండాలని కోరుకుంటుంది. అందుకే ఇటు రైటర్‌గా.. అటు యాక్టర్‌గా.. ప్రొడ్యుసర్‌గా.. కంటెంట్‌ క్రియేటర్‌గా.. ఓహ్‌.. ఎన్ని వీలైతే అన్ని పనులు చేయాలని ఉత్సాహపడుతుంది. అందులో సక్సెస్‌ అవుతుంది కూడా. ఈ మధ్యే ‘మోటర్‌మౌత్‌’ పేరుతో కంటెంట్‌ క్రియేట్‌ చేసే సంస్థనూ స్థాపించింది. మూడు బాలీవుడ్‌ సినిమాలకు రచనా సహకారమూ అందించింది. అమెజాన్‌ ప్రైమ్‌ ‘కామికిస్తాన్‌’ సీజన్‌ 1లో కో–హోస్ట్‌గా, థర్డ్‌ సీజన్‌లో జడ్జ్‌గా వ్యవహరించింది. ఇలాంటి వెబ్‌ షోస్‌ అన్నీ  ఆమె ఫేమ్‌ని పెంచేవి అనే కంటే ఆమె ఫేమ్‌ని ఉపయోగించుకునేవి అని చెప్పొచ్చు. దేని మీదైనా కామెడీని పండించే సుముఖికి ఆమె కంఠ స్వరం ప్లస్‌ పాయింట్‌. నటనారంగంలోనూ తన సత్తా చాటాలనుకుంటోంది.

ముఖ్యంగా కరణ్‌ జోహార్, విక్రమాదిత్య మోత్వాని దర్శకత్వంలో నటించాలని కోరుకుంటోంది. ‘ఎక్కడైనా ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యం. అయితే సినిమాల్లో నాకు రైటింగ్‌ శాఖలో వచ్చినన్ని అవకాశాలు స్క్రీన్‌ మీద రావడం లేదు. అయినా ఆ అవకాశాల అంతు చూసేదాకా వదిలిపెట్టను. ఇటు కమెడియన్‌గా.. రైటర్‌గా.. కంటెంట్‌ క్రియేటర్‌గా.. నా పని నేను చేసుకుంటూనే వెళ్తా. అఫ్‌కోర్స్‌ వీటన్నిటికన్నా కూడా నా ఫస్ట్‌ ప్రయారిటీ స్టాండప్‌ కామెడీయే. ఈ రంగంలో ఉన్న జెండర్‌ బయాస్‌ను రూపుమాపడంలో నా వంతు ప్రయత్నం నేను చేయాలి కదా! నవరసాల్లో ఇదొకటి. దీనికి జెండర్‌ ఏమిటి? ఆడవాళ్లు అద్భుతంగా హాస్యాన్ని పండిచగలరని నేనే కాదు నా కన్నా ముందే ఈ రంగంలోకి వచ్చిన వారంతా నిరూపించారు. వాళ్లే నాకు స్ఫూర్తి. అలా నేనూ ఇంకొంతమందికి స్ఫూర్తిగా నిలవాలి. ఈ రంగంలోకి చిన్న చిన్న టౌన్స్‌ నుంచి అబ్బాయిలు వస్తున్నంతగా అమ్మాయిలు రావడం లేదు. అలాంటి వాళ్లకు నేనే ఒక ఎగ్జాంపుల్‌గా నిలబడాలనుకుంటున్నా. నేనూ నాగ్‌పూర్‌ అనే టౌన్‌ నుంచే కదా వచ్చింది!’ అంటుంది సుముఖి సురేశ్‌. 

