ఇండియన్‌ సినిమాలు... ఫారిన్‌ విలన్లు! 

24 Mar, 2023 06:12 IST|Sakshi

భారతీయ కథలు ఇప్పుడు దేశీ ప్రేక్షకులతో పాటు విదేశీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే విదేశీ ఫైట్‌ మాస్టర్స్‌ ఇండియన్‌ సినిమాలకు ఫైట్స్‌ కంపో జ్‌ చేస్తున్నారు. ఇప్పుడు ఫారిన్‌ ఆర్టిస్టులు కూడా అరంగేట్రం చేస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఎన్టీఆర్‌ సరసన ఫారిన్‌ బ్యూటీ ఒలీవియా మోరిస్‌ నటించారు. అంతకుముందు అమీ జాక్సన్‌ వంటి తారలు కూడా వచ్చారు. ఇప్పుడు ఫారిన్‌ విలన్లు  వస్తున్నారు. వారి గురించి తెలుసుకుందాం. 

 హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్‌ కాంబోలో 1996లో వచ్చి న ‘ఇండియన్‌’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్   2’ తెరకెక్కుతోంది. కమల్‌– శంకర్‌ కాంబోలోనే సెట్స్‌పై ఉన్న ఈ సీక్వెల్‌లో ముంబై బేస్డ్‌ బ్రిటిష్‌ యాక్టర్‌ బెనెడిక్ట్‌ గారెట్‌ ఓ కీ రోల్‌ చేశారు. ఆల్రెడీ ఆయన క్యారెక్టర్‌ తాలూకు షూటింగ్‌ కూడా పూర్తయింది.

‘‘ఇండియన్‌ 2’లో నా వంతు షూటింగ్‌ను పూర్తి చేశాను. అద్భుతమైన అనుభవం దక్కింది. ఈ సినిమా తెర మీద ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను’’ అని పేర్కొన్నారు బెనెడిక్ట్‌. కాగా ఈ చిత్రంలో బెనెడిక్ట్‌ది విలన్‌ రోల్‌ అనే ప్రచారం. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్‌ సింగ్, బాబీ సింహా, సిద్ధార్థ్‌ కీలక పాత్రలు చేస్తున్నారు.

ఇక కోలీవుడ్‌లో సుమారు ఆరేళ్ల క్రితం సెట్స్‌పైకి వెళ్లి ఇంకా రిలీజ్‌కు నోచుకోని చిత్రం ‘ధృవనక్షత్రం’. విక్రమ్‌ హీరోగా గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న స్పై యాక్షన్   ఫిల్మ్‌ ఇది. గతంలో ఆగిపో యిన ఈ సినిమా షూటింగ్‌ని ఇటీవలే మళ్లీ ఆరంభించారు. ‘ఇండియన్‌ 2’లో నటించిన బెనెడిక్ట్‌ గారెట్‌ ఈ మూవీలోనూ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

మరోవైపు ప్రస్తుతం విక్రమ్‌ నటిస్తున్న పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా ‘తంగలాన్‌’. ఈ చిత్రానికి పా రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఇంగ్లిష్‌ యాక్టర్‌ డేనియల్‌ కాల్టాగిరోన్‌ ఓ ప్రధాన  పాత్రపో షిస్తున్నారు. ఆయనది ప్రతినాయకుడి పాత్ర అని కోలీవుడ్‌ టాక్‌. ఇక ‘తంగలాన్‌’ విడుదల తేదీపై త్వరలోనే సరైన స్పష్టత రానుంది. 

ఇలా... రానున్న రోజుల్లో మరికొందరు ఇంగ్లిష్‌ యాక్టర్స్‌ ఇండియన్‌ సినిమాల్లో కనిపించే అవకాశం ఉంది.  

మరిన్ని వార్తలు