'గాలి సంపత్' మూవీ రివ్యూ‌

12 Mar, 2021 00:03 IST|Sakshi

రివ్యూ టైమ్‌ 

చిత్రం: ‘గాలి సంపత్‌’;
తారాగణం: రాజేంద్రప్రసాద్, శ్రీవిష్ణు, లవ్లీ సింగ్, సత్య, తనికెళ్ళ భరణి, శ్రీకాంత్‌ అయ్యంగార్, అనీశ్‌ కురువిల్లా;
కథ: ఎస్‌. కృష్ణ;
సంగీతం: అచ్చు రాజమణి;
కెమేరా: సాయి శ్రీరామ్‌;
ఎడిటింగ్‌: బి. తమ్మిరాజు;
నిర్మాతలు: ఎస్‌. కృష్ణ, హరీశ్‌ పెద్ది, సాహూ గారపాటి;
సమర్పణ, స్క్రీన్‌ ప్లే, మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ: అనిల్‌ రావిపూడి;
దర్శకత్వం: అనీశ్‌ కృష్ణ;
నిడివి: 119 నిమిషాలు;
రిలీజ్‌: మార్చి 11

కొన్ని కాన్సెప్టులు వినడానికి చాలా బాగుంటాయి. ఉద్విగ్నతకు గురిచేస్తాయి. అయితే, ఆ కాన్సెప్టును సరైన రీతిలో కథగా డెవలప్‌ చేసుకొని, ఆసక్తికర సన్నివేశాలతో అల్లుకున్నప్పుడే పూర్తిస్థాయి సినిమా స్క్రిప్టు అవుతుంది. లేదంటే, మంచి కాన్సెప్టు సైతం మెచ్చుకొనే రీతిలో తయారు కాలేదని పెదవి విరవాల్సి వస్తుంది. ‘గాలి సంపత్‌’ చూశాక ఇలాంటి ఆలోచనలు మనసులో సుడులు తిరుగుతాయి. ప్రకృతి దైవం లాంటిది. అప్పుడప్పుడు కొంత హాని చేసినట్టనిపించినా, దాని స్వభావం మనల్ని రక్షించడమే అనే పాయింట్‌ చెప్పేందుకు ఈ 2 గంటల చిన్న సినిమాలో ప్రయత్నించారు. 

కథేమిటంటే..:  అరకులో ట్రక్కు డ్రైవర్‌ సూరి (శ్రీవిష్ణు). తల్లి లేని అతనికి తండ్రి సంపత్‌ (రాజేంద్రప్రసాద్‌) ఒక్కడే ఉంటాడు. నోట మాట పోవడంతో, ‘‘ఫి... ఫి... ఫీ’’ అంటూ గాలితో మాట్లాడుతుంటాడు కాబట్టి, ఆ తండ్రి పేరు గాలి సంపత్‌. గొప్ప నటుడిగా పేరు తెచ్చుకోవాలని నాటక పోటీలలో పాల్గొంటూ, ఉంటాడు గాలి సంపత్‌. ఆ ఊరి సర్పంచ్‌ కూతురు (లవ్లీ సింగ్‌)ను ప్రేమిస్తాడు సూరి. అప్పులు తీర్చేసి, ఎలాగైనా ఓ ట్రక్కు కొనుక్కొని, ఆమెను పెళ్ళాడాలని మనోడి ప్లాన్‌. ఓ బ్యాంకు మేనేజర్‌ను మొహమాటపెట్టి, 5 లక్షలు తెస్తాడు. తీరా నాటక పోటీల కోసం ఆ డబ్బు అతని తండ్రి తీస్తాడు. దాంతో, కంటికి కనిపించకుండా పొమ్మని కొడుకు అంటాడు. ఆ క్రమంలో హోరున కురుస్తున్న వర్షంలో ఇంటి వెనకే లోతైన పెద్ద గోతిలో పడిపోతాడు తండ్రి. పైకి మాట్లాడలేని, అరవలేని ఆ మనిషి ఆ గోతిలో పడ్డ సంగతి ఎవరూ గమనించరు. అతనికై వెతుకులాట సాగుతుంది. 