కనీజ్‌ సుర్‌కా
బ్రాండ్‌ ఆఫ్‌ హ్యూమర్‌.. సెల్ఫ్‌ కంటైన్డ్‌

సౌత్‌ ఆఫ్రికాలో పుట్టిపెరిగిన గుజరాతీ. లా అండ్‌ సైకాలజీ గ్రాడ్యుయేట్‌. హైస్కూల్లో ఉన్నప్పుడు కనీజ్‌ వాళ్లకు ‘డ్రామా’ ఒక సబ్జెక్ట్‌ అట. అందులో తనెప్పుడూ కామెడీ రోల్స్‌నే తీసుకునేదట. మిగిలిన ముఖ్యపాత్రల కన్నా తనకే ఎక్కువ గుర్తింపు, కాంప్లిమెంట్స్‌ వచ్చేవట. అప్పుడే తనకు అర్థమైందట తన ఫ్యూచర్‌ హాస్యంతో ముడిపడి ఉందని. అందుకే డిగ్రీ పూర్తయి ఇండియాకు రాగానే ఒక కామెడీ ట్రూప్‌లో చేరింది. అందులో ట్రెయిన్‌ అవుతూనే సీఎన్‌ఎన్‌– ఐబీఎన్‌లో ప్రసారమైన పొలిటికల్‌ సెటైర్‌ షో ‘దిస్‌ వీక్‌ దట్‌ వజ్‌నాట్‌ (This Week That Wasn't)’లో సైరస్‌ బ్రోచాతో కలసి కామెడీ చేసింది. ఆ షోతో ఆమెకు దేశవ్యాప్త గుర్తింపు వచ్చింది. తాను ఈ రంగంలోకి వచ్చిన కొత్తలో మహిళలకు సంబంధించిన సమస్యల మీద జోక్స్‌ వేస్తే ఆడియెన్స్‌ గంభీరమైపోయేవారట. ఆ పరిస్థితులను మార్చడానికి మహిళా స్టాండప్‌ కమెడియన్స్‌ చాలానే సవాళ్లను ఎదుర్కోవల్సి వచ్చింది అంటుంది కనీజ్‌. ఆమె కేవలం స్టాండప్‌ కమేడియనే కాదు.. టెలివిజన్‌ షో క్రియేటర్, ప్రొడ్యూసర్, హాస్య నటి, ఇంప్రొవైజర్‌!

నెట్‌ఫ్లిక్స్‌ స్పెషల్స్‌ ‘లేడీస్‌ అప్‌’, ‘కామెడీ ప్రీమియమ్‌ లీగ్‌’, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోస్‌ స్పెషల్స్‌ ‘సమ్‌థింగ్‌ ఫ్రమ్‌ నథింగ్‌’, ‘ఇంప్రూవ్‌ ఆల్‌ స్టార్స్‌ గేమ్స్‌ నైట్‌’ వంటి షోలన్నీ ఆమె సృష్టే. ఆమె పెర్‌ఫార్మ్‌ చేసినవే. అంతేకాదు అమెజాన్‌ప్రైమ్‌ వీడియోస్‌ ‘కామికిస్తాన్‌’ రెండు సీజన్లకు ఆమె జడ్జిగా వ్యవహరించింది. చెప్పుకుంటూ పోతే ఇటు టీవీ.. అటు ఓటీటీ.. సోషల్‌ మీడియాలో కనీజ్‌ చేసిన.. చేస్తున్న షోలు చాలా ఉన్నాయి. ఆ అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో అభిమానులూ అంతేమంది ఉన్నారు. అయినా రాశి కన్నా వాసే ముఖ్యమని నమ్ముతుంది ఆమె. అందుకే యాభై నిమిషాల షోకి దాదాపు ఆరునెలలు వెచ్చిస్తుందట. హాస్యంలో టైమింగే ఎసెట్‌గా ఉన్న కనీజ్‌ సక్సెస్, ఫెయిల్యూర్‌ రెండిటినీ సమంగా తీసుకుంటానంటుంది. ‘విన్న జోక్‌ నిన్ను హాయిగా నవ్విస్తే అది మంచి జోక్‌. నవ్వించకుండా నిన్ను ఇబ్బంది పెట్టింది అంటే అది కచ్చితంగా జోక్‌ కాదు. నిన్ను హాయిగా నవ్విస్తూనే కొంత ఆలోచింప చేసింది అంటే అది అద్భుతమైన జోక్‌. హాస్యంతో పాటు దానికతీతమైనదేదో ఆడియెన్స్‌కివ్వాలి’ అంటుంది కనీజ్‌. ‘నేను ఈ రంగంలోకి వచ్చిన కొత్తలోకి.. ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. చాలా మంది అమ్మాయిలు వస్తున్నారు. అయినా ఇంకా రావాలి. ఆ ఉత్సాహం ఉన్నవాళ్లకు నేను చెప్పేది ఒకటే.. అనుకున్నది చేసేయండి.. మీనమేషాలు లెక్కపెడుతూ కూర్చోవద్దు. హండ్రెడ్‌ పర్సెంట్‌ నవ్వులను పండించలేం. కాని హండ్రెడ్‌ పర్సెంట్‌ ఎఫర్ట్స్‌ పెట్టాలి. హండ్రెడ్‌ పర్సెంట్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇవ్వాలి. భయాన్ని వదిలేయాలి. ధైర్యంగా మైక్‌ పట్టుకోవాలి. కాన్ఫిడెంట్‌గా వినిపించాలి. అంతే మ్యాజిక్‌ జరుగుతుంది’ అంటూ ఔత్సాహికులకు సూచనలిస్తుంది కనీజ్‌ సుర్‌కా. 

