Flora Saini: నన్ను చావబాదాడు, నా కుటుంబాన్ని చంపుతానని బెదిరించాడు

7 Dec, 2022 16:23 IST|Sakshi

బాలీవుడ్‌ నటి ఫ్లోరా సైని తను ఎదుర్కొన్న వేధింపులను తాజా ఇంటర్వ్యూలో ఏకరువు పెట్టింది. మాజీ ప్రియుడు, నిర్మాత గౌరంగ్‌ దోషి తనను చితకబాది చంపినంత పని చేశాడని వాపోయింది. అతడిని వదిలి వెళ్లిపోతే తనను, తన తల్లిదండ్రులను చంపుతానని బెదిరించాడంటూ ఆ చీకటి రోజులను గుర్తు చేసుకుంది.

మొదట్లో గౌరంగ్‌ ఎంతో ప్రేమగా ఉండేవాడు. కానీ తర్వాతే అసలు రంగు బయటపడింది. శ్రద్ధావాకర్‌ హత్యకేసులో ఏదైతే జరిగిందో నా విషయంలో కూడా అదే జరిగేదేమో! మొదట నా కుటుంబానికి దూరం చూశాడు. ఇంట్లో వాళ్లు వద్దని హెచ్చరించినా వినకుండా ఇల్లు వదిలి అతడి దగ్గరకు వెళ్లిపోయాను. కానీ అతడి ఇంటికి వెళ్లిన వారం రోజుల్లోనే నన్ను కొట్టడం మొదలుపెట్టాడు. సడన్‌గా నన్ను ఎందుకు కొడుతున్నాడో అర్థం కాలేదు, అయినా అతడు మంచివాడనే నమ్మాను. నేనే ఏదైనా పొరపాటు చేశానేమోనని మనసుకు సర్ది చెప్పుకున్నాను. కానీ తరచూ నన్ను హింసించేసరికి భరించలేకపోయాను, వదిలి వెళ్లిపోతానన్నాను. అలా చేస్తే నన్ను, నా పేరెంట్స్‌ను చంపేస్తానని బెదిరించాడు.

ఒకరోజు రాత్రి నన్ను చావబాదాడు. అతడు కొట్టే దెబ్బలకు నా దవడ పగిలింది. అతడి నాన్న ఫొటో చూపిస్తూ ఆయన మీద ఒట్టేసి చెప్తున్నా, ఈరోజు నిన్ను చంపడం ఖాయమంటూ నన్ను చితకబాదాడు. నాకు ఫొటో చూపించిన తర్వాత ఫోన్‌ను పక్కన పెట్టేందుకు కొంచెం దూరం వెళ్లగానే సడన్‌గా నా చెవిలో అమ్మ గొంతు వినిపించింది. అంతే, ఆ క్షణం నా ఒంటిమీద బట్టలున్నాయా? లేదా? డబ్బులు అవసరమా? కాదా? ఇవేవీ ఆలోచించలేదు. బతికి బట్టగడితే అంతే చాలనుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తాను. నా ఇంటికి వచ్చేశాను. ఇంకెప్పుడూ తిరిగి అతడి దగ్గరకు వెళ్లాలనుకోలేదు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే వారు నా మాటలు నమ్మలేదు. కానీ రాతపూర్వకంగా ఫిర్యాదు చేసేసరికి కేసు నమోదు చేసుకున్నారు అని చెప్పుకొచ్చింది.

కాగా ఫ్లోరా 2018లో మీటూ ఉద్యమం సమయంలో తొలిసారిగా తన మాజీ ప్రియుడు చేసిన అకృత్యాలను బయటపెట్టింది. ఇక సినిమాల విషయానికి వస్తే తెలుగులో నరసింహనాయుడు, నువ్వు నాకు నచ్చావ్‌ లాంటి సినిమాల్లో నటించింది. హిందీలో లవ్‌ ఇన్‌ నేపాల్‌, దబాంగ్‌ 2, లక్ష్మి, ధనక్‌ సినిమాలు చేసింది. స్త్రీ చిత్రంలో దెయ్యం పాత్రలో భయపెట్టింది.

చదవండి: దే..వుడా, ఒకేరోజు 17 సినిమాలు
రేవంత్‌ ఇక మారడా? తిండి దగ్గర కిరికిరి అవసరమా?

మరిన్ని వార్తలు