తండ్రిని ద్వేషిస్తున్న కొడుకుకు తన కోసం చిన్నప్పుడు తండ్రి చేసిన త్యాగం లాంటివన్నీ సెకండాఫ్‌లో ఫ్లాష్‌ బ్యాక్‌లో వస్తాయి. చివరకు ప్రకృతిని ద్వేషించిన తండ్రికి ఆ ప్రకృతే ఎలా సహకరించింది, అతని అభినయ ప్రతిభ ఎలా బయటపడిందన్నది అక్కడక్కడ మెరుపులతో సాగే మిగతా కథ. ఎలా చేశారంటే..:  లేటు వయసులో ఘాటు పాత్ర దక్కడం ఏ నటుడికైనా వరం. నాలుగు దశాబ్దాల పైచిలుకు తరువాత నటుడు రాజేంద్రప్రసాద్‌ కు ఇప్పుడు అలాంటి వరం మరోసారి దక్కింది. ఈ సినిమా టైటిల్‌ రోల్‌ ఆయనదే. ఇంకా చెప్పాలంటే, కథ అంతా ఆయన చుట్టూరానే తిరుగుతుంది.ఆయన తన నట విశ్వరూపం చూపెట్టారు. శ్రీవిష్ణు బాగా చేశారు. మహారాష్ట్ర మోడలింగ్‌ అమ్మాయి లవ్లీ సింగ్‌ ఈ సినిమాలో అందానికీ, అభినయానికీ కూడా తక్కువే. మిగిలిన పాత్రల్లో గోదావరి గ్రామీణ బ్యాంక్‌ మేనేజర్‌ గా శ్రీకాంత్‌ అయ్యంగార్,  ఆడిటింగ్‌ ఆఫీసర్‌ గా అనీశ్‌ కురువిల్లా లాంటి వారి కామెడీ అక్కడక్కడ ఫరవాలేదనిపించినా, అతిగా సాగదీసే సరికి ఉసూరుమనిపిస్తుంది.

ఎలా తీశారంటే..:  వరుస హిట్లతో జోరు మీదున్న దర్శకుడు అనిల్‌ రావిపూడి. ఆయన ఈసారి ఈ చిన్న కథ, తెలుగు తెరపై కొత్త ప్రయత్నంతో సినీ నిర్మాణంలోకీ వచ్చారు. తానే మాటలు, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. అరకులో చిత్రీకరించిన ఈ సినిమాలో ప్రధానమైనది తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌. అది అక్కడక్కడా పండింది. కానీ, కొడుకు ఎవరిని ప్రేమిస్తున్నాడో తండ్రికి తెలియకపోవడం, సాక్షాత్తూ కొడుకు పెళ్ళినే అతను చెడగొట్టడం అంత కన్విన్సింగ్‌గా లేదు. ఫ్లాష్‌బ్యాక్‌ బాగున్నా, తన చిన్నప్పుడు ఏం జరిగిందో కళ్ళారా చూసిన కొడుకుకు ఇంకొకరు చెప్పేవరకు అసలేం జరిగిందో తెలియదనడమూ పెద్దగా అతకలేదు. తీసుకున్న పాయింట్‌ బాగున్నా, కథారచనలో ఇలాంటి ఇబ్బందులున్నాయి. సహజ పరిణామ క్రమంగా కాక, అనుకున్నట్టల్లా సంఘటనలు జరిగిపోయే సినిమాటిక్‌ లిబర్టీలూ బోలెడు.

ఫస్టాఫ్‌లో చాలా భాగం అసలు కథకు రంగం సిద్ధం చేయడంతోనే సరిపోతుంది. రాజేంద్రప్రసాద్‌ మూకాభినయ (మైమ్‌) ప్రదర్శన దగ్గర నుంచి కాస్తంత ఊపు వస్తుంది. గోతిలో పడడ మనే పాయింట్‌ చుట్టూరానే కథ నడిస్తే బాగుండేది. కానీ, తీసుకున్న పాయింట్‌ చిన్నది కావడంతో కామెడీని జొప్పించే ప్రయత్నం చేశారు. అది అసలు కథా గమనానికి అడ్డమై కూర్చుంది. సెంటిమెంట్‌ పండుతున్న చాలా సందర్భాల్లో అనవసరపు హాస్యం అడ్డం పడినట్టు అనిపిస్తుంది. మరింత బలమైన సన్నివేశాలు రాసుకొని ఉంటే బాగుండేది. కొన్ని డైలాగులు మనసుకు హత్తుకుంటాయి. డైలాగులు లేని మైమ్‌ ప్రదర్శన, క్లైమాక్స్‌ గోతి సీన్‌ లాంటి చోట్ల అచ్చు రాజమణి నేపథ్య సంగీతాన్ని ప్రత్యేకించి ప్రస్తావించి తీరాలి. ఇవన్నీ సినిమాలో మంచి జీడిపలుకులు. కానీ, ఓవరాల్‌ గా వంటకంలోనే తీపి తగ్గింది. 

కొసమెరుపు:  కథ తక్కువ! గాలి ఎక్కువ!!

బలాలు:
►రాజేంద్రప్రసాద్‌ విశ్వరూపం, శ్రీవిష్ణు నటన
►అక్కడక్కడ మెరిసిన డైలాగ్స్, సెంటిమెంట్‌
►కీలక సందర్భాల్లో నేపథ్య సంగీతం

బలహీనతలు: ∙నిదానంగా సాగే ఫస్టాఫ్‌
►కథను పక్కదోవ పట్టించే అనవసరపు ట్రాక్‌లు
►సాగదీసిన గ్రామీణ బ్యాంక్‌ కామెడీ
►రచయిత అనుకున్నట్టల్లా నడిచే సినిమాటిక్‌ సంఘటనలు 

రివ్యూ: రెంటాల జయదేవ 

మరిన్ని వార్తలు