‘మావ మావ మావా’ నుంచి పన్నెండు మెట్ల కిన్నెర పాట వరకు.. సూపర్‌ సక్సెస్‌

12 Sep, 2021 00:48 IST|Sakshi

‘సారంగదరియా’.. ‘రాములో రాములా’.. ‘నాది నక్కిలీసు గొలుసు’.. ‘గున్నా గున్నా మామిడి’... జనం పాటలు జోరు మీదున్నాయి. వెండితెరపై మోత మోగిస్తున్నాయి. పన్నెండు మెట్ల కిన్నెర కళాకారుడు మొగిలయ్య వంటి వారిని వెతికి మరీ సినిమాలకు పదాలిమ్మంటున్నాయి. కల్పించే పాటకు అంగీకారం డౌట్‌. జానపదానిది గ్యారంటీ సక్సెస్‌రేట్‌. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకూ జానపదం ఝల్లుమంటూనే ఉంది. ఘల్లుమంటూనే ఉంది.  సండే స్పెషల్‌...



జానపదం జనం నాల్కల మీద ఉంటుంది. అందుకే వెండితెర మీద కనపడి వినిపించగానే కనెక్ట్‌ అయ్యి కాసుల వర్షం కురిపిస్తూ ఉంటుంది. జానపద గీతం ఆర్గానిక్‌గా పుడుతుంది. తరాలపాటు నిలిచే శక్తిని కలిగి ఉంటుంది. అందుకే సినిమాల్లోకి రాగానే ఆ శక్తితో సూపర్‌హిట్‌ అవుతూ ఉంటుంది. సినిమాల్లో సన్నివేశాలు ఉంటాయి. సన్నివేశాలకు తగినట్టు పాటలు కడతారు. ఆ అన్ని సన్నివేశాలకు జానపదాలు సూట్‌ కావు. కాని కుదిరే సన్నివేశాలలో జానపదాలు పెట్టడానికి నిర్మాత దర్శకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే ఆ పాటలు తెర మీద మొక్కజొన్నల్ని పండిస్తాయి. భుజం మీద కడవలతో మెరుస్తాయి.



మావ మావ మావా...
‘మంచి మనసులు’ సినిమాలో ‘మావ మావ మావా’ పాట కలెక్షన్ల దుమారం రేపింది. అయితే జానపద గీతాల్లో శృంగారం వాచ్యంగా, అవసరంగా ఉంటుంది. ఆ రోజుల్లో ఈ పాటను కొందరు అశ్లీలంగా భావించారు కూడా. కాని సామాన్య ప్రేక్షకుడు ఉత్సాహపడ్డాడు. కేరింతలు కొట్టాడు. తెలుగు సినిమాల్లో కొసరాజు జానపద గీతాలను రసాత్మకంగా ప్రవేశపెట్టారు. జానపదం అంటే కొసరాజు వైపు చూడాల్సి వచ్చేది. ‘పెద్దమనుషులు’ సినిమా కోసం ‘నందామయా గురుడ నందామయా’, ‘శివశివమూర్తివి గణనాథ’... జానపదాల నుంచి ఇచ్చారు.

‘జేబులో బొమ్మ జేజేలా బొమ్మ’ (రాజు–పేద), ‘ఏరువాక సాగారో’, ‘ఒలియ ఒలి పొలియ పొలి’... (రోజులు మారాయి), ‘రామన్న రాముడు కోదండ రాముడు’ (లవకుశ).. ఇవన్నీ కొసరాజు కలం చివర నుంచి సిఖను అంటించుకున్నాయి. మరోవైపు పింగళి వంటి పెద్దలు జానపదం నుంచి తీసుకుని ‘కాశీకి పోయాను రామా హరే’ సరదా గీతాలను ఇచ్చారు. ఆరుద్ర ‘అత్తా ఒకింటి కోడలు’ సినిమాలో ‘తడికో తడిక’ అంటూ తడికను అడ్డం పెట్టుకుని జానపదులు చేసే సంవాదాన్ని పాట చేశారు. కొనకళ్ల వెంకటరత్నం ‘అదృష్టవంతులు’ సినిమాలో ‘మొక్కజొన్నతోటలో ముసిరిన చీకట్లలో’తో భవిష్యత్‌ ముఖ్యమంత్రి జయలలితకు ఒక అచ్చతెలుగు హిట్‌ పాట ఇచ్చారు.

