-

Chhello Show: ఆ నిర్ణయం సరైంది కాదు.. పునరాలోచించండి.. సినిమా చూడకుండానే..!

23 Sep, 2022 17:25 IST|Sakshi

అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ప్రతిష్ఠాత్మక ఆస్కార్ నామినేషన్స్‌కు ఎంపికైన గుజరాతీ ఫిల్మ్ 'ఛెల్లో షో'. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఆస్కార్ వేడుకల్లో 'బెస్ట్‌ ఇంటర్నేషనల్ ఫీచర్‌ ఫిల్మ్'( ఉత్తమ అంతర్జాతీయ చిత్రం) విభాగంలో పోటీకి ఎంపికైంది ఈ చిత్రం. ఆర్ఆర్ఆర్, ది కశ్మీర్ ఫైల్స్‌తో పోటీపడి మరీ రేసులో నిలిచింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా అందరిచూపు ఈ సినిమావైపు మళ్లింది. ఆస్కార్‌కు భారత అధికారిక ఎంట్రీగా 'ఛెల్లో షో'ను పంపాలని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది.

అయితే ఈ నిర్ణయంపై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అసలు ఈ చిత్రం భారతీయ చిత్రమే కాదని ఆరోపించింది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) తన నిర్ణయాన్ని పునరాలోచించాలని సూచించింది. ఛెల్లో షో హాలీవుడ్‌లో 'లాస్ట్ ఫిల్మ్ షో'గా విడుదలైందని తెలిపింది. విదేశీ చిత్రం కావడం వల్ల ఇండియా నుంచి ఆస్కార్‌ ఎంట్రీకి ఎలా అర్హత సాధిస్తుందని ప్రశ్నించింది.  

 ఈ అంశంపై ఎఫ్‌డబ్ల్యూఐసీఈ ప్రెసిడెంట్ బీఎన్ తివారీ మాట్లాడుతూ.. 'ఛెల్లో షో భారతీయ సినిమానే కాదు.. ఈ ఎంపిక సరైంది కాదు. పోటీలో ఇంకా ఆర్ఆర్ఆర్, కశ్మీర్ ఫైల్స్ లాంటి భారతీయ చిత్రాలు ఉన్నాయి. సిద్ధార్థ్ రాయ్ కపూర్ కొనుగోలు చేసిన విదేశీ చిత్రం కావడం వల్లే జ్యూరీ ఎంపిక చేసింది. మేము ప్రస్తుత జ్యూరీని రద్దు చేయాలని కోరుతున్నాం. జ్యూరీ సభ్యుల్లో సగం మంది ఎన్నో ఏళ్లుగా ఉన్నారు. వారిలో చాలా వరకు సినిమా చూడకుండానే ఓటేశారు.'లాస్ట్ ఫిల్మ్ షో'ఆస్కార్‌కు పంపితే, భారతీయ చిత్ర పరిశ్రమకే చెడ్డపేరు. దీనిపై కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు లేఖ రాస్తాం' అని తెలిపారు.

 ఆస్కార్‌ల ఎంపిక కమిటీకి  గతంలో అధ్యక్షునిగా పనిచేసిన దర్శకుడు టీఎస్ నాగభరణ ఈ అంశంపై మాట్లాడారు. 'మార్కెటింగ్, వినోదం విలువ, మాస్, కలెక్షన్స్  మాత్రమే ప్రమాణాలు కాదు ఆస్కార్‌లో గుర్తింపు తెచ్చేది. నేను కూడా భారతీయుడ్నే. సినిమా కేవలం అనేది ప్రజాదరణ మాత్రమే కాదు. మీ హృదయాన్ని హత్తుకుంటే చాలు' అన్నారు. ఛెల్లో షో గుజరాత్‌లోని సౌరాష్ట్రలో ఉన్న గలాలా గ్రామానికి చెందిన  తొమ్మిదేళ్ల బాలుడు కథతో తెరకెక్కించారు.  పాన్ నలిన్ దర్శకత్వ వహించిన ఈ చిత్రంలో  భవిన్ రాబరి, భవేశ్ శ్రీమాలి, రిచా మీనా, డిపెన్ రావెల్ ప్రధానపాత్రల్లో నటించారు. 

మరిన్ని వార్తలు