రాధిక వాజ్‌
బ్రాండ్‌ ఆఫ్‌ హ్యూమర్‌ .. వెరీ బోల్డ్‌

రాధిక వాజ్‌ డేర్‌ డెవిల్‌. సంచలనాల పుట్ట. ఆడవాళ్ల నెలసరి నుంచి  వాళ్ల భద్రత మొదలు వర్జినిటీ, పెళ్లి, వయసు ముదరడం.. వివాదాస్పదమైన ఆచారవ్యవహారాలు, సెక్స్‌ వరకు అన్ని విషయాలను కామెడీకి కన్సిడర్‌ చేస్తుంది. స్టాండప్‌ కమేడియన్‌తోపాటు ఆమె యాక్ట్రెస్, రైటర్‌ కూడా. ఇప్పుడు ఆమె వయసు 49. దాదాపు ఎనిమిదేళ్ల కిందట.. ఒక యాడ్‌ క్యాంపెయిన్‌లో భాగంగా ఆమె న్యూడ్‌గా రెండు నిమిషాల నిడివిగల స్టాండప్‌ కామెడీ చేసింది. అప్పడూ ఇప్పుడూ అది సంచలనమే. కొంతమంది విమర్శించారు. ఇంకొంతమంది బ్రేవ్‌ యాక్ట్‌గా అభివర్ణించారు. రాధిక రెండిటినీ పట్టించుకోలేదు. ‘మనమేం చేయాలో.. అది చేస్తాం. దాని మీద ఎవరికి తోచిన విధంగా వాళ్లు స్పందిస్తారు’ అని మాత్రం కామెంట్‌ చేసింది అంతే. స్టాండప్‌ కామెడీలో ఆమెను ఫెమినిస్ట్‌ స్టాండప్‌ కమెడియన్‌గా చెప్తుంటారు. కానీ ఆ మాటను రాధిక ఖండిస్తుంది.

‘అమ్మాయి అంటే  ఇలా ఉండాలి.. ఇలా ఉండకూడదు అనే ఆంక్షల మధ్యేమీ నేను పెరగలేదు. నాకు సిగరెట్, మందు తాగాలనిపిస్తే తాగుతాను. అంతే తప్ప మగవాళ్లతో సమంగా నేనెందుకు తాగొద్దు అనే భావనతో అయితే కాదు’ అంటుంది. ‘ఇప్పుడంటే సోషల్‌ మీడియా వచ్చి మహిళలకు సంబంధించిన చాలా విషయాల మీద చర్చిస్తున్నారు కానీ ఇదివరకైతే వాటి ఊసెత్తితేనే వాళ్లను బరితెగించిన వాళ్లుగా ముద్ర వేసేవారు. ఇప్పటికీ ఇంకా అలాంటి భావజాలం ఉంది. అలాంటి  విషయాల మీద.. సమస్యల మీద విస్తృతంగా చర్చ జరగాలి. అందుకే వాటికి నేను నా స్టాండప్‌ కామెడీలో స్పేస్‌ ఇస్తున్నాను’ అని చెప్తుంది. ఆమె కొన్నాళ్లు అమెరికాలో పనిచేసింది. అక్కడే ఇంప్రొవైజేషనల్‌ కామెడీలో ప్రయోగాలు చేయడం ప్రారంభించింది. ఆ క్రమంలోనే స్టాండప్‌ కామెడీ ద్వారా స్త్రీల సమస్యలను.. పురుషాధిపత్య ధోరణిని  ప్రేక్షకుల ముందుకు తెచ్చి వాళ్లలో ఆలోచనలను రేకెత్తించవచ్చుననీ గ్రహించింది. ఇక్కడికి రాగానే అమల్లో పెట్టింది. రాధిక వాజ్‌ తన చిన్నప్పటి సంఘటనలు, జ్ఞాపకాలతో ఓ పుస్తకం కూడా రాసింది ‘అన్‌లాడ్లీలైక్‌’ పేరుతో. అదీ సంచలనమే అయింది. ‘కామెడీ అనేది జీవితానుభవం నుంచి పుట్టాలి. ఆడ.. మగ ఏ కమెడియన్‌ అయినా సరే ఆ వాస్తవ కథానాలనే హాస్యంగా పండించాలి’ అని చెప్తుంది రాధిక వాజ్‌.

మరిన్ని వార్తలు