పట్నంలో షాలిబండ
కలర్, బ్లాక్‌ అండ్‌ వైట్‌ సంధికాలపు సినిమాలు వచ్చే సరికి ఈ దూకుడు తగ్గింది. సినారె కొన్ని జానపద వరుసలను పాటలకు వాడి మెరిపించారు. ‘లగ్గమెప్పుడ్రా మామా అంటే’ (అమ్మమాట), ‘మాయ చేసి పోతివిరో నాగులు’ (జీవితం)... తదితరాలు జానపదాల రెక్కలను రేకులను తొడుక్కున్నాయి. అప్పుడే ‘అమాయకుడు’ సినిమాలో ఏ.వేణుగోపాల్‌ రాసిన జానపద వరుస ‘పట్నంలో షాలిబండ’ తెలంగాణ పదాలతో చమ్కాయించింది. ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’లో ‘వచ్చే వచ్చే వానజల్లు యాల్మది యాల’, ‘మంగమ్మగారి మనవడు’లో ‘నోమో నోమన్నలాల’... ఆ మట్టినెత్తావులను కొనసాగించాయి.

ఆ తర్వాత తొంభైలలో కూడా అడపా దడపా ఈ పాటలు వినిపించాయి. ‘మొండి మొగుడు పెంకిపెళ్లాం’లో సాహితి రాసిన ‘లాలూ దర్వాజ  లస్కర్‌ బోనాల్‌ పండగ’ పాట హిట్‌ అయ్యింది. ‘తమ్ముడు’ సినిమాలో ‘తాటిచెట్టు ఎక్కలేవు.. తాటికల్లు తెంపలేవు’, ‘ఖుషి’లో ‘బైబైయ్యే బంగారు రమణమ్మ’ వంటి జానపదాలు సందర్భానుసారం వినిపిస్తాయి. ‘కాలేజ్‌’ సినిమాలో ‘మాయదారి మైసమ్మో’ కుర్రకారును గెంతులేయించింది. జానపద బాణీలను తీసుకుని మలిచిన విప్లవ గీతాలు కూడా ఈకాలంలో వచ్చాయి. ‘నాంపల్లి టేషను కాడ రాజలింగో’, ‘హే లిగజిగిడి లంబాణి’, ‘ఎర్రజెండెర్రజెండెన్నీయలో’, ‘బండెనక బండి కట్టి’, ‘జంజంబల్‌ మర్రి వేయికాళ్ల జెర్రి’... ఇవన్నీ జనం నోళ్లలో నేటికీ నానుతున్నాయి.

గాజులోళ్లమే పిల్లా మేము
ఆర్‌.పి.పట్నాయక్‌ వంటి సంగీత దర్శకుల హయాంలో ఉత్తరాంధ్ర జానపదాలు వినిపించడం మొదలెట్టాయి. ‘నువ్వు–నేను’లో ‘గాజులోళ్లమే పిల్లా మేము’ పెద్ద హిట్‌ అయ్యింది. ‘మగధీర’లో ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా’ లైన్లు మెరిసి మాస్‌ అట్రాక్షన్‌గా నిలిచాయి. ఇది చాలారోజుల తర్వాత తిరిగి ‘పలాసా’ సినిమాతో మళ్లీ ఉత్తరాంధ్ర జానపదాల వైపు అందరూ చూస్తున్నారు.

నాది నక్కిలీసు గొలుసు
గత ఐదారేళ్లుగా మళ్లీ జానపదాలు ఊపు మీదున్నాయి. పెద్ద బడ్జెట్, చిన్న బడ్జెట్‌ సినిమాలు కూడా సందర్భం వస్తే జానపదాన్ని వదలడం లేదు. ‘అత్తారింటికి దారేది’లో ‘కాటమరాయుడా కదిరి నర్సింహుడా’ హల్‌చల్‌ చేసింది. ‘కృష్ణార్జున యుద్ధం’లో పెంచలదాసు రాసి పాడిన ‘దారి చూడు దమ్ము చూడు’ పెద్ద హిట్‌ అయ్యింది. ‘రాజా ది గ్రేట్‌’లో ‘గున్నా గున్నా మామిడి’, ‘పలాసా’లో ‘నాది నెక్కిలీసు గొలుసు’, ‘బావొచ్చాడోలమ్మ’, ‘శ్రీకారం’ లో ‘వస్తానంటివో పోతానంటివో’ హిట్‌ అయ్యాయి. శేఖర్‌ కమ్ముల ‘లవ్‌స్టోరీ’లో ‘సారంగ దరియా’ పాట ఆ సినిమా రిలీజ్‌ కాక ముందే పెద్ద హిట్‌ అయ్యింది. ‘అల వైకుంఠపురంలో’ నుంచి ‘రాములో రాములా’, ‘రంగస్థలం’లో ‘ఆగట్టునుంటావా’... ఇవన్నీ కొత్త సినిమా సక్సెస్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచాయి. రాబోయే ‘వరుడు కావలెను’ లో ‘దిగు దిగు దిగు నాగ’, ‘భీమ్లా నాయక్‌’లో మొగిలయ్య సాకీ ఇవన్నీ జానపదం శక్తిని, అవసరాన్ని చూపుతున్నాయి.తెలుగు పల్లెల్లో, తెలుగు సినిమాల్లో జానపదం జెండా ఎగురుతూనే ఉండాలి.


మరిన్ని వార్తలు